Sep 17 2021 @ 23:12PM

సప్తగిరి హీరో స్థాయికి చేరుకోవడం గర్వకారణం! తలసాని

‘‘ఎటువంటి నేపథ్యం లేకుండా ప్రతిభతో సప్తగిరి హీరో స్థాయికి చేరుకోవడం చాలా గర్వకారణం. చిత్రసీమకు యువతరం రావాలి’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. సప్తగిరి హీరోగా కేఎమ్‌ కుమార్‌ దర్శకత్వంలో పరుపాటి శ్రీనివా్‌సరెడ్డి, కటారి రమేశ్‌ యాదవ్‌ నిర్మించిన చిత్రం ‘గూడుపుఠాణి’. నేహా సోలంకి నాయిక. సినిమా విడుదలకు సిద్ధమైంది. ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉందని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ప్రీ-రిలీజ్‌ వేడుకలో మారుతి ఆకాంక్షించారు.


‘‘కమర్షియల్‌ హంగులన్నీ ఉన్న థ్రిల్లర్‌ చిత్రమిది. రఘు కుంచె విలన్‌గా చేయడం మా అదృష్టం’’ అని సప్తగిరి చెప్పారు. ‘‘చక్కటి కథ, పాటలు, ఫైటులు... అన్నీ సమపాళ్లలో ఉన్న చిత్రమిది. సప్తగిరిగారు ఎంతో కష్టపడి చేశారు’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘కథ నచ్చడంతో సప్తగిరి పారితోషికం తీసుకోకుండా చేస్తానన్నారు. ఆయన మాకెంతో మద్దతుగా నిలిచారు’’ అని కేఎమ్‌ కుమార్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే క్రాంతికుమార్‌, నటుడు అలీ, సంగీత దర్శకుడు ప్రతాప్‌ విద్య తదితరులు పాల్గొన్నారు.