Abn logo
Sep 28 2020 @ 00:36AM

హీరోలే విలన్లు!

Kaakateeya

హీరోలుగా కొనసాగుతున్నవారు విలన్లుగా నటించడం తెలుగు తెరకు కొత్తేమీ కాదు. గతంలో చాలామంది అగ్రనాయకులు ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో మెప్పించారు. ఈతరంలో కూడా ఆ ట్రెండ్‌ కొనసాగుతోంది. ఎందుకంటే  ఇప్పటి కథానాయకులు ఎలాంటి లిమిటేషన్స్‌ పెట్టుకోవడం లేదు.  పాత్ర నచ్చితే  చాలు అందులో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్నా చేయడానికి వెనకాడడం లేదు...


బాలకృష్ణకు ఎదురుగా...

హీరో శ్రీకాంత్‌లో విలన్‌ యాంగిల్‌ గతంలో చూసిందే. ఆయన మరోసారి తనలోని విలనీని బయటకు తీసుకురాబోతున్నారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో శ్రీకాంత్‌ ఒక విలన్‌గా నటిస్తున్నారన్న వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. 


హీరో కన్నా విలన్‌ పాత్రలు చేయడమే ఒక రకంగా  కష్టమని అగ్ర కథానాయకులు చాలామంది చెబుతుంటారు. ప్రతినాయక ఛాయలున్న పాత్రలు సవాల్‌ విసిరేలా ఉంటాయనీ, నటనకు మంచి ఆస్కారముంటుందన్నది వారి మాట. ఒకప్పుడు మహిళా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న జగపతిబాబు ‘లెజెండ్‌’ సినిమాతో విలన్‌ పాత్రలకు శ్రీకారం చుట్టి, ఆ బాటలోనే కొనసాగుతున్నారు. కెరీర్‌ బిగినింగ్‌లో ప్రతినాయకుడిగా నటించి, ఆ తర్వాత హీరోగా మారిన శ్రీకాంత్‌ అప్పుడప్పుడు విలన్‌ పాత్రలు పోషించడానికి వెనుకడడం లేదు. తాజాగా బాలకృష్ణ నటిస్తున్న చిత్రంలో శ్రీకాంత్‌ ప్రతి నాయక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే  హాస్యనటుడిగా కెరీర్‌ ప్రారంభించి హీరోగా మారిన సునీల్‌ ఇటీవల మళ్లీ హాస్యనటుడిగా మెరుస్తున్నారు. తనలో కూడా భయపెట్టే విలన్‌ ఉన్నాడని నిరూపించడానికి  సునీల్‌ సిద్ధమవుతున్నారు. నాని, నవీన్‌ చంద్ర, ఆది పినిశెట్టి, కార్తికేయ వంటి యువ హీరోలు కూడా ప్రతినాయకులుగా నిరూపించుకున్నారు. 


భళా భల్లాలదేవ...

రానా దగ్గుబాటి స్టార్‌డమ్‌ అనే పదానికి చాలా దూరంగా ఉంటారు. కంటెంట్‌ పర్ఫెక్ట్‌గా ఉండి, పాత్ర నచ్చితే నిడివి తక్కువైనా ఆయన యాక్ట్‌ చేయడానికి సిద్ధమవుతారు. హీరోగా కొనసాగుతూనే ‘బాహుబలి’లో విలన్‌గా యాక్ట్‌ చేశారు. భల్లాలదేవుడి పాత్రలో అద్భుతంగా మెప్పించి భళా అనిపించుకున్నారు రానా. భవిష్యత్తులో కూడా ఛాలెంజ్‌ విసిరే పాత్ర దొరికితే విలన్‌గా నటించడానికి సిద్ధమని రానా తరచూ చెబుతుంటారు. 


తొలిసారి నాని ‘వి’లన్‌

న్యాచురల్‌ స్టార్‌గా పేరు పొందిన నాని రొమాంటిక్‌ కామెడీ, లవ్‌స్టోరీలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. మధ్యమధ్యలో క్లాసు, మాసు పాత్రలూ పోషిస్తుంటారు. రొటీన్‌కి భిన్నంగా ఆలోచించడం నానికి అలవాటు. కొన్నేళ్లగా తెలుగు పరిశ్రమలో హీరోగా గుర్తింపు ఉన్న ఆయన ‘వి’ సినిమా కోసం మొదటిసారి నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర పోషించారు. లవ్‌స్టోరీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ క్యారెక్టర్‌లకు నాని ఎంతగా న్యాయం చేస్తారో.. ఈ పాత్రకూ అంతే న్యాయం చేశారు. ‘అష్టాచమ్మా’ సినిమాతో నానికి హీరోగా తొలి అవకాశం ఇచ్చిన మోహనకృష్ణ ఇంద్రగంటి  ‘వి’ కథ చెప్పగానే నో అనకుండా అంగీకరించారు నాని. 


స్టైలిష్‌ విలన్‌...

తెలుగు, తమిళ భాషల్లో 20కుపైగా చిత్రాల్లో హీరోగా కనిపించిన ఆది పినిశెట్టి ‘సరైనోడు’ సినిమాతో విలన్‌గా మారారు. అందులో వైరం ధనుశ్‌గా పవర్‌ఫుల్‌ విలన్‌గా అల్లు అర్జున్‌తో పోటీపడి నటించి విలన్‌గా మెప్పించారు. అలాగే ‘అజ్ఞాతవాసి’లో సీతారామ్‌గా పవన్‌తో తలపడ్డారు. ఈ రెండు చిత్రాల్లో విలన్‌గా సక్సెస్‌ కావడంతో ఆది ఇకపై విలన్‌గా సెటిల్‌ అయిపోతారనే టాక్‌ వినిపించింది. కానీ ఆయన హీరో పాత్రలవైపే మొగ్గు చూపారు.   ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళంలో నాలుగు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.  అయితే బలమైన విలన్‌ పాత్ర వస్తే తప్పకుండా చేస్తానని అంటున్నారు. 


సీమ విలన్‌గా..

‘అందాల రాక్షసి’తో హీరోగా పరిచయమయ్యారు నవీన్‌ చంద్ర. చూడడానికి మాస్‌ యాంగిల్‌లో కనిపించినా ఆయనలో రొమాంటిక్‌ కోణమూ ఉంది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్న ఆయన ‘నేను లోకల్‌’లో పోలీస్‌ ఆఫీసర్‌గా నెగెటివ్‌ షేడున్న పాత్ర పోషించారు. ఆ తర్వాత ‘అరవింద సమేత వీరరాఘవ’లో బాలరెడ్డిగా వీరరాఘవుడితో తలపడ్డారు. అందులో రాయలసీమ విలన్‌గా  అలరించారు. ‘ఎవరు’ సినిమాలో  డీఎస్‌పీ అశోక్‌గా నెగెటివ్‌ షేడున్న పాత్రతో ఆకట్టుకున్నారు. 


ఐదో సినిమాకే విలన్‌గా..

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం కార్తికేయ హీరోగా నాలుగు సినిమాలు చేశారు. మంచి అవకాశం వచ్చిందని ప్రతినాయకుడి క్యారెక్టర్‌ చేయడానికి అంగీకరించారు. కెరీర్‌ బిగినింగ్‌లోనే విలన్‌ పాత్రలెందుకు అని సన్నిహితులు సలహాలు ఇచ్చినా అవేమీ లెక్క చేయకుండా కార్తికేయ మంచి పాత్ర దొరికినప్పుడు వదులుకోకూడదు అన్న ఉద్దేశంతో ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాలో నానికి విలన్‌ అయ్యారు. ఆ సినిమాలో దేవ్‌ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు  తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్లీ హీరోగా రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు కార్తికేయ. 


సునీల్‌లో కొత్త కోణం...

హాస్యనటుడిగా ఎన్నో చిత్రాలతో అలరించిన సునీల్‌ మధ్యలో హీరోగా కొన్ని సినిమాల్లో మెరిశారు. మళ్లీ తన బాటలోకి వచ్చిన ఆయన తనలోని కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు సందీప్‌ రాజ్‌ తెరకెక్కిస్తున్న ‘కలర్‌ ఫొటో’ చిత్రంలో సునీల్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు. తనదైన హాస్యంతో అలరించిన సునీల్‌ విలన్‌గా ఎలా ఉంటారో చూడాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే! 

‘చిత్రజ్యోతి’లో మరిన్ని ఆసక్తికర 

కథనాల కోసం ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. లేదా ఈ క్రింది యూఆర్‌ఎల్‌   

https://qrgo.page.link/aCZ62లో చదవండి.

Advertisement
Advertisement
Advertisement