Abn logo
Aug 7 2020 @ 03:28AM

భవనాలు నిలిచిపోతే ఆ వృథాకు బాధ్యులెవరు?

  • ఆ సొమ్మంతా ప్రజలదే.. ఖజానాకూ నష్టమే
  • అమరావతికి ఇప్పటివరకూ ఖర్చుచేసిందెంత?
  • దుర్వినియోగమవుతుంటే చూస్తూ ఊరుకోం
  • ఎలా రాబట్టాలో తర్వాతి విచారణలో తేలుస్తాం
  • ఏ స్థాయిలో నిర్మాణాలు నిలిచిపోయాయి?
  • అకౌంటెంట్‌ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చండి
  • దీనిపై గతంలోనే ఆదేశాలిచ్చాం
  • వివరాలన్నీ మా ముందుంచండి
  • పిటిషనర్లకు హైకోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ 14కు వాయిదా
  • రాజధాని నిర్మాణాలపై హైకోర్టు సూటి ప్రశ్నలు

అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలతో జరిగిన నష్టం పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ భవనాలు నిలిచిపోతే డబ్బంతా వృఽథానే కదా అని ప్రశ్నించింది. ‘అందుకు వ్యయం చేసిన సొమ్ము ప్రజలదే. అందువల్ల ఆ నష్టమూ ప్రజలకే. ఇది రాష్ట్ర ఖజానాకూ నష్టమే. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు’? అని నిలదీసింది. రాజధానిలో అభివృద్ధి పనుల కోసం ఇప్పటి వరకూ ఎంత ఖర్చు చేశారు? ఏ స్థాయిలో నిర్మాణాలు నిలిచిపోయాయి? వంటి వివరాలు తేలాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రజాధనం దుర్వినియోగమవుతుంటే తాము చూస్తూ ఊరుకోబోమని, ఆ మొత్తాన్ని ఎలా రాబట్టాలన్న విషయంపై తదుపరి విచారణలో తేలుస్తామని పేర్కొంది.


అందువల్ల అకౌంటెంట్‌ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చాలని, ఆ మేరకు గత విచారణలోనే తాము పిటిషనర్‌కు ఆదేశాలిచ్చామని గుర్తుచేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మొత్తం పిటిషన్లను ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లకు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.


వ్యయం, నష్టం లెక్కలు చెప్పండి..

రాజధాని అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని.. కార్యాలయాలు తరలిపోకుండా చర్యలు చేపట్టాలని.. సీఆర్‌డీఏ రద్దు మూడు రాజధానుల బిల్లులను శాసనమండలి సెలెక్ట్‌ కమిటీకి పంపినప్పటికీ.. రెండోసారి వాటిని శాసనసభలో ప్రవేశపెట్టడాన్ని సవాల్‌ చేస్తూ.. ఇలా రాజధాని అమరావతి వ్యవహారానికి సంబంధించిన మొత్తం 42 పిటిషన్లపై గురువారం త్రిసభ్య ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. రాజధాని కోసం ఎంత వ్యయమైంది? నిర్మాణాల నిలిపివేత వల్ల కలిగిన నష్టమెంత అన్న వివరాలను ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఉన్నవ మురళీధరరావుకు సూచించింది.

అకౌంటెంట్‌ జనరల్‌ను ప్రతివాదిగా చేరుస్తూ పిటిషన్‌ వేసేందుకు న్యాయవాది అంబటి సుధాకర్‌రావుకు మరో అవకాశం ఇచ్చింది. ఆ రెండు బిల్లులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై అసెంబ్లీ కార్యదర్శి తరఫు సీనియర్‌ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ.. ఆ బిల్లులు చట్టాలుగా మారాయని, అందువల్ల ఆ పిటిషన్‌ నిరర్ధకమని తెలిపారు. ధర్మాసనం ఆయన వాదనను తోసిపుచ్చింది. ఆ పిటిషన్‌ను రాజధాని సంబంధిత పిటిషన్లతో జత చేసింది. అదే విధంగా శాసనమండలి రద్దు కోరుతూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లనూ 14వ తేదీన విచారణ జరిగే పిటిషన్లతో జత చేసింది.

Advertisement
Advertisement
Advertisement