Abn logo
Sep 25 2021 @ 02:29AM

చరిత్ర సృష్టించిన సెన్సెక్స్‌ 60000

మరో కీలక మైలురాయికి సూచీ 

ముంబై: దలాల్‌ స్ట్రీట్‌లో రికార్డుల మోత మోగుతోంది. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ చరిత్రలో తొలిసారిగా 60,000 మైలురాయికి చేరుకుంది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఆటో రంగ షేర్లలో కొనుగోళ్లతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు శుక్రవారం సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. వారాంతంలో సెన్సెక్స్‌ 60,333 వరకు ఎగబాకి ఆల్‌టైం ఇంట్రాడే రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. చివరికి 163.11 పాయింట్ల లాభంతో 60,048.47 వద్ద క్లోజైంది. సూచీకి ఈ ముంగిపూ జీవితకాల గరిష్ఠమే. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 17,947.65 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. ట్రేడింగ్‌ ముగిసే సరికి 30.25 పాయింట్ల లాభంతో 17,853.20 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో ఏషియన్‌ పెయింట్స్‌ షేరు 3.72 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది.


మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు 2 శాతానికి పైగా పుంజుకున్నాయి. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతి సుజుకీ, ఇన్ఫోసిస్‌ ఒక శాతానికి పైగా పెరిగాయి. టాటా స్టీల్‌ మాత్రం అన్నిటికంటే అధికంగా 3.60 శాతం పతనమైంది. ఎస్‌బీఐ 2 శాతం క్షీణించింది. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, అలా్ట్రటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. బీఎ్‌సఈలోని టెలికాం, రియల్టీ, టెక్నాలజీ, ఐటీ, ఆటో రంగ సూచీలు 2.77 శాతం వరకు ఎగబాకాయి. కాగా, బీఎ్‌సఈ మెటల్‌, హెల్త్‌కేర్‌, బేసిక్‌ మెటీరియల్స్‌, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌లు 2.31 శాతం వరకు తగ్గాయి. 


బ్లూచిప్‌ కంపెనీలతో పోల్చితే, చిన్న, మధ్య స్థాయి షేర్లు పనితీరులో వెనకబడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1.16 శాతం వరకు నష్టపోయాయి. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.261.23 లక్షల కోట్లుగా నమోదైంది. 


8 నెలల్లో 10,000 పాయింట్లు అప్‌  

ఈ ఏడాదిలో 25.75% వృద్ధి 

ఈ ఏడాదిలో ఇప్పటివరకు సెన్సెక్స్‌ 12,297.14 పాయింట్లు (25.75 శాతం) పెరిగింది. కరోనా సంక్షోభం దెబ్బకు గత ఏడాది మార్చిలో 8,828.8 పాయింట్లు (23 శాతం) క్షీణించిన సూచీ.. ఆ తర్వాత నెల నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. గత ఏడాది ద్వితీయార్థంలో జోరందుకున్న బుల్‌ ఇంకా అలుపెరుగకుండా పరుగెడుతోంది. 2020 తొ లి త్రైమాసికం (జనవరి-మార్చి) భారీ పతనాన్ని చవి చూసినప్పటికీ, గత ఏడాది మొత్తానికి సూచీ 15.7 శాతం వృద్ధి కనబర్చింది. 


బుల్‌ ర్యాలీకి కారణాలు 

అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల బూమ్‌ 

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్య లభ్యత 

కరోనా టీకా పంపిణీ కార్యక్రమంలో జోరు 

వృద్ధి పునరుద్ధరణపై సానుకూల అంచనాలు 


భారత మార్కెట్‌ చాలా హాట్‌ గురూ..!

ఈ ఏడాది భారత్‌ ప్రపంచంలోనే అత్యంత హాట్‌ మార్కెట్‌గా నిలిచింది. చైనా, అమెరికా మార్కెట్లు వెనకబడ్డాయి. భారతీయులెంత తెలివైనవారనేది మరోసారి స్పష్టమవుతోంది. 

 - జిమ్‌ రోజర్స్‌, అంతర్జాతీయ మార్కెట్‌ నిపుణుడు గడిచిన 18 నెలల కరోనా సంక్షోభ కాలంలో ప్రపంచ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మార్కెట్‌గా భారత్‌ నిలిచింది. మరింత మంది మదుపర్లు మార్కెట్లో ప్రత్యక్షంగా లేదా మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా పరోక్షంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. స్టాక్‌ మార్కెట్లో ఆటోమేషన్‌, నవతరం బ్రోకరేజీ సేవలు, తక్కువ వడ్డీ రేట్లు వంటి అంశాలు ఈక్విటీ మార్కెట్లకు కలిసివస్తున్నాయి. 

- ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌, బీఎ్‌సఈ ఎండీ, సీఈఓ వారంలో 1,000 

ఈ వారం మొత్తానికి సెన్సెక్స్‌ 1,032.58 పాయింట్లు (1.74 శాతం), నిఫ్టీ 268.05 పాయింట్లు (1.52 శాతం) లాభపడ్డాయి. 


ఫాస్టెస్ట్‌ 10కే

ఈ జనవరిలో తొలిసారిగా 50,000 మైలురాయి ని తాకిన సెన్సెక్స్‌.. కేవలం 167 ట్రేడింగ్‌ సెషన్ల (8 నెలలు)లో మరో 10,000 (10కే) పాయింట్లు పుంజుకుంది. సూచీ అత్యల్ప కాలంలో లాభపడిన 10 వేల పాయింట్లివే. 


 31 ఏళ్లలో 1కే టు 60కే 

’’1990లో 1,000 పాయింట్లకు చేరిన సెన్సెక్స్‌.. 60 వేల మైలురాయికి చేరుకునేందుకు 31 ఏళ్లకు పైగా పట్టింది. 


‘1కే టు 30కే’కు  పాతికేళ్లు 

వెయ్యి (1990) నుంచి ముప్పై వేల (2015 మార్చి 4) పాయింట్లకు చేరుకునేందుకు సెన్సెక్స్‌కు 25 సంవత్సరాలు పట్టింది. 


ఆరేళ్లలో 30కే టు 60కే 

2015లో 30 వేల స్థాయి వద్దనున్న సూచీ గడిచిన ఆరేళ్లకు పైగా కాలంలో మరో ముప్పై వేల పాయింట్లు పెరి గింది.