Abn logo
May 22 2020 @ 05:56AM

హమ్మయ్యా..!

రెండు నెలల తరువాత గడప దాటిన జనం

రోడ్డెక్కిన పల్లెవెలుగు బస్సులు

cతెరుచుకున్న దుకాణాలు

వ్యాపార వర్గాల్లో సంతోషం

పలు పట్టణాల్లో ధరలు పెంచి విక్రయిస్తున్న వైనం

కడప, మే 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దుకాణాలు తెరుచుకున్నాయి. రెండు నెలలుగా ఇళ్లకే పరిమితమైన జనం గడప దాటి బయటికి వచ్చారు. నగర, పట్టణాల్లో వీధులు జనంతో రద్దీగా కనిపించాయి. వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే అదనుగా కొన్ని పట్టణాల్లో ధరలు పెంచేశారు. సుదీర్ఘ కాలం తరువాత బస్సులు రోడ్డెక్కాయి. తొలిరోజు ప్రయాణికులు ఎక్కువమంది వస్తారని ఆశించిన ఆర్టీసీ అధికారుల అంచనాలు తారుమారు అయ్యాయి. బస్సుల్లో రద్దీ కనిపించలేదు. భౌతిక దూరం పాటించలేదు. ఆ వివరాలు ఇలా..


తెరుచుకున్న దుకాణాలు

లాక్‌డౌన్‌ సడలింపుతో కడప నగరంలోని గ్రీన్‌జోన్‌ ఏరియా అప్సరా సర్కిల్‌, కోటిరెడ్డిసర్కిల్‌, ఎన్జీవో కాలనీ, వై.జంక్షన్‌, చిన్నచౌకు ప్రాంతాల్లో... రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో పలు దుకాణాలు తెరుచుకున్నాయి. వస్త్ర దుకాణాలు, హోటళ్లు, సెలూన్‌ షాపులు, బంగారు దుకాణాలకు అనుమతి ఇవ్వలేదు. రెండు నెలల తరువాత షాపులు తెరవడంతో జనం గడప దాటి బయటికి వచ్చారు. అయితే.. రెండునెలలుగా చేయడానికి పనుల్లేకపోవడంతో ఆశించిన స్థాయిలో వ్యాపారాలు లేవని ఓ వ్యాపారి పేర్కొన్నారు. రంజాన్‌ మాసం కావడంతో గార్మెంట్స్‌ దుకాణాలు, ఫ్యాన్సీ దుకాణాల్లో కాస్త సందడి కనిపించింది. కొన్ని పట్టణాల్లో భౌతిక దూరం కనిపించలేదు. ప్రొద్దుటూరు, రాయచోటి పట్టణాలు కంటైన్మెంటు జోన్‌లో ఉండడంతో షాపులు తెరిచేందుకు అనుమతించలేదు. మైదుకూరులో నేటి నుంచి దుకాణాలు తెరుచుకోనున్నాయి.


ధరలు పెంచి..

పలువురు వ్యాపారులు ఽధరలు పెంచేశారు. రాజంపేట పట్టణంలో ఫ్యాన్సీ, కొన్ని నిత్యావసర సరుకులు రెట్టింపు రేట్లకు విక్రయించారు. ఓ వినియోగదారుడు అరికలు కొనుగోలు చేస్తే కిలో రూ.60 నుంచి రూ.120కి విక్రయించారు. ఫ్యాన్సీ వస్తువులదీ ఇదే పరిస్థితి. పులివెందులలో లాక్‌డౌన్‌లో పెంచిన రేట్లనే కొనసాగిస్తున్నారు. జమ్మలమడుగు పట్టణంలో రూ.5-10 ఎక్కువ అమ్ముతున్నారు.


ఆర్టీసీ బస్సుల్లో రద్దీ అంతంతే...

మార్చి 22వ తేదీ జనతా కర్ఫ్యూ నుంచి రెండు నెలలు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు గురువారం రోడ్డెక్కాయి. జిల్లాలో 45 రూట్లలో 152 బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రొద్దుటూరు పూర్తిగా కంటైన్మెంట్‌ జోన్‌లో ఉండడంతో అక్కడికి బస్సులు నడపలేదు. 140 బస్సులు 35 రూట్లలో నడిపారు. జనంలో కరోనా భయం తొలగలేదు. దీంతో తొలిరోజు అంచనాలకు అనుగుణంగా ప్రయాణికుల రద్దీ కనిపించలేదు. బద్వేలు, మైదుకూరు, రాజంపేట, రాయచోటి వంటి పట్టణాల నుంచి బస్సులో పది పన్నెండు మంది కూడా వెళ్లకపోగా.. కొన్ని బస్సులు పదిలోపు ప్రయాణికులతోనే నడపాల్సి వచ్చింది. ఇన్నాళ్లకు బస్సు ఎక్కామంటూ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఉదయం భౌతిక దూరం పాటించలేదు. కడప బస్టాండుకు డీఎస్పీ సూర్యనారాయణ వచ్చి వరుసలో నిలిపి వెళ్లినా ఆ తరువాత మళ్లీ మొదటికే వచ్చింది. దీంతో ఆర్‌ఎం జితేంద్రనాధరెడ్డి చొరవ తీసుకుని మార్కింగ్‌ ఏర్పాటు చేయించారు. బస్టాండులో శానిటైజర్‌ ఏర్పాటు చేయలేదు. ధర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయలేదు. దీంతో కొందరు ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు.


కూతురిని చూసేందుకు వెళుతున్నా:  రామలక్ష్మి, ఊటుకూరు, సీకేదిన్నె మండలం

లాక్‌డౌన్‌కు ముందే కూతురిని చూసేందుకు వెళ్లాలనుకున్నాం. ఈ లోగా కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఇళ్లకే పరిమితమయ్యాం. ఇన్నాళ్లకు ఆర్టీసీ బస్సులు నడపడంతో రాయచోటిలో ఉన్న కూతురిని చూసేందుకు వెళుతున్నా. ఆనందంగా ఉంది. 


బస్సులు నడపడంతో సొంతూరికి :  ఫయూం, రాయచోటి 

భూపాల్‌లో డెంటల్‌ మెడిసిన్‌ చేస్తున్నా. లాక్‌డౌన్‌ వల్ల అక్కడే ఇరుక్కుపోయాం. ఇటీవల అనంతపురం చేరుకుని అక్కడి నుంచి కడపకు వచ్చాను. లాక్‌డౌన్‌ సడలించి ఆర్టీసీ బస్సులు నడపడంతో సొంతూరు రాయచోటికి వెళుతున్నా.


చాలా సంతోషంగా ఉంది.:  కొరివి హుసేన్‌రెడ్డి, వ్యాపారి, బద్వేలు 

రెండు నెలలుగా ఎలాంటి వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం. ఇప్పుడు అధికారులు దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో సంతోషంగా ఉంది. నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేస్తాం. కష్టమర్లు కూడా మాకు సహకరించాలి.


Advertisement
Advertisement
Advertisement