Abn logo
Mar 8 2020 @ 22:01PM

అందుకు టైం సరిపోవడం లేదు: మీనాక్షి చౌదరి

గత కొన్ని దశాబ్దాలుగా అందాల రాణులు వెండితెర మీద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, పరీక్షించుకుంటున్నారు కూడా! కొందరు అందాల పోటీల్లో విజేతలైనా, ప్రేక్షకుల మనస్సును మాత్రం గెలుచుకోలేకపోయారు. మరికొందరు ఇప్పటికీ వెండితెరను ఏలుతున్నారు. అలా వెండితెరను, తన అందచందాలతో ఏలాలనే కోరికతో మరో అందాల రాణి తెలుగు తెరకు పరిచయం కాబోతోంది ఆమె ఎవరో కాదు మీనాక్షి చౌదరి. సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా వెబ్‌ సిరీస్‌ చూసేవారికి మాత్రం మీనాక్షి సుపరిచితురాలే! మొదటిసారి ‘ఇచట వాహనాలు నిలుపరాదు’ అంటూ తెలుగువారికి పరిచయం కాబోతున్న మీనాక్షి చౌదరితో...


మీ గురించి?

మాది హర్యానా. మా ఫాదర్‌ ఆర్మీలో పని చేసేవారు. బ్రెయిన్‌ ట్యూమర్‌తో చనిపోయారు. మా మదర్‌ హౌస్‌ వైఫ్‌. నాకు ఓ బ్రదర్‌. 2018లోనే అందాల పోటీల్లో పాల్గొన్నాను. విజేతగా నిలిచాను. డెంటల్‌ సర్జరీలో డిగ్రీ చేశాను. నాకు స్విమ్మింగ్‌, బాడ్మింటన్‌ అంటే ప్రాణం. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నాను. బాడ్మింటన్‌ రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేస్తుంటాను. స్విమ్మింగ్‌ చేయాలంటే ఇప్పుడు టైం సరిపోవడం లేదు.


అందాల పోటీలలో పాల్గొనాలన్న కోరిక ఎప్పుడు కలిగింది?

చిన్నతనం నుంచీ అందాల పోటీలకు సంబంధించిన ఫొటోలు పేపర్లో రాగానే కట్‌ చేసి దాచిపెట్టుకునేదాన్ని పెద్దదాన్ని అయిన తరువాత నేను కూడా అలా పాల్గొని పేరు తెచ్చుకోవాలని అనుకునేదాన్ని. నా కోరిక రెండు సంవత్సరాల క్రితం తీరింది. చాలా పోటీల్లో పాల్గొన్నాను.


సినిమాల్లోకి కాకుండా వెబ్‌ సిరీస్‌లో ఎందుకు నటించారు?

అక్కడ ముందుగా అవకాశమొచ్చింది. ఇప్పుడంతా డిజిటల్‌మయం అయిపోయింది. వెబ్‌సిరీస్‌కు రోజురోజూకు ఆదరణ పెరుగుతోంది. వెండితెరకు ధీటుగా వెబ్‌సిరీస్‌ ప్రేక్షకులు పెరుగుతున్నారు. నేను నటించింది ఒక్క వెబ్‌ సిరీసే అయినా నాకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు చాలామంది నన్ను గుర్తుపట్టి మీ వెబ్‌ సిరీస్‌ బాగుంది, చాలాబాగా చేశారంటూ మెచ్చుకుంటున్నారు.


తెలుగులో అవకాశమెలా వచ్చింది?

నా వెబ్‌ సిరీస్‌ చూసి నాకు ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాలో అవకాశమిచ్చారు. 


ఇంతకు ముందు తెలుగుతో పరిచయముందా?

అస్సలు లేదు. తెలుగు సినిమా ఒప్పుకున్న తరువాత తెలుగు సినిమాలు చూడడం మొదలుపెట్టాను. 


భాష ఇబ్బందిగా అనిపించడం లేదా?

తెలియని భాషలో సినిమా అంటే ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుంది? ఇబ్బంది ఉంది కానీ, యూనిట్‌ సభ్యులు నాకు చాలా కో–ఆపరేట్‌ చేస్తున్నారు. అర్ధంకాని పదాలు ఇంగ్లీష్‌ లేదా హిందీలో చెబుతున్నారు. చిన్న చిన్న పదాలు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.


ఉత్తరాది అమ్మాయి కదా...బాలీవుడ్‌లో అవకాశం రాలేదా?

నాకు సినిమాల్లో చేయాలన్న ఆలోచన లేదు. ఎంత సేపూ వెబ్‌ సిరీస్‌ మీదే దృష్టిపెట్టాను. వాటి ద్వారానే తెలుగులో నాకు అవకాశమొచ్చింది. ప్రయత్నించి ఉంటే బాలీవుడ్‌లో కూడా అవకాశమొచ్చేదేమో నాకు తెలియదు. ముందుగా నాకు ఛాన్స్‌ ఇచ్చింది దక్షిణాది పరిశ్రమ కనుక ఇక్కడే నా మొదటి ప్రయార్టీ. నన్ను ఇక్కడ తమ సొంత అమ్మాయిలాగా ట్రీట్‌ చేస్తున్నారు.


నటి కాకపోయుంటే..?

దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎంతసేపూ అందాల పోటీల గురించే ఆలోచించేదాన్ని. అందులో నేను అనుకున్నది సాధించగానే వెబ్‌ సిరీస్‌లో అవకాశమొచ్చింది. ఇప్పుడు వెండితెరమీద. ఇవి లేకపోతే నా చదువుకు తగిన ఉద్యోగం చేసుకునేదాన్ని.

                                –కె.రామకృష్ణ

Advertisement
Advertisement
Advertisement