Abn logo
Oct 21 2020 @ 01:27AM

వరదనీటితో ముప్పు

Kaakateeya

భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం లోతట్టు ప్రాంతాలు జలమయం నదులను తలపిస్తున్న రహదారులు

పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు అప్రమత్తమైన జిల్లాయంత్రాంగం పలుప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్‌, అధికారులు 

కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు ఘట్‌కేసర్‌లో మళ్లీ భారీ వర్షం నీట మునిగిన పంటలు 


జిల్లాలో నాలుగురోజులుగా కుండ పోతగా వర్షాలు కురుస్తున్నాయి. శివారులోని పలు మండలాలను ఈ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎగువ నుంచి వస్తున్న వర్షం నీటి వరదలతో పలు ప్రాంతాలన్నీ  జల మయమై జనజీవనం స్తంభించింది. సహాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): మేడ్చల్‌ మల్కాజ్‌గిరిజిల్లాలో సాధారణంగా జూన్‌నెల నుంచి ఇప్పటివరకు సగటున 624.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాలి. అయితే ఇప్పటివరకు జిల్లాలో 1159మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే గణనీయంగా 80శాతం మేరకు పెరిగింది. చిరుజల్లులు, ఓ మోస్తరు వర్షాలు కురిస్తేనే జనం ఉక్కిరిబిక్కిరి అవుతారు. అలాంటిది వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు ప్రాంతాల్లో ఉన్నవారు ఇళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని ఘట్‌కేసర్‌, కూకట్‌పల్లి, బాలానగర్‌, ఉప్పల్‌, మేడిపల్లి, కాప్రా, మల్కాజ్‌గిరి, దుండిగల్‌గండిమైసమ్మ, ఆల్వాల్‌, కీసర, తదితర మండలాల్లో భారీగా వర్షం కురిసింది.


భారీగా కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్‌, నిజామాబాద్‌, బీదర్‌, కరీంనగర్‌ వైపు వెళ్లే రహదారులపై నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కురిసిందంటే గంటల తరబడి నిరీక్షించి రోడ్లపై నీరు తగ్గాకే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నాగారం, ఈసీఐఎల్‌, ఘట్‌కేసర్‌ మండలం జోడిమెట్ల వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈసీఐఎల్‌ నుంచి కీసర, ఘట్‌కేసర్‌, శామీర్‌పేట్‌ వైపు వెళ్లే వాహనాలతో పాటు ఔవుటర్‌రింగురోడ్డు ద్వారా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు గ్రామాల్లో వైర్లు, స్తంభాలు నేలకూలడంతో విద్యుత్‌కి అంతరాయం ఏర్పడింది. గ్రామాల్లోని చెరువుల్లోకి నీరుచేరి పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు జలమయమయ్యాయి.


నీరు వేగంగా బయటకు వెళ్లేందుకు అధికారులు తాత్కాలికంగా జేసీబీలతో కాలువలను ఏర్పాటుచేస్తున్నారు. మునిసిపాలిటీల్లో, పలుగ్రామాల్లోని బీటీ, సీసీ, మట్టిరోడ్లన్నీ కొట్టుకుపోయి చిత్తడిగా మారిపోయాయి. శివారుమండలాల్లో నాలాలు పొంగిపొర్లడంతో రోడ్లపైకి నీరు చేరింది. భారీ వర్షాలకు ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు గానూ కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూంను ఏర్పాటుచేశారు. జిల్లాలో వర్షాలు, వరదలతో పాటు ఏదైన సమస్య వచ్చినట్టయితే వెంటనే కలెక్టరేట్‌లోని 9492409781, 08418297820 ఫోన్‌నెంబర్లలో సంప్రదించాలి. వర్షాలతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా అధికారులతో కలెక్టర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలతో పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే మాదిరిగా వర్షం కురిసిన పక్షంలో వరదకట్టలు తెగిపోయే ప్రమాదం ఉంది. వరితో పాటు జొన్న, పత్తి, కంది పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. జిల్లాలోని శామీర్‌పేట్‌, మేడ్చల్‌, కీసర మండలాల్లో టమాట, క్యారేట్‌, బీట్‌రూట్‌ తదితర కూరగాయ, ఆకుకూరల పంటలు నీట మునిగాయి. 

 

సహాయకచర్యలు ముమ్మరం చేయాలి: కలెక్టర్‌ 

కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మునిసిపల్‌, గ్రామపంచాయతీ అధికారులు పలు ప్రాంతాల్లో పర్యటించి, కాలనీ వాసులతో మాట్లాడారు. వరద ముంపు పరిస్థితిపై పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కాలనీల్లో నీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా తగినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


ఘట్‌కేసర్‌లో మళ్లీ భారీ వర్షం 

ఘట్‌కేసర్‌: ఘట్‌కేసర్‌లో మంగళవారం మధ్యాహ్నం మరోసారి భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలతో సతమతమవుతున్న  ప్రజలకు మరోసారి కురిసిన వర్షంతో ఇబ్బందులు అధికం అయ్యాయి. కేవలం గంట సేపట్లో 3సెంటీ మీటర్ల వర్షం కురవడంతో మళ్లీ వరద సమస్యలు తలెత్తాయి. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై జోడిమెట్ల, నారపల్లి వద్ద వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి జేసీబీ సహాయంతో మరిన్ని డివైడర్లను తొలగించి వరద నీరు కిందికి వెళ్లేలా చేశారు. 


నీటమునిగిన వరిపంటలు

ఘట్‌కేసర్‌ రూరల్‌: మండలంలోని అవుశాపూర్‌, అంకుశాపూర్‌, ఎదులాబాద్‌, మాదారం, మర్రి పల్లిగూడ, వెంకటాపూర్‌, ఘణపురం తదితర గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి వరిపంటలు నీట మునిగాయి. వారంరోజుల్లో కోయాల్సిన వరిచేను కళ్లముందే వర్షాలకు దెబ్బతిన్నదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తాము పండించి నష్టపోయిన పంటకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


మేడ్చల్‌లో దెబ్బతింటున్న పురాతన ఇళ్లు

మేడ్చల్‌: వరుసగా కురుస్తున ్న భారీ వర్షాలకు మేడ్చల్‌ పట్టణంలోని పలు వార్డుల్లో పురాతన ఇళ్లు దెబ్బతింటున్నాయి. మున్సిపల్‌ పరిధిలోని 3వ వార్డులో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కౌన్సిలర్‌ జకట దేవ పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్డులో దెబ్బతిన్న ఇళ్ల వివరాలను అధికారులకు అందజేయనున ్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి సహకారం అందేవిధంగా తనవంతుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.


నాగారం, దమ్మాయిగూడల్లో మోస్తరు వర్షం

కీసర రూరల్‌: నాగారం, దమ్మాయిగూడ మునిసిపాలిటీ పరిధిలో  ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షం తగ్గినా వరద నీటి ప్రవాహం ఆగక పోవటంపై బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ఇళ్లలోకి నీరు చేరి తినేందుకు తిండి లేక వారం రోజుల నుంచి పస్తులుంటూ పడరాని పాట్లు పడుతున్నారు. మరో రెండు రోజులు వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. చెరువులు, కుంటల లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 

Advertisement
Advertisement