Abn logo
Sep 20 2020 @ 00:00AM

అరిగోస..భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు, వంకలు

Kaakateeya

వరద ముంపుతో అల్లాడుతున్న నిర్వాసిత గ్రామాలు

భీమా, పాలమూరు-రంగారెడ్డి రిజర్వాయర్ల కింద ఇబ్బందులు

పునరావాసం, పరిహారం పూర్తి చేయకపోవడమే అసలు కారణం


సాగునీటి ప్రాజెక్టుల కింద భూములను, ఇళ్లను వదులుకుని చెట్టుకొకరు, పుట్టకొకకరు మిగిలారు.. పునరావాసం కల్పించి పరిహారం పూర్తి స్థాయిలో ఇస్తే ఉన్న ఊరిని వదిలి వెళ్లిపోయిందుకు సిద్ధంగా ఉన్నారు.. కానీ, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడం వెరసి ప్రతి వర్షాకాలంలో ముంపు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.. ఏళ్లు గడుస్తున్నా పునరావాసం, పరిహారం పూర్తి చేయకపోవడంతో వరద ముప్పుతో అరిగోస పడుతూ, ఊర్లలోకి, ఇళ్లల్లోకి నీరు చేరి తాత్కాళిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు..


వనపర్తి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : భీమా ఫేజ్‌-2లో భాగంగా వనపర్తి జిల్లాలో నిర్మించిన శంకరసముద్రం రిజర్వాయర్‌ మొన్నటి వరకు ఊర్లలోకి నీరు రాకుండా చూసుకుని అధికారులు జాగ్రత్త పడ్డారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగి ముంపు గ్రామమైన కానాయపల్లిలో దాదాపు 15 ఇళ్లల్లోకి నీరు చేరింది. సగం ఊరి నిండా వరద చేరింది. అధికారులు గేట్లు తెరవకపోతే ఊరంతా ముంపునకు గురయ్యేది. ఇదే ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన రంగసముద్రం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పరిస్థితి అంతే. ఇక్కడ నాగరాల ముంపు గ్రామంలో కూడా నీరు చేరడంతో అధికారులు దాదాపు 10 ఇళ్లను ఖాళీ చేయించి ప్రభుత్వ కార్యాలయాల వద్ద తాత్కాళిక శిబిరం ఏర్పాటు చేశారు.


ప్రాజెక్టు ఎగువన ఉన్న శ్రీరంగాపూర్‌ గ్రామంలో ఇళ్లల్లోకి నీరు ఉబికి వస్తోంది. పాలమూరు-రంగారెడ్డిలో అంతర్భాంగా నిర్మిస్తున్న ఏదుల వీరంజనేయ రిజర్వాయర్‌లో బండరావిపాకుల గ్రామం ముంపునకు గురవుతోంది. రిజర్వాయర్‌ నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. కానీ, నిర్వాసితులకు ఇళ్లకు, ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం అందలేదు. పునరావాసం కూడా ఇంకా పూర్తికాలేదు. ఫలితంగా వారు గ్రామంలోనే ఉంటున్నారు. మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలకు ఏదుల కాలువతోపాటు కేఎల్‌ఐ కాలువలూ వరద నీటితో పొంగడంతో గ్రామంలోకి నీళ్లు వచ్చాయి. దాదాపు 20 ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. కొందరు వేరే గ్రామంలోకి వెళ్లగా, మరికొందరు ప్రభుత్వ పాఠశాల, పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో ఉన్నారు. 


తక్కువ ఖర్చు.. ఎక్కువ ప్రయోజనం

భీమా ఫేజ్‌-2 కింద నిర్మిస్తున్న రిజర్వాయర్ల పనులు వంద శాతం పూర్తయ్యాయి. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు పూర్తి చేసి, నిర్వాసితులకు పరిహారం ఇస్తే పథకం నిర్మాణం సంపూర్ణమవుతుంది. గతేడాది 53,600 ఎకరాలకు సాగునీరివ్వగా, నిర్మాణాలు పూర్తయితే 92 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం శంకరసముద్రం రిజర్వాయర్‌కు సంబంధించి రూ.4.37 కోట్లతో 110 ఎకరాల భూమి సేకరించి, రూ.8.15 కోట్లతో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మాణం పూర్తి చేశారు. నిర్వాసితుల పరిహారానికి సంబంధించి రూ.26.94 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.18.21 కోట్లు చెల్లించారు. మరో రూ.8.73 కోట్ల పరిహారం చెల్లిస్తే గ్రామాన్ని ఖాళీ చేయించి, దాదాపు 21 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు. కానాయపల్లి ముంపు వాసులకు వరద ముప్పును తప్పించవచ్చు. రంగసముద్రం రిజర్వాయర్‌ కింద రెండు గ్రామాలు మునకకు గురవుతుండగా, నాగరాల గ్రామంలో రూ.1.5 కోట్లతో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి స్థలం కొనుగోలు చేశారు.


ఇప్పటివరకు కాలనీలో మౌలిక వసతుల ఏర్పాటును ప్రారంభించలేదు. ఇక్కడ రూ.24.13 కోట్లు నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉండగా, రూ.3.82 కోట్లు మాత్రమే చెల్లించారు. మరో రూ.20.31 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదే రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న శ్రీరంగాపూర్‌ గ్రామంలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలం 6.20 ఎకరాలు కేటాయించారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు ప్రారంభించలేదు. నిర్వాసితుల పరిహారం రూ.1.90 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.39 లక్షలు చెల్లించారు. మరో రూ.1.51 కోట్లు చెల్లించాలి. మొత్తంగా సుమారు రూ.50 కోట్లు కేటాయిస్తే పూర్తి ఆయకట్టుకు నీరందే అవకాశం ఉంది. అలాగే ఇక్కడా నాగరాల ముంపు గ్రామం కష్టాలతోపాటు.. శ్రీరంగాపూర్‌ గ్రామంలో ఇళ్లలోకి నీళ్లు ఉబికి వస్తున్న కష్టాలను కూడా తప్పించవచ్చు. ఏదుల రిజర్వాయర్‌ కింద ప్రస్తుతం ఇళ్ల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పంపిణీ చేసేందుకు జాబితా సిద్ధమైంది. కొన్ని బోగస్‌ పేర్లు ఉండటంతో వాటిని తొలగిస్తున్నారు. త్వరితగతిలో పరిహారం అందజేస్తే.. ముంపు కష్టాలను దూరం చేయవచ్చు. 

Advertisement
Advertisement
Advertisement