Abn logo
Mar 6 2021 @ 01:56AM

పారిశ్రామిక ప్రాంతంలో బంద్‌ విజయవంతం

ఉక్కుటౌన్‌షిప్‌, మార్చి 5: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌ స్టీల్‌ప్లాంట్‌లో విజయవంతం అయ్యింది. ఉక్కు పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అధికారులు,  ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు బంద్‌లో పాల్గొన్నారు. కార్మికుల హాజరు తక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్లాంట్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అఽధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. కీలక విభాగాలైన కోకో-ఓవెన్‌, బ్లాస్ట్‌ఫర్నేస్‌, ఎస్‌ఎంఎస్‌, మిల్స్‌, గ్యాస్‌, విద్యుత్‌ విభాగాల్లో ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించారు.  బంద్‌ను విజయవంతం చేసిన అన్ని వర్గాలకు  ఉక్కు పరిరక్షణ కమిటీ ధన్యవాధాలు తెలిపింది. 

గాజువాక ప్రాంతంలో.. 

గాజువాక: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు శుక్రవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌ గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో విజయవంతమయ్యింది. ప్రధానంగా తెలుగు దేశం, సీపీఐ, సీపీఎం   వాటి అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా పాల్గొన్నాయి.  వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. చిన్నతరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూత పడ్డాయి. సినిమా థియేటర్లు ఉదయం, మ్యాట్నీ చలన చిత్ర ప్రదర్శనలు నిలిపి వేశారు.  పీటీడీ బస్సులు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు నిలిచి పోయాయి. బ్యాంకులు మూసివేశారు. కార్మిక సంఘాలు కూర్మన్నపాలెం, పాతగాజువాక జంక్షన్‌లలో రాస్తారోకోలు నిర్వహించాయి

పల్లా శ్రీనివాసరావు సంఘీభావం

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే వరకు ఉద్యమం విరమించేదిలేదని విశాఖ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ నిరసిస్తూ శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర బంద్‌లో భాగంగా గాజువాకలో  పాల్గొన్నారు.

న్యాయవాదుల నిరసన

ప్రజల చేత ఎన్నుకోబడ్డ నేతలు ప్రజలకు ద్రోహం చేస్తే చరిత్ర క్షమించదని గాజువాక బార్‌ అసోసియేషన్‌ అఽధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస సత్యనారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ గాజువాక కోర్టు కాంప్లెక్స్‌ వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు.  

Advertisement
Advertisement
Advertisement