Abn logo
Oct 22 2021 @ 00:52AM

ఓడీసీలో భారీ వర్షం..!

ఉధృతంగా ప్రవహిస్తున్న డొనేకల్లు వంక

అనంతపురం వ్యవసాయం/ఓబుళదేవరచెరువు/ఉరవకొండ/విడపనకల్లు,  అక్టోబరు  21:  జిల్లాలో 41 మండలాల్లో బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లాయి. అత్యధికంగా ఓడీసీలో 92.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉరవకొండలో 82.4, నల్లమాడలో 56.4, రొళ్ల 39.2, విడపనకల్లులో 33.6, గాండ్లపెంటలో 31.0, కదిరిలో 22.0 ,మడకశిరలో 17.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో 13.6 మి.మీలోపు వర్షపాతం నమోదైంది. గురువారం గుత్తి, వజ్రకరూరు తదితర మండలాల్లో చిరుజల్లుల నుంచి  ఓ మోస్తరు వర్షం పడింది. ఓబుళదేవరచెరువు మండలంలోని వెంకటాపురం, నారప్పగారిపల్లి, కొండకమర్ల తదితర ప్రాంతాల్లో వరిపంట నేలకొరగడంతో నష్టం వాటిల్లింది. రెండు రోజుల క్రితం వేరుశనగ పంటను తొలగించి, కట్టెను పొలాల్లోనే కుప్పలుగా ఉంచారు. వర్షం దెబ్బకు కట్లె పూర్తిగా తడిసిపోయింది. మండలంలోని నారప్పగారిపల్లి, నల్లగుట్లపల్లిలో వరి, వేరుశనగ పంటలు దాదాపు 20 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నందివారిపల్లి సమీపాన చింతచెట్టుపై పిడుగు పడటంతో చెట్టు కూలిపోయింది. ఆకుతోటపల్లికి చెందిన సూర్యనారాయణ ఇంటిపై పిడుగు పడి, ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఇంట్లోని టీవీ, ఇతర సామగ్రి కాలిపోయాయి. అల్లాపల్లి వద్ద కదిరి-హిందూపురం ప్రధాన రహదారి వంతెనపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఆటంకం కల్గింది. నారప్పగారిపల్లి వద్ద, గాజుకుంటపల్లి సమీపంలోని రామిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో సోమావతి నది ప్రవహించడంతో రాత్రి నుంచి ఉదయం వరకు ప్రజలు జలదిగ్బంధంలోనే ఉండాల్సి వచ్చింది. అలాగే ఉరవకొండ పట్టణంలో బుధవారం రాత్రి నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంక లు పొంగి పొర్లాయి. శివరామిరెడ్డి కాలనీలోని వంక ప్రవహించింది. పప్పుశనగ సాగు చేసేందుకు  నల్లరేగడి పొలాల రైతులు సిద్ధమవుతున్నారు. ఎండిపోతున్న కంది, ఆముదం పం టలకు ఈ వర్షం జీవం పోసినట్లైందని రైతులు ఆనం దిస్తున్నారు. విడపనకల్లు మండలంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. విడపనకల్లు-ఆర్‌ కొట్టాల మీదుగా వెళ్లే రోడ్డుపై ఆర్‌ కొట్టాల వద్ద పెద్ద వంక ఉధృతంగా ప్రవ హించటంతో గుంతకల్లుకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. విడపనకల్లు-ఆర్‌ కొట్టాల మీదుగా గుంతకల్లు తిరిగే బస్సు ను గురువారం రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. గడేకల్లు, అర్‌ కొట్టాల, విడపనకల్లు, పా ల్తూరు గ్రామాల్లోని వంకల వద్ద ఉన్న మిర్చి పంట పొలాలు నీట మునిగాయి. బళ్లారి-గుంతకల్లు 67వ జాతీయ రహదారిపై డొనేకల్లు వద్ద పెద్ద వంక ఉధృతంగా ప్రవ హించటంతో బళ్లారికి వెళ్లే బస్సులను గుంతకల్లు నుంచి ఉరవకొండ మీదుగా మళ్లించారు. 67వ జాతీయ రహదారిపై లారీలు, ఇతర వాహనాలు దాదాపుగా 5 కిలోమీటర్ల మేర ఉదయం నుంచి సాయంత్రం 3 గంటలు వరకు  నిలిచిపోయాయి. 3 గంటల తరువాత రాకపోకలు ప్రా రంభమయ్యాయి. సకాలంలో వర్షాలు రావటంతో పప్పుశనగ పంటకు ఉపయోగపడుతుందని రైతులు తెలిపారు.