Advertisement
Advertisement
Abn logo
Advertisement

పూజకు వెళ్తూ.. మృత్యు ఒడికి!

  • తిరుపతి వేద విశ్వ విద్యాలయం డీన్‌ దంపతుల దుర్మరణం
  • ఆగివున్న లారీని ఢీకొన్న కారు


గుడ్లూరు/గుడివాడ/పెదపారుపూడి, డిసెంబరు 8: అయ్యప్ప స్వామి పూజను నిర్వహించేందుకు బయలుదేరిన ఆగమ విద్వాన్‌ దంపతులు డ్రైవర్‌ నిర్లక్ష్యం, నిద్రమత్తు కారణంగా మరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. చెన్నై-కొల్‌కతా జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లా గుడ్లూరు వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతి వేద విశ్వవిద్యాలయం డీన్‌ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు(58), రాజ్యలక్ష్మి(55) దంపతులు సహా కారు డ్రైవర్‌ మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన శ్రీనివాసాచార్యులు తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయంలో డీన్‌గా పనిచేస్తున్నారు. అక్కడే నివాసం ఉంటున్నారు. ఒంగోలులో బుధవారం అయ్యప్ప పూజకు ఆహ్వానం అందడంతో శ్రీనివాసాచార్యులు దంపతులు తిరుపతి నుంచి డ్రైవర్‌ పురుషోత్తమరావు(32)తో కలిసి కారులో బయల్దేరారు. ఉదయం 8 గంటల సమయంలో గుడ్లూరు మండలం చేవూరు వద్దకు చేరుకుంటున్న సమయంలో డ్రైవర్‌ కునుకుతీయడంతో వారు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్‌తోపాటు డ్రైవర్‌ పక్కసీటులో కూర్చున్న శ్రీనివాసాచార్యులు ప్రాణాలు విడిచారు. వెనుక సీటులో కూర్చున్న రాజ్యలక్ష్మిని కావలి వైద్యశాలకు తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసాచార్యులు దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు తిరుమల శ్రీవారి సన్నిధిలో పౌరోహిత్యం చేస్తున్నారు. 

ఆగమ శాస్త్రంలో దిట్ట.. వేల మంది శిష్యులు

శ్రీనివాసాచార్యులు ఆగమ శాస్త్రంలో దిట్ట. ద్వారకా తిరుమల వేదపాఠశాలలో 1985 నుంచి 2014వరకు అధ్యాపకునిగా పనిచేశారు. 2014 నుంచి తిరుపతి వేదవిశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా, డీన్‌గా సేవలు అందిస్తున్నారు. శ్రీనివాసాచార్యులు మృతి తనను కలచివేసిందని టీటీడీ హిందూధర్మ ప్రచారపరిషత్‌ విశిష్ట ధర్మాచార్య కావూరి శ్రీధర్‌ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement