Abn logo
Mar 31 2020 @ 18:01PM

కోవిడ్-19పై పోరు : 500 కంపెనీల సామర్థ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ : కరోనా వైరస్ (కోవిడ్-19)పై పోరులో వివిధ అంశాల్లో సహకరించే సామర్థ్యం ఉన్న కంపెనీలను ప్రభుత్వం గుర్తించింది. రోగ నిర్థరణ, మందులు, వెంటిలేటర్లు, ప్రొటెక్షన్ గేర్స్, అంటువ్యాధులు సోకకుండా నిరోధించే వ్యవస్థలు తదితర అంశాల్లో ప్రభుత్వానికి సహకరించే సామర్థ్యం దాదాపు 500 సంస్థలకు ఉన్నట్లు గమనించింది. స్టార్ట్-అప్స్, విద్యా, సాంకేతిక, పరిశోధన, ప్రయోగశాలలు, పరిశ్రమలు వంటి రంగాల్లో ఈ సంస్థలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 


శాస్త్ర, సాంకేతిక శాఖ (డీఎస్‌టీ) నిధుల కోసం ఇచ్చిన పిలుపు నేపథ్యంలో దాదాపు 200 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 20 సంస్థల ప్రతిపాదనలను చురుగ్గా పరిశీలిస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించడంలో ఈ సంస్థల సామర్థ్యం, పెట్టుబడి స్తోమత వంటి వివరాలను పరిశీలిస్తున్నారు. పుణేలోని స్టార్టప్ కంపెనీ మన దేశంలో తొలి దేశీయ రోగ నిర్థరణ కిట్‌ను తయారు చేసిందని, వారానికి లక్ష కిట్లు చొప్పున తయారు చేయడానికి ఈ కంపెనీని రంగంలోకి దించుతున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది. విశాఖపట్నంలో వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లు, ఇమేజింగ్ ఎక్విప్‌మెంట్, అల్ట్రా సౌండ్, హై ఎండ్ రేడియాలజీ ఎక్విప్‌మెంట్ తయారీ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమవుతుందని తెలిపింది. 


కోవిడ్-19కు వ్యాక్సిన్ తయారీకి మూడు భారతీయ పరిశ్రమలు సహకరిస్తున్నట్లు తెలిపింది. థెరప్యూటిక్, డ్రగ్ డెవలప్‌మెంట్‌పై పరిశోధన ప్రారంభమైందని పేర్కొంది. 

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement