Abn logo
Apr 30 2020 @ 12:48PM

ఆ దృశ్యం.. హృదయ విదారకం

వలస కూలీల కాలినడక కన్నీటి పర్యంతం

లాక్‌డౌన్‌ కొనసాగుతుందేమోనన్న అనుమానం

రోడ్డు మార్గంలో సొంత రాష్ట్రాలకు పయనం 


వరంగల్(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘ఎన్నడూ ఎరుగని కష్టం ఇది. ఉన్న ఊళ్ళో బతుకు దెరువు లేక ఊరుగాని ఊరుకు వచ్చినం. మాయదారి రోగం మమ్మల్ని ఆగం చేసింది. మా ఇంటి దగ్గర పిల్లలు చెప్పరాని కష్టాలు పడుతున్నరు. సర్కారు మాకు ఏం చేస్తే ఏం లాభం. మాకు కావాల్సింది. మా ఊరుకు మేం పోవడమొక్కటే. చేతులెత్తి దండం పెడుతున్నం. ఎట్లనయినా జేసి మా ఊళ్ళకు పంపించండి’ అని వలస కూలీలు వేడుకుంటున్నారు. ఎన్ని రోజులైనా ఎంత కష్టమైనా సరే.. అని తెగించి కాలినడకన తమ ఊళ్లకు బయలు దేరుతున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎంత నచ్చచెప్పినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పసిపిల్లలను చంకనేసుకుని, ముసలోళ్ళను వెంటబెట్టుకుని రాత్రనకా, పగలనకా పయనిస్తున్నారు.


వారం రోజులుగా పయనం. రాత్రింబవళ్ళు నడకే. 80 ఏళ్ళ వృద్ధురాలి నుంచి పాలుతాగే పసి పిల్లల వరకు ఆ బృందంలో ఉన్నారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నుంచి వారం రోజుల పాటు కాలినడకన బయలుదేరారు. బుధవారం హసన్‌పర్తి గ్రామం చేరుకున్నారు. కొంత సేపు సేదతీరారు. రోజుల తరబడి నడక వల్ల చెప్పులు తెగిపోయాయి. కాళ్ళన్నీ బొబ్బలెక్కాయి. తమ పాత బట్టలను చింపి  కాళ్ళకు పాదరక్షలుగా కట్టుకున్నారు. నడిరోడ్డుమీదే కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. వృద్ధులు, చిన్నారులు రోడ్డు మీదే కునుకు తీశారు. ఆ దృశ్యం నిజంగా హృదయ విదారకం. హసన్‌పర్తి యువత, పోలీసులు చలించిపోయారు. తమ వంతు సాయం అందించారు. కొద్ది సేపటి తర్వాత తిరిగి నడక ప్రారంభించారు. లక్ష్యం చేరేదాకా ఆగేది లేదంటున్నారు.


ఊరవతలి నుంచి నడక..

ప్రధాన రహదారి గుండా కూడా కాలినడకన ప్రయాణం చేయనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఊరవతలి నుంచి మరో ఊరు తగలకుండా ప్రయాణిస్తున్నారు. కొన్ని గ్రామాల ప్రజలు తమ వంతు సాయం అందిస్తున్నారు. రాత్రి 12 గంటల వరకు నడిచి ఎక్కడో ఒక చోట సేద తీరుతున్నారు. మహిళలు చిన్నపిల్లలు ఉండడంతో కొంత మంది యువకులు వారికి రక్షణగా ఉండి మిగిలిన వారు నిద్రకు అవకాశం కలిగిస్తున్నారు. 


40 వేల మంది వలస కూలీలు..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వలస కూలీలు దాదాపు 40 వేల మంది ఉన్నారు. ఏటా ఇక్కడికి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి కార్మికులు బతుకుదెరువుకోసం వస్తారు. రెండు మూడు నెలలు ఉండి తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోతారు. ఈసారి మాత్రం కరోనా వైరస్‌ వల్ల వారికి కష్టకాలం ఎదురైంది. కొద్దిమంది కూలీలు లాక్‌డౌన్‌ మొదలవగానే కాలినడకనే బయలుదేరారు. మరికొంత మంది యువకులు సైకిళ్ళ మీద పయనం గట్టారు. ఇంకా కొంతమంది రైల్వే స్టేషన్‌ల వద్దకు వెళ్ళి అవకాశం దొరికితే గూడ్స్‌ రైళ్ళల్లో సైతం తమ ఊర్లకు పయనం కట్టారు. ఇంకా కొంతమంది రాత్రింబవళ్లు  తమ ఊరు దిశగా నడక సాగిస్తూనే ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల మంది తమ సొంత ఊళ్ళ దిశగా పయనం సాగిస్తున్నారు. 


కొన ఊపిరితో నడుస్తున్నాం: 70 ఏళ్ళ తుల్జాబాయి

నాకు డెబ్బయి ఏళ్ళు. ఈ వయసులో ఎంత దూరం నడవగలను..? పొట్ట కూటికోసం ఇక్కడికి వచ్చాం. ఏదో పెద్ద రోగం వచ్చిందని అన్ని బంద్‌ చేసినారు. అక్కడ మా పిల్లలు ఆగం అవుతున్నరు. మా పిల్లలకు దూరంగా ఉండడం వల్ల నోటికాడికి ముద్ద కూడా పోవడం లేదు. మా వాళ్ల గురించే ఆలోచన. సర్కార్‌ చేయాల్సిన సాయం తిండి కాదు. మా ఊరికి మమ్మల్ని పంపించే ఏర్పాట్లు చేస్తే చాలు.  దారి మధ్యలో వచ్చే కొన్ని ఊర్లను దాటాలంటే ప్రాణాలరచేతిలో పెట్టుకుని నడవాల్సి వస్తోంది. మా ఊరి నుంచి నడవొద్దని ఆపుతున్నరు. అందుకే ఊరవతలి నుంచి నడుస్తున్నం.  మా జిల్లాకు సంబంధించిన నాయకులు, అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా పలకడం లేదు. మా నడక మాత్రం ఆపేది లేదు. సచ్చిపోతే ఈ మట్టిలోనే కలిసి పోతం. లేదంటే పానంతో మా ఊరు చేరుకుంటం.

Advertisement
Advertisement