Abn logo
Sep 23 2021 @ 18:21PM

సీసీఐకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసిన గూగుల్

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు వ్యతిరేకంగా గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ కంపెనీపై సీసీఐ జరుపుతున్న దర్యాప్తునకు సంబంధించిన వివరాలు బయటకు వెల్లడి కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తునకు సంబంధించిన పత్రాలు తమకు అందలేదని గూగుల్ ఒక ప్రకటనలో చెప్పింది. హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆ సంస్థ రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. 


అండ్రాయిడ్‌ వెర్షన్‌కు సంబంధించి ఆ సంస్థ బిజినెస్‌లో అసంబద్ధ పద్ధతులను అవలంభించిందని సీసీఐ దర్యాప్తు విభాగం ద డైరెక్టర్ జనరల్(డీజీ) గుర్తించింది. కాంపిటీషన్ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో ఆ సంస్థపై డీజీ దర్యాప్తు జరుపుతోంది. డీజీ నివేదిక బయటకు లీక్ కావడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. దర్యప్తునకు పూర్తిగా సహకరించామన్నారు. దర్యాప్తు సమాచారాన్ని గోప్యంగా ఉంచామని వివరించారు. డీజీ కూడా అదేవిధంగా వ్యవహరిస్తుందని ఆశించామని వివరించారు. ఈ నివేదిక వెల్లడితో సీసీఐ తీర్పు ప్రభావితం కాదనుకుంటున్నామని తెలిపారు.