Abn logo
Sep 27 2020 @ 02:50AM

కుండపోత

Kaakateeya

భారీవర్షాలకు తడిసి ముద్దయిన రాష్ట్రం.. లక్షల ఎకరాల్లో నీటమునిగిన పంటలు

పొంగిన వాగులు.. కూలిన ఇళ్లు

పలు గ్రామాలు జలదిగ్బంధం

హైదరాబాద్‌లో ఇళ్లలోకి చేరిన వరద 

పాలమూరులో వాగులో వ్యక్తి గల్లంతు

నాగర్‌కర్నూల్‌లో వరదలో దంపతులు..

మంజీరాలో చిక్కుకున్న 

ఆరుగురు లారీ డ్రైవర్లు.. సురక్షితం

అప్రమత్తం.. కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం

మూసీ పరిసరాల ప్రజలు జాగ్రత్త: సీపీ

రేపటి నుంచి 3 రోజుల పాటు 

భారీ నుంచి అతి భారీ వర్షాలు 

రంగారెడ్డి జిల్లా నందిగామలో 19.4 సెంటీమీటర్లు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రాన్ని వర్షం వదలడం లేదు. దాదాపు అన్ని జిల్లాల్లో శనివారం వాన దంచికొట్టింది. లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వరదలో మునిగాయి. పొట్ట, గింజ దశలో ఉన్న వరిపంట.. కాయ దశలో ఉన్న పత్తి పంట.. కంకి దశలో ఉన్న జొన్న, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ప్రవాహాలకు వాగులు పొంగిపొర్లాయి. చెరువులు మత్తడి పోశాయి. కొన్నిచోట్ల గండ్లు పడ్డాయి. వరదకు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో 2-3 అడుగుల మేర నీరు నిలిచింది. రాష్ట్రంలో చాలాచోట్ల వర్షపాతం సగటుకన్నా ఎక్కువగానే నమోదైంది. నల్లగొండ జిల్లాలో 2వేల చెరువుల్లో 355 చెరువులు అలుగు పోస్తున్నాయి. 254 చెరువులు పూర్తిగా నిండాయి. మిగతా చెరువులు 50 నుంచి 75శాతం మేర నిండాయి. యాదాద్రి జిల్లాలో 70శాతం చెరువులు అలుగు పోస్తున్నాయి. బీబీనగర్‌ మండలం నుంచి పోచంపల్లి, వలిగొండ మండలాల మీదుగా రామన్నపేట వరకు మూసీ పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉరకలు వేస్తోంది. ఆలేరు, కొలనుపాక వాగులతో పాటు గంధమల్ల, కాల్వపల్లి, పాముకుంట వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇక్కడ 19.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 900 ఎకరాల్లో పెసర పంటకు నష్టం జరిగింది. చౌదరి చెరువు అలుగు పోస్తుండటంతో బృందావనపురం, వేణుగోపాలపురం, చెన్న కేశవపురం, కరవిరాల, కాగిత రామాచంద్రపురం, సిరిపురం, వల్లపురం, నారాయాణపురం, చాకిరాల, రత్నవరం, రామాపురం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా  జుక్కల్‌ మండలంలో సుమారు 800 ఎకరాల్లో సోయా, పత్తి, కంది పంటలు నీటమునిగాయి. పిట్లం మండలం కారేగావ్‌ పెద్ద చెరువుకు గండి పడింది. భద్రాద్రి జిల్లాలో సుమారు 21వేల ఎకరాల్లో పంటకు నష్టం జరిగింది. కరీంనగర్‌ జిల్లా గన్నేయవరం, చొక్కొరావుపల్లి మధ్యగల పెద్ద చెరువు అలుగుపోయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ సమీపంలోని ఖంజీపూర్‌ వంతెన తెగిపోయింది. సంగారెడ్డి, న్యాల్‌కల్‌, గుమ్మడిదల, కంగ్టి మండలాల్లో పత్తి, కంది పంటలు నీట మునిగాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో సికింద్రాబాద్‌, ఉప్పల్‌, నాంపల్లి, బేగంపేట, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, లంగర్‌హౌజ్‌, గోల్కొండ, పాతబస్తీలో భారీగా వర్షం పడింది.


