Advertisement
Advertisement
Abn logo
Advertisement

తాండవ, ఏటికొప్పాకలను ప్రభుత్వమే ఆదుకోవాలి


రైతులు, కార్మికులకు వెంటనే బకాయిలు చెల్లించాలి

సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ డిమాండ్‌

పాయకరావుపేట/ ఎస్‌.రాయవరం, నవంబరు 30: సహకార రంగంలోని తాండవ, ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఆదుకోవాలని, చెరకు రైతులకు, కార్మికులకు బకాయిలను వెంటనే చెల్లించాలని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ఆయన మంగళవారం తాండవ, ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీల స్థితిగతులు తెలుసుకునేందుకు రైతులు, కార్మికులతో సమావేశాలు నిర్వహించారు.  తొలుత తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ ఆవరణలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేశ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఫ్యాక్టరీకి ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయిస్తే రైతులు, కార్మికులకు బకాయిలు చెల్లించవచ్చునన్నారు. మరో కోటిన్నర రూపాయలు ఇస్తే ఓవర్‌ హాలింగ్‌ పనులు పూర్తిచేసి, క్రషింగ్‌ ప్రారంభించవచ్చని అన్నారు. చెక్కర కర్మాగారాలను మూసివేయడం సమస్యకు పరిష్కారం కాదని, వాటి సామర్థ్యాన్ని మరింత పెంచి, గాడిలో పెట్టాలని సూచించారు. పెట్టుబడులు పెరిగిపోయి, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ఆదుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, తదితరులు మాట్లాడుతూ, ఏడు దశాబ్దాల చరిత్ర వున్న తాండవ షుగర్‌ ఫ్యాక్టరీని మూసివేసి, ఖరీదైన భూములను కాజేయాలని కొంతమంది చూస్తున్నారని ఆరోపించారు.


రైతు కన్నీరు... సమాజానికి మంచిదికాదు 

రైతు కంట కన్నీరు వస్తే సమాజానికి మంచిదికాదని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ.లక్ష్మీనారాయణ అన్నారు. ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీలో రైతులు, కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, చెరకు పంట పండిస్తూ అందరికీ తీపిని పంచే రైతులు, తమ జీవితాలను చేదుగా గడపడం శోచనీయమని అన్నారు. ఏటికొప్పాక రైతులకు, కార్మికులకు బకాయిలను వెంటనే చెల్లించాలని, ఇందుకు కేవలం రూ.22 కోట్లు విడుదల చేస్తే సరిపోతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. త్వరలో ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఆర్థిక మంత్రిని కలిసి సహకార చక్కెర కర్మాగారాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తానన్నారు. ఈ సమావేశాల్లో తాండవ షుగర్స్‌ మాజీ చైర్మన్‌ సుర్ల లోవరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, రైతు సంఘం నాయకులు సత్యనారాయణ, అన్నం వెంకటరావు, సియ్యాదుల అచ్యుతకుమార్‌, టీడీపీ పాయకరావుపేట మండల అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగతా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement