Abn logo
Jul 10 2020 @ 04:57AM

పదును వర్షం

జిల్లా వ్యాప్తంగా భారీగా వానలు

ఉప్పొంగిన వాగులు, వంకలు

ఖరీఫ్‌ సాగు ఉత్సాహంలో రైతులు


కర్నూలు(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): వానాకాలం ఊపందుకుంది. కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్‌ సాగుకు తగిన వర్షపాతం నమోదైంది. గురువారం కురిసిన వానలకు వాగులు, వంకలు ఉప్పొంగాయి. రైతులు ఖరీఫ్‌ సాగు పనుల్లో ముమ్మరమయ్యారు. బేతంచెర్ల, కోడుమూరు, గోస్పాడు, బనగానపల్లి, నంద్యాల, బండి ఆత్మకూరు, కోడుమూరు, పాణ్యం, కర్నూలు తదితర మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. చెరువులకు నీరు భారీగా వచ్చి చేరింది. తుంగభద్ర నదికి వరద రావడం వల్ల సుంకేసుల జలాశయం నుంచి కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేశారు. గాజులదిన్నెకు నీరు చేరుతోంది. కోడుమూరు నుంచి వర్కూరు వైపు తుమ్మలవాగు ఉధృతంగా ప్రవహించడంతో కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. కోడుమూరు నుంచి వెంకటగిరి వైపు మొండికట్టవాగు, ముడుమలగుర్తి వైపు చిన్న, పెద్ద వంకలు ఉప్పొంగాయి.


గోరంట్ల వద్ద హంద్రీ నది పోటెత్తడంతో ఎర్రగుడి, కొత్తపల్లి పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బండి ఆత్మకూరులో వర్షానికి వీవర్‌ ్స కాలనీలో సీసీ రోడ్ల మీద నీరు ఉప్పొంగింది. వీధులన్నీ నీటి కుంటలను తలపించాయి. పాములపాడు మండలంలో జూటూరు ఊటవాగు, భానుముక్కల, ఇస్కాల సమీపంలో భవనాశి వాగు, చెలిమిల్ల సుద్దవాగులు స్వల్పంగా ప్రవహించాయి. గోనెగండ్ల మండలంలో పత్తి, వేరుశనగ, ఉల్లి పంటలు మునిగి పోయాయి. కోవెలకుంట్ల మండలం పెద్దకొప్పెర్ల- చిన్నకొప్పెర్ల గ్రామాల మధ్య కైపవాగు, చిన్నకొప్పెర్ల-వల్లంపాడు గ్రామాల మధ్య నల్లవాగు వంక, వల్లంపాడు-లింగాల మధ్య ఉన్న కప్పలవాగు ఉప్పొంగి ప్రవహించాయి.


దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఓర్వకల్లు మండలంలో ఓర్వకల్లు, కన్నమడకల, పూడిచెర్ల, నన్నూరు, లొద్దిపల్లె, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, హుశేనాపురం, సోమయాజులపల్లె, శకునాల, బ్రాహ్మణపల్లె తదితర గ్రామాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. రుద్రవరం మండలంలో వకులానది ఉధృతంగా ప్రవహించడంతో పేరూరు చిలుకలూరు, ఎర్రగుడిదిన్నె గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. 

Advertisement
Advertisement
Advertisement