Abn logo
Jun 12 2021 @ 00:31AM

చారిత్రక అవాస్తవాలు

హైదరాబాద్‌ దక్కన్‌ ఇండిపెండెంట్‌ రీసెర్చి గ్రూపు తరపున డా.కె.శ్రీరావ్‌ు, డా.ఎన్‌.అజయ్‌ పుచ్చలపల్లి సుందరయ్య గురించి (జూన్‌ 3, 2021) రాసినది అవాస్తవంగా ఉంది. చేకూరి కాశయ్యకు నివాళిగా మే 27వ తేదీన యలమంచిలి శివాజీ రాసిన వ్యాసంలో కొన్ని వివరాలు సరికాదని వారు భావించవచ్చు. కాని రెడ్డి హాస్టల్‌ చాలా మంది నిజాం వ్యతిరేక యోధులకు ఆశ్రయంగా ఉన్నమాట నిజం. సుందరయ్య 1953 వరకు అప్పటి తెలంగాణలో అడుగు పెట్టలేదని పైగా ఆయనే అలా రాసుకున్నారని వారు చెప్పడం అనేక విధాల పొరబాటు.


తెలంగాణలో ప్రగతిశీలవాదులతో సంబంధాలు పెట్టుకుని సంఘటితపరచడంలో చండ్ర రాజేశ్వరరావు ముఖ్యపాత్ర వహించారు. అయితే సాయుధ పోరాటానికి అంకురార్పణ జరగకముందు నుంచే సుందరయ్యకూ సంబంధం ఉంది. 1945లో ఖమ్మంలో ఆంధ్ర మహాసభ సందర్భంగా జరిగిన అతిపెద్ద సమీకరణలో పాల్గొన్నవారికి ఆయన అక్కడే ఉండి సూచనలిచ్చారు. ఆ సభలో ఆంధ్ర కమిటీ తరపున ఆయనను మాట్లాడమని ఆహ్వానిస్తే ఆయన రాజేశ్వరరావునే మాట్లాడమన్నారు. 1945 నాటికే తెలంగాణ జిల్లాలో పటిష్ఠమైన నిర్మాణా­నికి పునాదులు పడ్డాయని, తను అక్కడే ఉండి సమన్వయం చేస్తుండేవాడినని ఆయన ఆత్మకథలో రాసుకున్నారు. రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చిర్రావూరి లక్ష్మీ నరసయ్య వంటి వారు కమ్యూనిస్టు ఉద్యమం వైపు రాకపోయి ఉంటే అంత మార్పు వచ్చేది కాదని కూడా ఆయన స్పష్టంగా రాశారు.


1946లో సాయుధ పోరాటం మొదలైన తర్వాత శిక్షణలోనూ పాలుపంచుకున్నారు. 1948లో పోలీసు చర్య తర్వాత పిండిప్రోలు మీదుగా తెలంగాణలో ప్రవేశించానని కూడా మరోచోట రాశారు. దళాలతో తన అనుభవాలే గాక వ్యక్తిగతంగానూ ఎందరో యోధులు, సాధారణ కార్యకర్తల గురించి కూడా గుర్తుచేసుకున్నారు. 1950లో పోరాటం విరమించాల్సి వచ్చినపుడు కూడా స్వయంగా అడవులలో దళాలను కలసి వారిని ఒప్పించే బాధ్యత తీసుకుని లోతట్టు ప్రాంతాలకు కూడా వెళ్లారు. ఈ పరిణామాలకు సంబంధించి కావలసింత సమాచారం ముద్రితమై ఉంది. ఆ పోరాటానికి ఆద్యంతం నాయకత్వం వహించిన కమిటీలో సుందరయ్య ఉన్నారు.


సైద్ధాంతిక చర్చలు, విభేదాలు ఎలా ఉన్నా ఆంధ్ర తెలంగాణ కమిటీలు వేరువేరుగా ఏర్పాటు చేయాల్సివచ్చినపుడు సుందరయ్య మొదట్లో తెలంగాణ కమిటీ బాధ్యత తీసుకున్నారు. తీవ్రమైన వ్యాధితో ఆపరేషన్‌ కోసం మాస్కో వెళ్తున్నపుడు అప్పటి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి ఏదైనా చేయాలా అని అడిగితే జైలులో ఉన్న తెలంగాణ యోధులను విడుదల చేయాలని కోరి మరీ సాధించారు. ఇవన్నీ చరిత్రకు సంబంధించిన వాస్తవాలు. ఆ పైన ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు గానీ, పరిశోధనా బృందాల పేరిట పని చేస్తున్నప్పుడు చరిత్రకు సంబంధించిన వాస్తవాలను వాస్తవంగానే నమోదు చేయడం ముఖ్యం. తెలకపల్లి రవి