Oct 15 2021 @ 15:42PM

ఆర్యన్ ఖాన్ అరెస్ట్... బాలీవుడ్ ప్రముఖుల కొత్త డిమాండ్...

సినిమా పరిశ్రమకి డ్రగ్స్ కొత్తేం కాదు. డ్రగ్స్ వాడుతున్నారంటూ కేసులు ఎదుర్కోవటం కూడా కొత్త కాదు. గ్లామర్ ప్రపంచంతో మత్తు పదార్థాలది గమ్మత్తైన అనుబంధం. అందుకే, అప్పుడప్పుడూ డ్రగ్స్‌కు సంబంధించి ఆరోపణలు రావటం, కేసులు నమోదు కావటం, అరెస్టులు జరగటం కొనసాగుతూనే ఉంటుంది. కొన్నాళ్ల క్రితం దక్షిణాదిలో కూడా టాలీవుడ్‌ని, శాండల్‌వుడ్‌ని డ్రగ్స్ కలకలం ఊపేసింది. కానీ, బాలీవుడ్‌లో షారుఖ్ కొడుకు ఆర్యన్ అరెస్టు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎంతగా అంటే, కొందరు ఏకంగా మత్తు పదార్థాల వాడకాన్నే చట్టబద్ధం చేయమని డిమాండ్ చేసేస్తున్నారు...


షారుఖ్‌కి, అతడి కుటుంబానికి సినిమా వాళ్లు దాదాపుగా అందరూ మద్దతుగా నిలుస్తున్నారు. రోజుకొకరు తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా స్వర భాస్కర్... ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ ఇవ్వకపోవటం ‘ప్యూర్ హరాజ్మెంట్’ అని కామెంట్ చేసింది! ఆమెలా కింగ్ ఖాన్ పట్ల సానుభూతి చూపుతున్న వారు చాలా మంది ఉన్నారు. వారిలో దర్శకుడు హన్సల్ మెహతా కూడా చేరారు. గతంలోనే ఆయన... ఆర్యన్ విషయంలో జరుగుతోన్న వ్యవహారం అంతా తండ్రిగా షారుఖ్‌కి ఎంతో బాధ కలిగిస్తుందని వాపోయాడు. కోర్టు కంటే ముందే జనం ఆర్యన్ని దోషిగా తేల్చేస్తున్నారని బాధని వ్యక్తం చేశాడు. తాజాగా బాద్షా వారసుడికి మళ్లీ బెయిల్ మంజూర్ కాకపోవటంతో ఆయన కొత్త డిమాండ్‌తో సొషల్ మీడియాలోకి వచ్చాడు... 


‘‘గంజాయి వాడకం చాలా దేశాల్లో చట్టబద్ధం చేసేశారు. చాలా చోట్ల ఇప్పుడది నేరం కాదు. మన దేశంలో మాత్రం గంజాయిని చాలా వరకూ వేధించటానికే సాకుగా చూపుతున్నారు. మత్తు పదార్థాల నియంత్రణ అంటూ పెద్దగా ఏం జరగటం లేదు. సెక్షన్ 377 రద్దు కోసం జరిగినట్టు దీని కోసం కూడా ఒక ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది!’’ అని హన్సల్ మెహతా తన సొషల్ మీడియా అకౌంట్లో రాశారు. ఈయనే కాదు సోమీ అలీ లాంటి మాజీ బాలీవుడ్ హీరోయిన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘నేను 15 ఏళ్లకే డ్రగ్స్ వాడాను. పిల్లలన్నాక ప్రయోగాలు చేస్తుంటారు. డ్రగ్స్ వాడకాన్ని డీక్రిమినలైజ్ చేయాలి’’ అందామె!


షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ తనయుడు, కాబోయే హీరో ఆర్యన్... అరెస్ట్ అవ్వటంతో బాలీవుడ్ తీవ్రంగానే స్పందిస్తోంది. చూడాలి మరి, మన సెలబ్రిటీలు చేస్తోన్న కొత్త కొత్త డిమాండ్స్ పట్ల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో, ప్రజలు ఏమంటారో...  

Bollywoodమరిన్ని...