శేరిలింగంపల్లిలో 5.2 సెం.మీ, పటాన్‌చెరులో 4.9 సెం.మీ, కూకట్‌పల్లిలో 4.3 సెంమీ, శేరిలింగంపల్లిలో 3.5 సెంమీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఈదులపల్లి శివార్లో ఓ పౌల్టీఫాంలోకి వరద రావడంతో 9,500 కోళ్లు మృతిచెందాయి. రూ.6లక్షల నష్టం జరిగినట్లు పౌలీ్ట్ర రైతు యాదగిరి రెడ్డి చెప్పారు. కొత్తూరులో 250 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నస్కల్‌, బర్కత్‌పల్లి, జాఫర్‌పల్లి, తొండపల్లి గ్రామాల్లో 100 ఎకరాల్లో పసుపు పంట నీట మునిగింది. షాద్‌నగర్‌లో రెండు ఇళ్లు, కొత్తూర్‌ మండలంలో రెండు ఇళ్లు, కుల్కచర్లలో 8 ఇళ్లు కూలిపోయాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నందిగామలో 19.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లాలో 19.1 సెం.మీ,  వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 10.7 సెం.మీ, నారాయణపేట జిల్లాలో 9సెం.మీ, నిర్మల్‌ జిల్లాలో 8.3 సెం.మీ, మహబూబ్‌నగర్‌ సిద్దిపేట జిల్లాల్లో 7.6 సెం.మీ చొప్పున, కరీంనగర్‌ జిల్లా, హైదరాబాద్‌లో 5.9 సెం.మీ చొప్పున, సంగారెడ్డి జిల్లాలో 5.8 సెం.మీ, వరంగల్‌ అర్బన్‌లో 5.5 సెం.మీ, సిరిసిల్ల జిల్లాలో 4.6 సెం.మీ, ఖమ్మం జిల్లాలో 4సెం.మీ, భద్రాద్రిలో 4.4 సెం.మీ,  నిజామాబాద్‌ జిల్లాలో 3.38 సెం.మీ, కామారెడ్డి జిల్లాలో 3.3 సెం.మీ, నల్లగొండ జిల్లాలో 2.96 సెం.మీ,  పెద్దపల్లి జిల్లాలో 2సెం.మీ వర్షపాతం నమోదైంది. 


వాగులు దాటుతూ.. 

మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం గొండ్యాల వద్ద వాగులో ఓ బడిలో స్వీపర్‌గా పనిచేస్తున్న రాములు (55) గల్లంతయ్యాడు. కామారెడ్డి జిల్లా ఖర్గావ్‌ పరిధిలోని మంజీరా వరద ఉధృతిలో ఆరుగురు ఇసుక లారీల డ్రైవర్లు చిక్కుకున్నారు. జుక్కల్‌లోని కౌలా్‌సనాలా ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి నీటిని వదలడంతో ఇసుక లారీల డ్రైవర్లను వరద చుట్టుముట్టింది. జేసీబీల సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. వనపర్తి జిల్లా జెర్రిపోతుల మైసమ్మ వాగును బైక్‌పై ఇద్దరు దాటుతుండగా వరదలో చిక్కుకోగా, చేపలు పట్టేందుకు వచ్చినవారు రక్షించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు పరిధిలో బైక్‌పై వాగును దాటుతున్న భార్యభర్తలు వరదలో చిక్కుకోగా, స్థానికులు కాపాడారు. 


ఉద్యోగులకు సెలవులొద్దు: సీఎస్‌

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లా అధికారులందరూ హెడ్‌ క్వార్టర్లలోనే ఉండి, పరిస్థితిని సమీక్షించాలని, అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులకు ఎలాంటి సెలవులను మంజూరు చేయవద్దని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని  ఆదేశించారు. వర్షాలపై ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లోని కంట్రోల్‌ రూంకు సమాచారమివ్వాలన్నారు.


కలెక్టర్లు జిల్లా యంత్రాం గాన్ని సమన్వయం చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కాగా భారీ వర్షాలతో శనివారం అర్ధరాత్రి తర్వాత మూసీకి వరద వచ్చే పరిస్థితి ఉందని,.. లోతట్టు ప్రాంతాలైన మాసబ్‌ట్యాంక్‌, కిషన్‌ బాగ్‌, జియాగూడ, పురానాపూల్‌, ఎంజీబీఎస్‌, చాదర్‌ఘాట్‌, గోల్నాక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ హెచ్చరించారు. ఆ ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, పిల్లలను బయటకు వెళ్లనివ్వొద్దని సూచించారు.

Advertisement
Advertisement
Advertisement