Abn logo
Oct 2 2020 @ 00:40AM

గందరగోళం..నెలనెలా ఖాతాల్లో జమ కాని ‘జీపీఎఫ్‌’

Kaakateeya

పలువురు ఉపాధ్యాయుల ఖాతాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌ 

సంప్రదించకుండానే ఎక్సెస్‌ పేమెంట్‌ పేరుతో నగదు తగ్గింపు 

జీపీఎఫ్‌ పాక్షిక ఉపసంహరణలోనూ తీవ్ర జాప్యం

ఆందోళనలో మేడ్చల్‌ జిల్లా ఉపాధ్యాయులు

కొత్త జడ్పీలకు జీపీఎఫ్‌ ఖాతాల విభజన చేపట్టాలని డిమాండ్‌


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల నుంచి కొంతమేరకు విధిగా ప్రభుత్వ భవిష్య నిధి(జీపీఎఫ్‌)లో జమ చేస్తారు. జమయిన నిధి నుంచి తమ అవసరాల కోసం 50శాతం మేరకు విత్‌డ్రా చేసుకోవడంతోపాటు రుణాలు పొందే సౌకర్యం కూడా ఉంటుంది. ఉద్యోగుల వేతనాల నుంచి ప్రతినెలా జీపీఎ్‌ఫను మినహాయించి చెల్లిస్తారు. ఉపాధ్యాయుల జీపీఎఫ్‌ వ్యవహారాలను జిల్లాపరిషత్‌ పర్యవేక్షిస్తుంది. మేడ్చల్‌జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఉపాధ్యాయుల జీపీఎఫ్‌ సక్రమంగా జమ కాకపోవడంతో వారంతా తీవ్రంగా ఆందోళన చెందున్నారు. ప్రతినెలా వేతనాల్లో జీపీఎ్‌ఫను కట్‌ చేస్తున్నారు. ఖాతాల్లో మాత్రం జమ చేయడంలేదు. ఒకటో, రెండో నెలలు జమకాలేదంటే ఏమో పొరపాటు జరిగిందని సరిపెట్టుకోవచ్చు. కానీ పలువురు ఉపాధ్యాయుల జీపీఎఫ్‌ సంవత్సరాలుగా సక్రమంగా జమకావడం లేదు. అధికారులు జీపీఎ్‌ఫపై గందరగోళం సృష్టిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం సమాచారం లేకుండా ఉపాధ్యాయుల జీపీఎఫ్‌ ఖాతాల్లో నగదు తగ్గిస్తున్నారు. దీంతో వారంతా కూడా లబోదిబోమంటున్నారు. 


మేడ్చల్‌ జిల్లాలో 15 రెవెన్యూ మండలాల్లో 503 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 3వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పలు మండలాల్లోని ఉపాధ్యాయులకు జీపీఎఫ్‌ సక్రమంగా జమ కావడం లేదు. జిల్లాలోని ఉప్పల్‌ మండలానికి చెందిన మెజార్టీ ఉపాధ్యాయులు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఓ ఉపాధ్యాయుడి 9 సంవత్సరాల జీపీఎఫ్‌ స్లిప్పుల్లో ఆరేళ్లుగా సమక్రంగా జమ కాలేదు. మరో ఉపాధ్యాయుడికి మూడేళ్లుగా జమ కావడంలేదు. ఒక ఉపాధ్యాయుడి ఖాతా నుంచి ఎక్సెస్‌ పేమెంట్‌ అని... ఆయనకు తెలియకుండానే రూ.57,144 తగ్గింపులు జరిగాయు. ఉపాధ్యాయులకు ఆలస్యంగా సమాచారం తెలియడంతో అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఉమ్మడిరంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా జీపీఎఫ్‌ సరిగ్గా జమ కావడంలేదని ఉపాధ్యాయులు వెల్లడించారు. గతంలో జరిగిన పొరపాట్లను ప్రస్తు తం సరిచేసినప్పటికీ.. ఆయా సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ కోల్పోతున్నారు. దీంతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఈ గందరగోళాన్ని జిల్లా పరిషత్‌ అధికారులు సరిచేయాలని కోరుతున్నారు. 


జీపీఎఫ్‌ పాక్షిక ఉపసంహరణలో..

ఉపాధ్యాయుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి తమ అవసరాల కోసం పాక్షిక ఉపసంహరణ చేసుకుంటారు. ప్రధానంగా గృహ నిర్మాణాలు, పిల్లల వివాహాలకు తమ ఖాతాల నుంచి పాక్షిక ఉపసంహరణకు దరఖాస్తు చేసుకుంటారు. సాధారణంగా దరఖాస్తు చేసుకున్న వెంటనే జడ్పీ అధికారులు పరిశీలించి, ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ అయిన నిధి నుంచి 60శాతం మేరకు విత్‌డ్రా చేసుకునే వీలు కల్పిస్తారు. జీపీఎఫ్‌పై రుణాలు తీసుకున్నట్లయితే నెలవారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్న వారం పదిరోజుల్లోగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే చేసుకున్న వారికి డబ్బు చెల్లించడంలో తీవ్రంగా జాప్యం జరుగుతోందని పలువురు ఉపాధ్యాయులు వెల్లడిస్తున్నారు. ఆరునెలల వరకు కూడా డబ్బు అందడం లేదని చెబుతున్నారు.


కొత్త జడ్పీలు ఏర్పాటైనా.. విభజన కాని జీపీఎఫ్‌ ఖాతాలు

పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్తజిల్లాలను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాలతో కూడిన 32జిల్లాలకు నూతనంగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేసింది. మేడ్చల్‌ జిల్లాపరిషత్‌ ఏర్పడి ఏడాదిన్నర దాటింది. ఉద్యోగుల విభజన, నిధులు, ఇతర ఖాతాలన్నీ కూడా విభజన జరిగింది. అయితే ఉపాధ్యాయులు జీపీఎఫ్‌ ఖాతాలను మాత్రం పాత జిల్లాల వారీగానే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నూతన జిల్లాల పాలకవర్గాలు ఏర్పడినప్పటికీ ఖాతాలు విభజన చేయకపోవడంతో జీపీఎఫ్‌ జమలో గందరగోళం నెలకొందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 


కొత్త జిల్లాల వారీగా జీపీఎఫ్‌ ఖాతాల విభజన చేపట్టాలి

నూనత జిల్లాల్లో జడ్పీ పాలకవర్గాలు ఏర్పడినప్పటికీ జీపీఎఫ్‌ ఖాతాల విభజన జరగకపోవడం శోచనీయం. జిల్లాలో కొంతమంది ఉపాధ్యాయుల ఖాతాలనుండి వారికి తెలియకుండా నగదు తగ్గిస్తున్నారు. ప్రతినెలా జీపీఎఫ్‌ ఖాతాల్లో నిధి సక్రమంగా జమ కావడంలేదు. తమ ఖాతాల నుంచి పాక్షిక ఉపసంహరణకు దరఖాస్తు చేసుకున్న వారు డబ్బుల కోసం నెలల కొద్దీ ఎదురుచూడాల్సి వస్తోంది. నూతన జిల్లాల వారీగా జీపీఎఫ్‌ ఖాతాలను బదిలీ చేయాలి. 

 - సత్తు పాండురంగారెడ్డి, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

Advertisement
Advertisement