Abn logo
Sep 27 2020 @ 03:10AM

మేనమామే యముడు!

Kaakateeya

బెదిరిస్తానని చెప్పి ప్రాణాలు తీశాడు

కులోన్మాద హత్య సూత్రధారి యుగేంధర్‌రెడ్డే

అవంతి తల్లిదండ్రుల అనుమతితోనే ప్రణాళిక


హైదరాబాద్‌ సిటీ/చందానగర్‌ సెప్టెంబరు26(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హేమంత్‌ కులోన్మాద హత్య వివరాలు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. అవంతి మేనమామ యుగేంధర్‌రెడ్డే ఆమె భర్త హేమంత్‌ కిడ్నాప్‌, హత్యకు సూత్రధారి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం వ్యవహారంలో అవంతి తల్లిదండ్రులు అర్చనారెడ్డి, లక్ష్మారెడ్డి, డబ్బుల కోసం కిడ్నా్‌పలో పాల్గొన్న భిక్షపతి యాదవ్‌, షేక్‌ సాహెబ్‌, ఎరుకల కృష్ణ, పాషాలతోపాటు యుగేంధర్‌రెడ్డి మిత్రులైన మరికొందరి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. కిడ్నాప్‌, హత్యతో సంబంధం ఉన్న బంధువులందర్నీ శుక్రవారమే పోలీసులు అరెస్టు చేశారు. కిరాయి హంతకుల్లో భిక్షపతి యాదవ్‌, షేక్‌ సాహెబ్‌ కూడా శుక్రవారమే పట్టుబడ్డారు. శనివారం ఎరుకల కృష్ణ, పాషా స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోయారు. అవంతి-హేమంత్‌ జంట తమను అనుమానిస్తారని భావించిన తల్లిదండ్రులు కిడ్నాప్‌ కోసం అవంతితో కాస్త సఖ్యతగా ఉండే ఆమె మేనబావలు, వారి భార్యలు, మేనత్తలు, ఇతర కుటుంబ సభ్యులను రంగంలోకి దించారు. కుమార్తె ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకోవడంతో కుమిలిపోతున్న చెల్లె అర్చనారెడ్డి, బావ లక్ష్మారెడ్డిలను ఓదార్చుదామంటూ యుగేంధర్‌రెడ్డి వారందర్నీ బయల్దేరదీశాడు.


ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులంతా యుగేంధర్‌రెడ్డి వేసిన కిడ్నాప్‌ ఉచ్చులో చిక్కుకున్నారు. అవంతి-హేమంత్‌ జంటను విడదీసి తమ అమ్మాయిని వెంట తీసుకెళ్లాలని వచ్చిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా సీన్‌ రివర్స్‌ కావడంతో కటకటాలపాలయ్యారు. ఊహించని రీతిలో అంతా కిడ్నాప్‌, హత్య కేసులో ఇరుక్కొని జైలు పాలవడంతో అవంతి మేనత్తలు, మేనబావలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారిలో కొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కూడా ఉన్నారు. అక్కా బావలను ఓదార్చడానికి వచ్చిన యుగేంధర్‌రెడ్డి తమ్ముళ్లు, కొడుకులు, కోడళ్లు, బిడ్డలు వారి బాధను చూసి ఎలాగైనా అవంతిని హేమంత్‌ నుంచి విడదీయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. కొత్తగా అవంతితో మాటలు కలుపుకున్నారు. ఫోన్‌చేసి యోగ క్షేమాలు అడగటం చేస్తున్నారు. హేమంత్‌ గురించి, వారి కుటుంబం గురించి చెడుగా చెప్పడం ప్రారంభించారు. హేమంత్‌ మంచివాడు కాదని, కట్నం కోసం ఏమైనా చేస్తాడని, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడని, నిన్ను మధ్యలోనే వదిలేస్తాడని, ఇలా మనసులో విషం నింపే ప్రయత్నం చేశారు. అవంతి అవన్నీ పట్టించుకోలేదు. త్వరలోనే డబ్బు సంపాదించి సెటిల్‌ అయిన తర్వాతనే హేమంత్‌తో వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పినట్లు సమాచారం.


అవంతి తండ్రి లక్ష్మారెడ్డి సూచనల మేరకు యుగేంధర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి,  స్పందన, రాకే్‌షరెడ్డి, విజయేందర్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డి, స్వప్న, సందీ్‌పరెడ్డి, రజితలు(వారంతా అవంతికి మేనమామలు, మేనబావలు, అత్తలు, వదినలు) గురువారం మధ్యాహ్నం 2:30లకు మూడు కార్లలో గచ్చిబౌలిలో ఉంటున్న హేమంత్‌ కుమార్‌ ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామంటూ, హేమంత్‌ను, అవంతిరెడ్డిని తిట్టుకుంటూ, హేమంత్‌ను కొట్టుకుంటూ బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. తర్వాత అవంతి హేమంత్‌తో సహా కారులోంచి దూకేసింది. విడిగా వేరే కారులో కిరాయి హంతకులతో వచ్చిన యుగేంధర్‌రెడ్డి హేమంత్‌ను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లాడు. కాగా హేమంత్‌ హత్య కేసులో పరారీలో ఉన్న కిరాయి హంతకులు ఎరుకల కృష్ణ, మహ్మద్‌ పాషాలు శనివారం పోలీసులకు లొంగిపోయారు. హేమంత్‌ను హత్య చేసిన తర్వాత అతని ఒంటిపై ఉన్న ఉంగరం, బ్రాస్‌లెట్‌, ఇతర బంగారం ఆభరణాలను యుగేంధర్‌రెడ్డి సూచనల మేరకు ఎరుకల కృష్ణ వద్ద భద్రపరిచారు. హేమంత్‌ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో ఎరుకల కృష్ణ, పాషాలను పోలీసులకు లొంగిపోవాల్సిందిగా కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. దాంతో ఇద్దరూ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు లొంగిపోయారు. 


ఎంత డబ్బు కావాలో చెప్పు పడేస్తాం

మధ్యాహ్నం 2:30కు హేమంత్‌ను కిడ్నాప్‌ చేసిన నిందితులు సాయంత్రం 6:30 వరకు హత్య చేయలేదు. ఆ నాలుగు గంటలు ఏం చేశారన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. కొల్లూరు వద్ద ఓఆర్‌ఆర్‌ ఎక్కి పటాన్‌చెరు వద్ద దిగారు. ఆ తర్వాత సంగారెడ్డి,  జహీరాబాద్‌ మీదుగా హేమంత్‌ను కారులోనే కొట్టుకుంటూ తీసుకెళ్లారు. కాళ్లు చేతులు కట్టేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. నీకెంత కావాలో చెప్పు పడేస్తామంటూ యుగేంధర్‌రెడ్డి బేరసారాలకు దిగాడు. 3 గంటల పాటు హేమంత్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారు. ‘‘అవంతిని వదులుకోను. చావనైనా చస్తాను కానీ.. డబ్బుకోసం ప్రేమను చంపుకోను’’ అంటూ హేమంత్‌ ఎదురు తిరిగాడు.దీంతో సాయంత్రం 6:30కు ఉరిబిగించి అతడిని చంపేశారు. 

Advertisement
Advertisement
Advertisement