Abn logo
Jan 20 2021 @ 19:05PM

బీజేపీలో పెరుగుతున్న సినీ గ్లామర్‌

అమరావతి: బీజేపీలో సినీ గ్లామర్‌ పెరుగుతోంది. సినీ నటులు వాణీ విశ్వనాథ్‌, ప్రియారామన్‌, అర్చన బీజేపీలో చేరనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అర్చన కలిశారు. త్వరలో ముగ్గురు నటీమణులు బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో ఆదరణ ఉన్న నేతలపై ప్రముఖంగా ఆ పార్టీ దృష్టి సారించింది. ఇటీవల వాణివిశ్వనాథ్‌తో సోము వీర్రాజు చెన్నైలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాణి విశ్వనాథ్‌‌ను వీర్రాజు బీజేపీలోకి ఆహ్వానించారు. ఆమె పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వాణివిశ్వనాథ్ 40కి పైగా తెలుగు సినిమాల్లో నటించారు. ఆమె ‘ఘరానామొగుడు’ సినిమాలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.


అంతేకాదు మరో నటి ప్రియారామన్‌ను కూడా సోమువీర్రాజు బీజేపీలోకి ఆహ్వానించారు. ఆమె కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బీజేపీ అధిష్ఠానం సూచనల మేరకు ఇప్పటికే ఏపీ నేతలు ఆమెతో మాట్లాడినట్టు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించిన ప్రియారామన్‌ పాల్ఘాట్‌ నాయర్‌ కుటుంబానికి చెందినవారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలతోనూ ఆమెకు అనుబంధం ఉండటంతో ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ పెద్దలు కూడా ఉత్సాహం కనబరుస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement