Abn logo
Jul 17 2021 @ 00:37AM

ద్రవ్యోల్బణంపై పాలకుల అలక్ష్యం

సంపన్నులు, పేదల నుంచి ఒకే విధంగా వసూలు చేసే పరోక్ష పన్నులు ‘తిరోగామి’ పన్నులు అనే వాస్తవాన్ని ప్రభుత్వం విస్మరిస్తోంది. ఫలితంగా అవి పేదలపై భరించలేని భారాన్ని మోపుతున్నాయి. పన్నుల హేతుబద్ధీకరణ ద్వారా చమురు ధరలను తక్షణమే తగ్గించాలి. లేనిపక్షంలో ఆర్థికవ్యవస్థ కోలుకోవడం మరింత ఆలస్యమవుతుంది.


మనం 1947లో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం. ఆ పరాధీన భారతంలోనూ మనకొక ‘సార్వభౌమిక వ్యవస్థ’ ఉంది. అదే భారత ప్రభుత్వం. యుద్ధాలు చేసేందుకు, శాంతి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు, రుణాలు తీసుకునేందుకు, అన్నిటికీ మించి డబ్బును సృష్టించేందుకు భారత ప్రభుత్వానికి సార్వభౌమిక అధికారాలు ఉండేవి. డబ్బును సృష్టించడమంటే నాణేలు, కరెన్సీ నోట్లు ముద్రించడం. భారత ప్రభుత్వంతో పాటు మరికొన్ని అర్ధసార్వభౌమిక సంస్థలు ఉండేవి. వాటిని అలా భావించడానికి గల కారణాలను వివరించేందుకు ఇక్కడ స్థలాభావం అడ్డు వస్తుంది. సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్బీఐ, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు (ఎస్‌బిఐ ఇందుకొక ఉదాహరణ) ఆ సంస్థలలో ఉన్నాయి. విచిత్రమేమిటంటే మన దేశంలో ప్రజలను అమితంగా ఆందోళనకు గురిచేస్తున్న ఒక సమస్య గురించి అర్ధసార్వభౌమిక సంస్థలు ఎక్కువగా పట్టించుకుంటుండగా ప్రభుత్వమేమో ఆ సమస్యను ఉపేక్షిస్తోంది. నిమ్మళంగా ఉంటూ అది దానికదే సమసిపోగలదని భావిస్తోంది. నేను ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావిస్తున్నానని మీరు అర్థం చేసుకునే ఉంటారు. ప్రజాస్వామిక ప్రభుత్వాలు అకారణంగా భయపడే సమస్య ద్రవ్యోల్బణం. 


నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) ఈ నెల 12న విడుదల చేసిన ఒక ప్రకటన, ‘వినియోగ ధరల ద్రవ్యోల్బణం’ (సిపిఐ) కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నిర్ణయించిన అవధిని మించిపోయిందని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయించిన ప్లస్ లేదా మైనస్ 2 శాతం కాగా వాస్తవానికి అది 6.23 శాతంగా ఉంది. గత మేలో 5.91 శాతంగా ఉన్న పట్టణ ప్రాంతాల సిపిఐ జూన్‌లో 6.37 శాతానికి పెరిగింది. ప్రధాన ద్రవ్యోల్బణం ఒక్క నెలలోనే 5.5 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది. అలాగే ఆహార ద్రవ్యోల్బణం 5.58 శాతం. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం 10.01 శాతం. పండ్ల ద్రవ్యోల్బణం 11.82 శాతం. రవాణా ద్రవ్యోల్బణం 11.56 శాతం, ఇంధన ద్రవ్యోల్బణం 12.68 శాతం. నూనెలు, కొవ్వు పదార్థాల ద్రవ్యోల్బణం 34.78 శాతం. డిమాండ్ ఆకస్మిక పెరుగుదల ఈ ద్రవ్యోల్బణానికి ఎంతమాత్రం కారణం కాదని నేను భావిస్తున్నాను. ప్రైవేట్ వినియోగ డిమాండ్ స్వల్పంగా ఉంది. మితిమీరిన ద్రవ్యత్వం అంటే ప్రజల చేతుల్లో అపరిమితంగా నగదు ఉండడం వల్ల ఈ ద్రవ్యోల్బణం సంభవించలేదు. ఇది స్పష్టం. మరి ఏమిటి కారణం? ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు ముఖ్యంగా అసంబద్ధ పన్నుల విధానాలే ఈ ద్రవ్యోల్బణానికి దారితీశాయి. 


ఆహార, ఇంధన ధరలు పెరిగాయని ఆర్బీఐ తాజా బులెటిన్ అంగీకరించింది. వస్త్రాలు, పాదరక్షలు, గృహ సంబంధ వస్తువులు, సేవల విషయంలో కూడా ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగిందని ఆ బులెటిన్ పేర్కొంది. అలాగే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.100, రూ.93.52కి పైగా పెరిగిపోయాయని కూడా పేర్కొంది. కిరోసిన్, ఎల్‌పిజి ధరల్లో కూడా పెరుగుదల నమోదయింది. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే తయారీరంగం, సేవల రంగంలో ఉత్పాదితాల ఖర్చులు పెరిగిపోయాయని ఆర్బీఐ బులెటిన్ పేర్కొనడం.


