Abn logo
Sep 27 2020 @ 01:06AM

గురుకుల్‌ భూమిలో ఆక్రమణలు

పట్టించుకోని అధికారులు

నిలిచిపోయిన ప్రహరీ నిర్మాణం


ఘట్‌కేసర్‌: ఘట్‌కేసర్‌లోని గురుకుల్‌ భూమిలో ఆక్రమణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పట్టణంలో 25 ఎకరాల విస్తీర్ణంలో 1942లో బన్సిలాల్‌ వ్యాస్‌ గురుకుల విద్యాలయాన్ని నెలకొల్పారు. ప్రాథమిక విద్యనుంచి ఇంటర్‌ వరకు తెలుగు, ఉర్దూ మాద్యమాలలో విద్యాబోధన జరిగేది. ప్రధానంగా హాస్టల్‌ వసతితో పాటు ఆర్య సమాజ్‌ విధానంలో విద్యార్థులకు విద్యాబోధన జరిగేది. దీంతో ఉదయం, సాయంత్రం యజ్ఞం నిర్వహించేవారు. దానికితోడు వ్యవసాయం, గోశాలను నిర్వహించేవారు. పగలు, రాత్రి అనే తేడాలేకుండా నిరంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు తిరుగుతుండటంతో గురుకుల్‌ భూమిలోకి ఎవరు వెళ్లడానికి సాహసించేవారు కాదు. బన్సిలాల్‌ వ్యాస్‌  1956 సెప్టెంబర్‌ 2న సంగీత కచేరీకి వెళ్తుండగా రైలు ప్రమాదంలో మృతిచెందారు. ఆ తర్వాత గురుకుల్‌ తీవ్ర కష్టాల్లో కురుకుపోయింది. అప్పటినుంచి ఎండోమెంట్‌ ఆధీనంలోకి వెళ్లడంతో ఆలనాపాలనా లేకుండా పోయింది. దానికితోడు ఎంతో విలువైన గురుకుల్‌ భూమి ఆక్రమణకు గురవుతున్నది.


రైల్వే వంతెన నిర్మాణం కోసం దాదాపు మూడు ఎకరాలకు పైగా కోల్పోవలసి వచ్చింది. కొండాపూర్‌ రోడ్‌లోని గురుకుల్‌ భూమిలో కొంత మంది అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. సంవత్సరాలు గడుస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు మరింత విస్తరిస్తున్నాయి. మాజీ ఎమ్యెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి గురుకుల్‌ చుట్ట ప్రహరీ గోడ నిర్మాణం కోసం గత మూడు దఫాలుగా రూ.35లక్షల నిధులు మంజూరు చేశారు. ఇందులో అధిక శాతం పనులు పూర్తయ్యాయి. కానీ ఆక్రమణల కారణంగా ప్రహరీ నిర్మాణం సైతం నిలిచిపోయింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇలాగే ఊరుకుంటే భవిష్యత్తులో గురుకుల్‌ భూమి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పూర్వవిద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గురుకుల్‌ భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.


ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు 

గురుకుల్‌ భూమిని కాపాడాలని అధికారులకు పలుమార్లు విజ్ఙప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. భవిష్యత్‌ తరాల వారికోసం గురుకుల్‌ భూమిని కాపాడాల్సిన అవసరం పత్రి ఒక్కరి మీద ఉంది. అధికారుల ఉదాసీనతతో మొత్తం గురుకుల్‌ భూమికి ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచిఉంది. 

- ఎండీ సిరాజ్‌, స్థానికుడు, బాలాజీనగర్‌, ఘట్‌కేసర్‌


గురుకుల్‌ భూమిని కాపాడాలి

ఎంతో ఘన చరిత్ర గల గురుకుల్‌ భూమిని కాపాడాలి. ఎంతో విలువైన భూమి ఆక్రమణకు గురవుతోంది. దీన్ని కాపాడాలని అధికారులకు స్థానికులు, పూర్వ విద్యార్థులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి.

- బర్ల హరిశంకర్‌, పూర్వవిద్యార్థి, ఘట్‌కేసర్‌

Advertisement
Advertisement
Advertisement