Abn logo
Sep 25 2021 @ 12:13PM

ప్రపంచ స్థాయికి సాలార్‌జంగ్‌ మ్యూజియం : గవర్నర్‌

హైదరాబాద్‌: సాలార్‌జంగ్‌ మ్యూజియంను ప్రపంచ స్థాయికి ప్రమోట్‌ చేయాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. మ్యూజియం బోర్డు చైర్‌పర్సన్‌గా ఆమె అధ్యక్షతన శుక్రవారం బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ బహుమతులు అందుకున్న అనేక కళాకృతులు మ్యూజియంలో ఉన్నాయని, సందర్శకులకు కనువిందు చేస్తున్నాయనీ అన్నారు. ఒకనాటి కళలు, కళాఖండాలు, సాహిత్యంపై అవగాహన పెంపొందించడంలో భాగంగా విద్యార్థులు, యువకులు మ్యూజియంను సందర్శించేలా చూడాలని బోర్డు సభ్యులకు సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మ్యూజియంలోని కొన్ని గ్యాలరీలను ఆధునికీకరించడం పట్ల ఆమె నిర్వాహకులను అభినందించారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, గవర్నర్‌ సెక్రటరీ సురేంద్ర మోహన్‌, ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డి.రవీందర్‌, సాలార్‌జంగ్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.