సకల ధరల భోగట్టా ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది: ప్రభుత్వం అనుసరిస్తున్న పన్ను విధానాలే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ఆర్థికవ్యవస్థకు మూడు పన్నులు తీవ్రనష్టాన్ని కలిగిస్తున్నాయి. వీటిలో మొదటివి పెట్రోల్, డీజిల్‌పై పన్నులు; ముఖ్యంగా కేంద్రప్రభుత్వం విధించిన సెస్‌లు ఈ ఇంధనాలపై కేంద్ర, రాష్ట్ర ఎక్సైజ్ పన్నులను అనుమతించవచ్చు. ఆయా ప్రభుత్వాలకు ఆదాయం అవసరం కదా. అయినప్పటికీ సెస్ విధింపు సమర్థనీయం కాదు. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.33, డీజిల్‌పై లీటర్‌కు రూ.32 చొప్పున సెస్ విధిస్తున్నారు. కేవలం ఈ సెస్‌ల వల్లే కేంద్రప్రభుత్వానికి ఏటా రూ.4,20,000 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఈ మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే అట్టిపెట్టుకుంటుంది. సెస్‌ను ఒక నిర్దిష్ట లక్ష్యానికిగాను నిర్దిష్ట కాలానికి విధిస్తారు. అయితే ఈ పరిమితులను కేంద్రం పూర్తిగా విస్మరించింది. ఫలితంగా పెట్రోల్, డీజిల్‌పై సెస్‌లు దుర్వినియోగమవుతున్న ఆదాయ సాధానాలుగా పరిణమించాయి. ఇది పచ్చి స్వార్థం, ఘోరమైన దోపిడీ. 


రెండోవి అధిక దిగుమతి సుంకాలు. 2004లో ఈ సుంకాలను క్రమంగా తగ్గించడం ప్రారంభమయింది. అయితే ప్రస్తుత పాలకులు అధికారంలోకి వచ్చిన వెంటనే దిగుమతి సుంకాలను పెంచారు. దీంతో తయారీరంగంలో కీలకమైన మధ్యస్థ వస్తువుల ధరలు, పామాయిల్, పప్పుధాన్యాలు, ఇంకా ఎన్నో గృహసంబంధ వస్తువుల ధరలు పెరిగాయి. మూడోవి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అసంబద్ధ రేట్లు. జీఎస్టీకి బహుళ రేట్లు ఒక ప్రాథమిక సమస్య. అది ఇప్పటికీ అపరిష్కృతంగా ఉంది. టాయిలెట్రీస్, ప్రాసెస్డ్ ఆహారాలు, గృహోపయోగ ఉపకరణాలు మొదలైన వాటి ఉత్పత్తిదారులు 12 నుంచి 18 శాతం జీఎస్టీ రేట్ల మూలంగా నష్టపోతున్నారు. అధిక జీఎస్టీ మూలంగా వస్తుసేవల అంతిమధరలు విపరీతంగా పెరిగిపోయాయి.


సెస్‌లు, దిగుమతి సుంకాలు, జీఎస్టీ- అనేవి పరోక్ష పన్నులు. సంపన్నులు, పేదల నుంచి వీటిని ఒకే విధంగా వసూలు చేస్తారు కనుక అవి ‘తిరోగామి’ పన్నులు అనే వాస్తవాన్ని ప్రభుత్వం అలక్ష్యం చేస్తోంది. పర్యవసానంగా ఈ పన్నులు సాపేక్షంగా పేదలపై భరించలేని భారాన్ని మోపుతున్నాయి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ మూడు పరోక్ష పన్నుల వల్ల సకల ఆర్థిక కార్యకలాపాల ఉత్పాదితాల ధరలు అనివార్యంగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సకల ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తోంది.


రవాణా, వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలు అన్నీ ఆ పరోక్ష పన్నుల దెబ్బకు కుదేలవుతున్నాయి. అంతేకాదు బ్యాంక్ డిపాజిట్లలో తగ్గుదలకు, కుటుంబ రుణాల పెరుగుదలకు అవి కారణమయ్యాయని ఎస్‌బిఐ పరిశోధకులు వెల్లడించారు. ప్రజల పొదుపు మొత్తాలు కూడా భారీగా తగ్గిపోయాయని కూడా వారు పేర్కొన్నారు. ఈ పరిణామాల ప్రభావం ఆరోగ్యం, ప్రజోపయోగ సేవలు మొదలైన రంగాలపై తీవ్రంగా ఉంటుందని వారు హెచ్చరించారు. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని పన్నుల హేతుబద్ధీకరణ ద్వారా చమురు ధరలను తక్షణమే తగ్గించాలని వారు స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో మరింత ఆలస్యమవుతుందని ఎస్‌బిఐ పరిశోధకులు హెచ్చరించారు. ‘ధరల పెరుగుదల వల్ల ప్రజలు బాధపడితే ఏమిటి, మేమేమీ పట్టించుకోం’ అన్న వైఖరిని ప్రభుత్వం పాటిస్తోంది. ‘ఇది మన కర్మ’ అని ప్రజలు భావిస్తున్నారు. ‘ప్రజల యొక్క ప్రజల, చేత, ప్రజల కొరకు’ సాగాల్సిన ప్రజాస్వామిక పాలన పూర్తిగా వక్రగతి పట్టిందని గాక దీన్ని మరోలా అర్థం చేసుకోగలమా?


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...