Abn logo
Sep 30 2020 @ 05:13AM

మెసేజ్‌లు వచ్చాయి.. నగదు జమ కాలేదు..!

Kaakateeya

రెండు విడతల్లో 5379 మందికి అందని నేతన్న నేస్తం సొమ్ము


అనంతపురం అర్బన్‌, సెప్టెంబరు 29: అర్హులైన చేనేత కార్మికులు వైఎ్‌సఆర్‌ నేతన్న నేస్తం నగదు ప్రోత్సాహకం కోసం గత ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. 2019 డిసెంబర్‌లో అర్హులైన నేత కార్మికులకు నేతన్న నేస్తం కింద రూ.24 వేలు వారి బ్యాంకు అకౌంట్‌లో జమ చేయనున్నట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పంపారు. అయితే ఆ సొమ్ము నేటికి కూడా జమకాకపోవడంతో 5379 మంది చేనేతలకు  ఎదురుచూపులే మిగిలాయి. వలంటీర్లు, సచివాలయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సరైన సమాధానం దొరకడంలేదు. వ్యయ ప్రయాసాలకోర్చి జిల్లా కేంద్రంలోని చేనేత జౌళి శాఖ కార్యాలయానికి వచ్చినా స్పందించడం లేదంటూ చేనేతలు వాపోతున్నారు.  


సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చినా...

సొంత మగ్గం కలిగిన చేనేతలకు నేతన్న నేస్తం పేరుతో రూ.24 వేల ఆర్థిక సాయాన్ని  అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కుటుంబంలోని ఒకరికి మాత్రమే పథకాన్ని వర్తింపజేసేలా నిబంధనలు రూపొందించారు. 2019లో 27,338, ఈ ఏడాది 24,243 మంది నేతన్న నేస్తానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2019లో 2986, 2020లో 2393 దరఖాస్తులను తిరస్కరించారు. దరఖాస్తుల్లో సమగ్ర వివరాలు లేనందున బ్యాంకు ఖాతాలకు నగదు జమకాలేని కారణాలు చూపారు. దీంతో సంబంధిత దరఖాస్తుదారుల వివరాలు స్వీకరించారు. అనంతరం మరికొద్ది సమయంలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.24 వేల నగదు జమచేస్తున్నట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వచ్చినా ఇంతవరకు జమ కాలేదు. సమగ్ర సమాచారంతో కూడిన దరఖాస్తులను స్వీకరించడంలో అధికారులు విఫలమవడంతోనే అర్హులు బాధితులుగా మారారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


ముఖ్యమంత్రికే తెలియాలి : నీలూరి రుషింగప్ప, జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి

చేనేత రంగాన్ని అన్ని విధాలా అదుకుంటున్నామని,  అందుకే నేతన్న నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ఒకేసారి రూ.24 వేల ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నట్టు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి బాహాటంగా చెప్పుకుంటున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా 2019లో ధర్మవరం పట్టణంలో నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు. 5379 మంది అర్హత కల్గిన నేతన్నలకు ఆ సొమ్మును ఇంకా జమచేయక పోవడం ఏంటో ముఖ్యమంత్రికే తెలియాలి.


అధికారులకు నివేదించాం : రామప్ప, ఏడీ, చేనేత జౌళిశాఖ 

మొదటి విడతలో 2986 మంది, రెండో విడతలో 2393 మంది చేనేతలకు రూ.24 వేల నేతన్న నేస్తం నగదును ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5379 మంది అర్హతగల చేనేతల వివరాలను రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదించాం. త్వరలోనే జమ చేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement