Abn logo
Oct 20 2020 @ 00:55AM

వి‘పత్తి’..వర్షాలకు భారీగా పత్తి పంట నష్టం

Kaakateeya

దిగుబడులపై తీవ్ర ప్రభావం

తేమ కారణంగా కొనుగోళ్లు వాయిదా !

ఈ ఏడాది రికార్డుస్థాయిలో పత్తి సాగు


ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కురిసిన అధిక వర్షం పత్తి రైతును చిత్తు చేసింది. ఆరంభంలో ఆశలు రేపిన తెల్లబంగారం ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతులను తెల్లబోయేలా చేసింది. ఏపుగా ఎదిగి ఊపుమీద ఉన్న పత్తి పంట అతివృష్టితో కురిసిన వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నది. వర్షపు నీటికి పత్తికాయలు రాలిపోవడమే కాకుండా పత్తిమొక్కలు కూడా నిలుపునా మురిగిపోయాయి. ప్రస్తుతం కాయలు పగిలి కళకళలాడాల్సిన పత్తి ఉమ్మడి జిల్లాలో నీటమునిగి అపార నష్టాన్ని కలిగించింది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)

ఈ ఏడాది రికార్డుస్థాయిలో పత్తిసాగు చేసిన రైతులకు ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో అత్యధికంగా పత్తి వేసిన రైతులు ఎక్కువ మంది దెబ్బతిన్నారు. పత్తి చేతికి అందుతున్న సమయంలో పడిన భారీ వర్షాలు పత్తి రైతును తీవ్ర నష్టం కలిగించాయి. అనేకచోట్ల పత్తి వేసిన రైతులు 30 నుంచి 50శాతం నష్టపోయారు. ఇంకా కొద్దిరోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావారణశాఖ వెల్లడించ డంతో పత్తి వేసిన రైతులు ఆందోళనతో ఉన్నారు. ఇప్పటికే చాలాచోట్ల కాయలు రాలిపోయాయి. వర్షానికి కుళ్లిపోయాయి. నల్లమచ్చలు వచ్చి బూజు పడుతోంది. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభం నుంచి వాతావరణం ఆశాజనకంగా ఉండడంతో ఉమ్మడి జిల్లాలో పత్తి రైతులు ఇబ్బడిముబ్బడిగా పత్తి సాగు చేశారు. దీంతో రికార్డుస్థాయిలో పత్తి సాగు జరిగింది. రంగారెడ్డిజిల్లాలో 2.70లక్షల ఎకరాల్లో రైతులు పత్తిసాగు చేశారు. ఈ ఏడాది దాదాపు 32లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు ఉంటాయని అంచనా వేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు 58వేల ఎకరాల్లో పత్తి పంట పాడైంది. అలాగే వికారాబాద్‌లో 2.53 లక్షలు సాగు చేయగా దాదాపు 87 వేల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. మేడ్చల్‌ జిల్లాలో 1100 ఎకరాల్లో పత్తిసాగు చేయగా ఇందులో 237ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ ఏడాది పత్తి క్వింటాల్‌ మద్దతు ధర రూ. 5,825గా నిర్ణయించారు. 


కొనుగోళ్లపై తర్జనభర్జన

పత్తి దిగుబడులు ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా భారత పత్తి సంస్థ (సీసీఐ) ద్వారా కొనుగోళ్లు ప్రారంభిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఈనెల 19 నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఈ నెల చివరి వారంలో సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయిం చారు. రంగారెడ్డిజిల్లాలో 15 పత్తి కొనుగోలు కేంద్రాలు, వికారాబాద్‌లో ఏడు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొనుగోళ్లపై తర్జనభర్జన పడుతున్నారు. వర్షాల కారణంగా పత్తిలో తేమ శాతం అధికంగా ఉండడంతో వీటి కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిం చాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీనికి తోడు రైతు వివరాల కంప్యూటరీకరణ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఆన్‌లైన్‌ ప్రక్రియకు అవరోధం కలగడంతోపాటు తడిసిన పత్తిని తీసుకునే విషయంలో అధికారులు ఆలోచనలో పడ్డారు. వాతావరణం అనుకూలిస్తే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి కొన్నిచోట్ల కేంద్రా లను తెరిచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తేమ ఎక్కువ ఉన్న పత్తిని కొందరు వ్యాపారులు తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే తమకు కొంత ప్రయోజనం కలుగుతుందని రైతులు ఆశపడుతున్నారు. 


ఆన్‌లైన్‌ ద్వారానే..

అక్రమ వ్యాపారాన్ని అడ్డుకునేందుకు పత్తి కొనుగోళ్లు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ చేశారు. ఇప్పటికే రైతుల వివరాలన్నీ దాదాపు  వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు పంపారు. రైతు ఇచ్చిన వివరాలన్నీ కంప్యూటరీకరించే ప్రక్రియ కూడా దాదాపు పూర్తికావొచ్చింది. రైతులకు ఇబ్బందులు లేకుండా సులభతరంగా కొనుగోళ్లు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పంట మార్కెట్‌కు తీసుకువచ్చే రైతు తన ఆధార్‌ నంబర్‌ చెప్పగానే ఆయన వివరాలన్నీ ఆన్‌లైన్‌లో చెక్‌చేస్తారు. రైతు తన బ్యాంకు ఖాత, ఆధార్‌, పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్‌ ప్రతులను సమర్పిస్తే  ఆన్‌లైన్‌లో సీసీఐ డబ్బులు చెల్లిస్తుంది. ఈ విధానం ద్వారా పంట విస్తీర్ణంతో సహా వచ్చే దిగుబడి కూడా నమోదు చేస్తారు.  పాస్‌ పుస్తకాలు లేకుండా కొందరు వ్యాపారులు చేసే అక్రమ వ్యాపారానికి ఇలా అడ్డుకట్ట వేసేందుకు ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేపట్టాలని చర్యలు తీసుకున్నారు. 

Advertisement
Advertisement