Advertisement
Advertisement
Abn logo
Advertisement

గూగుల్‌ గోల్‌మాల్‌

‘తలనొప్పి’ అని గూగుల్‌లో టైప్‌ చేసి చూడండి. లక్ష కారణాలు టక్కున ప్రత్యక్షమవుతాయి. వాటిలో ఒత్తిడి నుంచి బ్రెయిన్‌ కేన్సర్‌ వరకూ మనల్ని అనవసరపు అయోమయానికి గురి చేసే గంపెడంత సమాచారం గూగుల్‌లో కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్య సమాచారం కోసం గూగుల్‌లో మన వెతుకులాటకు ఓ పరిమితిని అనుసరించాలి. గూగుల్‌ సెర్చ్‌ను ఎక్కడ, ఎప్పుడు ఆపాలో, ఏ వెబ్‌సైట్లు నమ్మదగినవో తెలుసుకుందాం!


ఓవర్‌ గూగులింగ్‌

లక్షణాలను బట్టి వ్యాధి కోసం గూగుల్‌లో వెతకడం వల్ల అనవసరపు ఆందోళనను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం. అప్పటికే ఉన్న లక్షణాలకు, గూగుల్‌లో చదివిన లక్షణాలను కూడా ఆపాదించుకుని కుంగుబాటుకూ లోనవుతాం. అలాగే గూగుల్‌ మనల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం కూడా ఉంది. సమస్య చిన్నదైతే ఫర్వాలేదు. నిజంగానే తీవ్ర ఆరోగ్య సమస్య కలిగి ఉండి, గూగుల్‌ను అనుసరిస్తూ, చికిత్సను ఆలస్యం చేస్తే... వ్యాధి ముదిరిపోవచ్చు.

ఏది నిజం?

వ్యాధి లక్షణాల గురించి గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టే ముందు, గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌ గురించి కొన్ని  విషయాలు తెలుసుకోవడం అవసరం. అవేంటంటే...


  ఆన్‌లైన్‌ కంటెంట్‌: 

గూగుల్‌ సెర్జ్‌ బార్‌లో అవసరమైన పదం టైప్‌ చేసిన వెంటనే, ఆ పదంతో కూడిన వెబ్‌సైట్లన్నిటినీ గూగుల్‌ మన మందు ఉంచుతుంది. వాటిలో పేరున్న మెడికల్‌ వెబ్‌సైట్‌ ఉండవచ్చు. వీకీపీడియా వ్యాసం, ఓపెన్‌ ఫోరమ్‌ లేదా వ్యక్తిగత బ్లాగుకు సంబంధించిన సమాచారం కూడా అయి ఉండవచ్చు. వీటిలోని సమాచారం ఏమాత్రం కచ్చితమైనది కాకపోయి ఉండవచ్చు. లేదా వైద్య నిపుణులు, అవగాహన కోసం ఉంచిన సమాచారం కూడా అయి ఉండవచ్చు. 


  వీకీపీడియా విశ్వసనీయత: 

వైద్య సమాచారం కోసం ప్రపంచవ్యాప్త ప్రజలు ఆశ్రయిస్తున్న ఆరవ ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్‌... వీకీపీడియా. వీకీపీడియాలో ఎవరైనా సమాచారాన్ని జోడించి, మార్పులు చేయగలిగే వెసులుబాటు ఉంది. కాబట్టి దీన్ని విశ్వసించలేం.


  ఖర్చు పెరుగుతుంది:

 లక్షణాలను బట్టి గూగుల్‌ చేయడం వల్ల అనవసరపు భయాందోళలనలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. దాంతో ఎక్కువ మందిని వైద్యులను కలవడం, అవసరం లేని పరీక్షలు చేయించుకోవడం వల్ల డబ్బు వృథా అవుతుంది.

ఇలా వాడుకోవచ్చు

  ఏ వైద్యులు: లక్షణాల ఆధారంగా ఏ వైద్యులను కలవాలి అనే విషయంలో కొందరికి అయోమయం నెలకొంటుంది. అలాంటప్పుడు ఈ వైద్యులను కలవాలో తెలుసుకోవడం కోసం గూగుల్‌ను ఉపయోగించుకోవచ్చు. 

  చిన్నపాటి దెబ్బలు లాంటి స్వల్ప ఆరోగ్య సమస్యలకు గూగుల్‌లో దొరికే చిట్కాలను అనుసరించవచ్చు. అంతేగానీ తీవ్ర అనారోగ్యాలకు, అత్యవసర సమస్యలకు గూగుల్‌నే నమ్ముకోవడం సరి కాదు. 

 ఆరోగ్యానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం కోసం మాయో క్లినిక్‌, వెబ్‌ఎమ్‌డి, ప్రపంచ ఆరోగ్య సంస్థ... లాంటి నమ్మదగిన వెబ్‌సైట్ల మీద ఆధారపడవచ్చు. 


అనుమాన నివృత్తి

 గూగుల్‌లో సమాచారం వెతికి, తెలుసుకోవడంలో తప్పు లేదు. తెలుసుకునే క్రమంలో ఏవైనా అనుమానాలు తలెత్తితే, వెంటనే వాటిని రాసుకుని, వైద్యుల దగ్గరకు వెళ్లినప్పుడు నివృత్తి చేసుకోవాలి. అంతే తప్ప ఆ సమాచారంతో చికిత్స చేసుకోకూడదు. 

Advertisement
Advertisement