Abn logo
Sep 24 2020 @ 01:47AM

గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీపై..గురి

రేసులో కాంగ్రెస్‌ సీనియర్లు, జూనియర్లు

అభ్యర్థిత్వం కోసం అధిష్ఠానానికి దరఖాస్తులు

కరీంనగర్‌ తీర్పు స్ఫూర్తితో రంగంలోకి దిగిన నాయకులు

గ్రామాల్లో ఇప్పటికే క్యాంపెయిన్‌ మొదలు పెట్టిన టీఆర్‌ఎస్‌

బీ.జేపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్సీకే మళ్లీ చాన్స్‌?


పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ స్థానంపై కాంగ్రెస్‌ పార్టీ సీనియన్‌, జూనియర్‌ నాయకులు గురి పెట్టారు.. ఉమ్మడి హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదుకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయగా, ఈ స్థానం నుంచి పోటీ చేసుందుకు అధిష్ఠానానికి దరఖాస్తులు చేసుకున్నారు.. మార్చిలో జరిగే ఎన్నికలో గెలుపొంది, పెద్దల సభలో అడుగిడడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరుగగా, ఒక్కసారి కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ గెలువ లేదు.. తాజాగా నిరుద్యోగ, విద్యార్థి వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే అభిప్రాయంతో, ఈ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ నాయకులు పార్టీ అభ్యర్థిత్వం కోసం అధిష్ఠానంతో సంప్రదింపులు జరుపుతున్నారు..


మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కన్నేశారు. గతంలో మూడుసార్లు ఎన్నికలు జరిగిన ఈ నియోజకవర్గంలో, ఏ ఎన్నికల్లోనూ నేతలు ఇంతగా పోటీపై శ్రద్ధ చూపలేదు. ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలో విస్తరించిన ఈ నియోజకవర్గంలో టికెట్‌ ఆశిస్తూ పలువురు సీనియర్‌, జూనియర్‌ నేతలు అధిష్ఠానానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పాలమూరు నాయకులే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శులుగా ఉన్న జి.చిన్నారెడ్డి, సీహెచ్‌ వంశీచంద్‌రెడ్డి, ఎస్‌ఏ సంపత్‌కుమార్‌, జి.హర్షవర్ధన్‌రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరితో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్‌, టి.రామ్మోహన్‌రెడ్డి, కె.లక్ష్మారెడ్డి, ఇందిరా శోభన్‌ కూడా రేసులో ఉన్నారు. కాగా, 2019లో కరీంనగర్‌ గ్రాడ్యుయేట్స్‌ స్థానంలో జరిగిన ఎన్నికలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విజయం సాధించడాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఈ స్థానంపై నాయకులు కన్నేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొలువుదీరాక ఉద్యోగ నియామకాల్లేకపోవడం, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి  చెల్లించకపోవడం, ఉద్యోగులకు పీఆర్‌సీ ఇవ్వకపోవడం వంటి కారణాలతో పట్టభద్రుల్లో టీఆర్‌ఎస్‌ పట్ల వ్యతిరేకత ఉందని, అదే సానుకూలాంశంగా మల్చుకొని సత్తా చాటాలనే వ్యూహంతో పోటీకి దిగుతున్నారు.


అయితే, టీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పటికే ఓటర్ల నమోదు కోసం మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ, క్యాంపెయిన్‌ కూడా మొదలు పెట్టారు. అభ్యర్థి ఎవరనే అంశంతో సంబంధం లేకుండా, పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాడర్‌ని సమాయత్తం చేస్తున్నారు. ఈ స్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ బీజేపీకి చెందిన ఎన్‌.రాంచందర్‌రావు మరో సారి తానే బరిలో ఉండేందుకు రెడీ అయ్యారు. ఈ పార్టీ కూడా ఇప్పటికే సమావేశాలు మొదలు పెట్టింది. 


మూడు ఎన్నికల్లోనూ భిన్నమైన తీర్పులే

శాసన మండలి పునరుద్ధరించిన తర్వాత ఈ నియోజకవర్గానికి జరిగిన మూడు ఎన్నికల్లోనూ భిన్నమైన తీర్పులే వచ్చాయి. 2007లో జరిగిన మొదటి ఎన్నికలో విద్యావేత్త ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ లౌకిక, ప్రజాతంత్ర శక్తుల మద్దతుతో పోటీ చేసి గెలుపొందారు. తొలిసారి కావడంతో అభ్యర్థుల పదవీ కాలానికి లాటరీలు తీయగా, ఈ స్థానానికి రెండేళ్ల గడువే దక్కడంతో 2009లో మరోసారి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలోనూ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత 2015లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దేవీప్రసాదరావుపై విజయం సాధించారు. మూడు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పోటీ చేసినా విజయం దక్కలేదు. కాంగ్రెస్‌ కూడా ఆ మూడు ఎన్నికలను పట్టించుకోలేదు. తాజా ఎన్నికల కోసం మాత్రం సీరియస్‌గా ప్రయత్నిస్తుండడం గమనార్హం.

Advertisement
Advertisement
Advertisement