Abn logo
Oct 22 2020 @ 00:48AM

కేఎల్‌ఐ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి


ఆమనగల్లు : కేఎల్‌ఐ పంప్‌హౌజ్‌ ప్రమా ద ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని ఆరోపించారు. ప్రమాద స్థలానికి వెళ్తున్న కాంగ్రెస్‌ నేతల అరెస్టులకు నిరసనగా ఆపార్టీ ఇచ్చిన పాలమూరు బంద్‌ పిలుపు మేరకు ఆమనగల్లు, కడ్తాలలో నిరసన తెలిపారు. ఆమనగల్లు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నేనావత్‌ బీక్యానాయక్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ ఆధ్వర్యంలో కడ్తాలలో కొద్దిసేపు కాంగ్రెస్‌ నాయకులు ర్యాలీ నిర్వహించి దుకాణాలను మూసివేయించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాన రహదారిపై బైటాయించి ధర్నా నిర్వహించారు. టీఆర్‌ఎ్‌స్‌, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులను అరెస్ట్‌ చేసి ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్బంగా మల్లు రవి మాట్లాడుతూ నీట మునిగిన పంప్‌హౌజ్‌లను పరిశీలించడానికి వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రమాదానికి గల కారణాలు వెలుగు చూస్తాయనే విపక్షాలను ప్రభుత్వం అడ్డుకొని పోలీసులతో అరెస్ట్‌ చేయించిందని మండిపడ్డారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు చేగూరి వెంకటేశ్‌,  జహంగీర్‌బాబా, గురిగళ్ల లక్ష్మయ్య, కందికంటి యాదయ్యగౌడ్‌; మంకి శ్రీను, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు పట్టణంలో బంద్‌లో భాగంగా  ఆందోళనకు సిద్ధమైన కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించి సాయంత్రం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. కాంగ్రెస్‌ బంద్‌ పిలుపు నేపథ్యంలో సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ ధర్మేశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు అరెస్ట్‌ చేసిన వారిలో యువజన కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి కృష్ణనాయక్‌, మండల అధ్యక్షుడు రాఘవేందర్‌, ఖాదర్‌, ఫీరోజ్‌, వస్పుల శ్రీకాంత్‌, చోటు, సురేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement