Abn logo
Oct 10 2021 @ 22:40PM

ఇళ్ల పథకంపై ఆశలు

- నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లు మంజూరు
- సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారికి సహాయం
- విధివిధానాలు ఖరారు చేస్తున్న ప్రభుత్వం
- ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్‌
- జిల్లాలో నెరవేరని డబుల్‌బెడ్‌రూం ఇళ్ల లక్ష్యం
- 9వేల ఇళ్లకు గాను కట్టింది 3 వేల డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు మాత్రమే
- జుక్కల్‌ నియోజకవర్గంలో ఒక్క డబుల్‌బెడ్‌రూం పూర్తికాని వైనం

కామారెడ్డి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): పేదోడి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టింది ఇందులో భాగంగా జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు ఏడున్నర ఏళ్లుగా కొనసాగుతునే ఉన్నాయి. పనులు నత్తనడకన సాగుతుండడంతో లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటుంది. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని గత ఎన్నికలతో పాటు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి ఇళ్ల చొప్పున కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణం, పర్యవేక్షణ పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల వరకు సహాయం అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇళ్ల పథకంపై నిరుపేదల్లో మరోసారి ఆశలు రేకెత్తుతున్నాయి.
సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి సహాయం
డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ లక్ష్యం నెరవేరకపోవడంతో ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించేందుకు కొత్త పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సహాయం అందజేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి నిధులను సైతం గతంలోనే బడ్జెట్‌ సమావేశాల్లో పొందుపర్చారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు కొత్తగా రాష్ట్రంలో లక్ష వరకు ఇళ్ల నిర్మాణాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున ఇళ్లను కేటాయించే అవకాశాలు ఉన్నాయని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సహాయం అందించవచ్చని తెలుస్తోంది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణం, పర్యవేక్షణ అంతా పకడ్బందీగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఇళ్లకు కూడా కొన్ని ఇంటి నమూనాలను కూడా ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. మార్గదర్శకాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.
అక్రమాలకు తావివ్వకుండా
గత ప్రభుత్వాల సహాయంతో ఇళ్ల నిర్మాణాల పథకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ ఇళ్ల నిర్మాణాల లక్ష్యం నెరవేరకపోవడంతో తిరిగి సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఇళ్ల నిర్మాణాలకు నిధుల కేటాయింపుల విషయంలో అక్రమాలకు తావివ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలహీన వర్గాలకు చెందిన వారికి ఇళ్ల నిర్మాణాలకు సబ్సిడీ అందజేశారు. తర్వాత కూడా ఇళ్ల నిర్మాణాలకు డబుల్‌ ఇళ్లు మంజూరు చేస్తూ వచ్చారు. వైఎస్‌ఆర్‌ హయాంలో ఇందిరమ్మ నిర్మాణ గృహ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో కొందరు లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోకుండానే బిల్లులు కాజేశారు. చాలా వరకు అక్రమాలు జరిగాయి. తెలంగాణ ఏర్పాటు అయి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఏడాది పాటు సీఐడీ దర్యాప్తు పూర్తిచేసి అక్రమాలు జరిగినట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా గృహ నిర్మాణశాఖను ఎత్తివేశారు.
సంతృప్తి పరచని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు
బడుగు, బలహీన వర్గాల ప్రజల సొంతింటి కళను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పథకం ఎవరిని సంతృప్తి పరచలేకపోయింది. గడిచిన ఏడున్నర ఏళ్లలో రెండు దఫాలుగా ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూంలను మంజూరు చేసింది. మొదటి విడతలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 400 చొప్పున మంజూరు చేయగా రెండో విడతలో 1000 చొప్పున మంజూరు చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.04 లక్షల చొప్పున మంజూరు చేయగా ఆ డబ్బులు సరిపోవని భావించిన కాంట్రాక్టర్‌లు వాటిని పూర్తి చేసేందుకు ముందుకు రాలేదు. గత ఏడున్నర సంవత్సరాలుగా జిల్లాలో డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతునే ఉన్నాయి.
9వేల ఇళ్లకు గాను పూర్తయినవి 3వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల మాత్రమే
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.514 కోట్లతో 9వేల 754 డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ను మంజూరు చేసింది. ఇందులో 3,817 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 1721 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నాయి. 447 ఇళ్లకు ఇప్పటి వరకు టెండర్లు జరుగలేవు. కేవలం బాన్సువాడ నియోజకవర్గంలో మాత్రమే డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు కాస్తా పురోగతిలో ఉన్నాయి. ఇక్కడ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు కేటాయించారు. బాన్సువాడ నియోజకవర్గానికి 5,441 ఇళ్లు మంజూరు కాగా 2,391 ఇళ్ల నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకు కేటాయించారు. మిగతా ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. కామారెడ్డి నియోజకవర్గానికి 1,715 ఇళ్లు మంజూరు కాగా ఇందులో 1,383 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో వెయ్యి ఇళ్ల వరకు లబ్ధిదారులకు కేటాయించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 1,431 ఇళ్లు మంజూరు కాగా పూర్తయినవి కేవలం 34 మాత్రమే, జుక్కల్‌ నియోజకవర్గానికి 1,167 మంజూరు కాగా ఇందులో ఏ ఒక్కటి కూడా నిర్మాణం పూర్తికాలేదు.