Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘నీగ్గూడ ఉండాలె గదనయ్య జ్ఞానం!’

సంక్షోభ సందర్భాలలో అంతర్థానం కావడం ఒక్కటే కాదు, ప్రత్యక్షం కావడం కూడా ఆయనకు తెలుసు. తగిలిన దెబ్బను కాలం మాన్పుతుందిలే అనుకున్నప్పుడు, ఏకాంత యవనికాభ్యంతరానికి వెళ్లి ఆత్మలోకంలో విశ్రమించడం ఒక పద్ధతి అయితే, పరిస్థితి మరీ జటిలం అయి చేజారిపోతున్నప్పుడు, తాను ఒక ప్రసంగాయుధాన్ని ఝళిపించి చక్కదిద్దాలనుకోవడం మరొక పద్ధతి. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక, కాకముందూ కూడా చంద్రశేఖరరావు అనుసరించిన ఎత్తుగడలు అవి. తాను మాట్లాడి చక్కబరచాలనుకోవడం మాత్రమే కాదు, తాను మాట్లాడితే చక్కబడిపోతుందని కూడా ఆయన నమ్ముతారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, ఆయన మాటతీరుకు, వాగ్ధాటికి ఆ శక్తి ఉన్న మాట నిజమే. అనేక సందర్భాలలో, కెసిఆర్ పత్రికా సమావేశాలు, ప్రసంగాలు వాతావరణాన్ని తేలికపరుస్తాయి, ఆయన ఆశ్వాసన, ఆగ్రహం, ఉద్వేగం అన్నీ హృదయాలను స్పృశించి నమ్మకం కలిగిస్తాయి. వినోదం సరే, ఎలాగూ ఉంటుంది. ఇతరులపై చేసే అవహేళనల ద్వారా, పరుషోక్తుల ద్వారా ఆ వినోదం బట్వాడా జరుగుతుంది. 


హుజూరాబాద్‌లో అపజయాన్ని దాని దారికి దాన్ని వదిలేయదలచుకోలేదు. అది సృష్టించగలిగే సమస్యలను, పర్యవసానాలను గ్రహించి, రంగంలోకి దిగడమే మంచిదనుకున్నారు. మాటల మంత్రదండంతో ఓటమి దిగులుని, నిస్పృహ వాతావరణాన్ని చెల్లాచెదరు చేయాలనుకున్నారు. ఎన్నిక మిథ్య, పరాజయం మిథ్య అని ప్రజలను నమ్మించాలనుకున్నారు. ప్రసంగం బాగానే పండింది. కలవరంగా కనిపించినా, ఆగ్రహాన్ని జాగ్రత్తగా, సహజత్వం దెబ్బతినకుండా నిర్వహించారు. ఆయన కేంద్రంపై యుద్ధప్రకటన చేస్తున్నట్టుగానే కనిపించారు. శుక్రవారం నాడు ధర్నా కూడా చేస్తారట. 


ప్రయత్నలోపం ఏమీ లేదు కానీ, జనస్పందనే అంతంత మాత్రంగా ఉన్నది. కెసిఆర్ మాటలను వడగట్టి, పంక్తుల మధ్య అంతరార్థాలను శోధించి, నమ్మాలా లేదా అన్న విచికిత్సలో పడ్డారు. సర్వశక్తులూ ఒడ్డి కూడా ఓడిన హుజూరాబాద్ యుద్ధం నుంచి దృష్టి మళ్లించడానికి నాయకుడు ప్రయత్నిస్తున్నాడని, కోటలు దాటుతున్న మాటలను నమ్మలేమని జనం గ్రహించారు. అందువల్ల, కెసిఆర్ రెండు వరుస ప్రసంగాలలోని తీవ్రత ప్రస్ఫుటంగా కనిపించినా, విశ్వసనీయత లోపించినట్టు కనిపించింది. సూక్ష్మగ్రాహి అయిన కెసిఆర్ దాన్ని గ్రహించినట్టే ఉన్నారు. ఎడతెగని ధారవాహికగా అలరిస్తుందనుకున్నది, రెండు రోజులకే ఎందుకు ముగిసినట్టు? ఇంకా మాట్లాడితే అధికప్రసంగం అని ఆయనకే అనిపించిందా? మండలి ఎన్నికల నిబంధనల కోసమని, వరంగల్ సభనో మరే విధాన ప్రకటననో మానుకోవచ్చును కానీ, పత్రికా ప్రసంగాలను విరమించుకోవడం ఎందుకు?


ఉద్యమ నాయకుడిగా, ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చవలసిన పాలకుడిగా, కెసిఆర్‌ను జనం చూడగలగడానికి కారణం ఆయనపై ఉండిన నమ్మకం. అదేమీ నికార్సయిన నమ్మకం కాదు. తప్పొప్పులు, మంచిచెడ్డలు బేరీజు వేసుకున్న నమ్మకం. తన మీద, తన నాయకత్వంలోని పార్టీ మీద విశ్వాసం సడలుతున్నదన్న అనుమానం కలిగినప్పుడల్లా, కెసిఆర్ ఆ చిన్న పాటి లోటును ఉద్వేగాలతో భర్తీ చేస్తారు. ఇప్పుడు, ఈ ఫార్ములా ఫలించినట్టు లేదు. కెసిఆర్ దీన్ని గుర్తించి దిద్దుబాటు చేసుకోకపోతే, ఆకాశం నుంచి శంభుని శిరం మీదకు జారిన గంగ లాగా పార్టీ ప్రస్థానం అవరోహణ పథంలో పరుగులు తీస్తుంది. పాలనా వైఫల్యాలను ప్రజలు గుర్తించి, ఓటు ద్వారా వ్యక్తం చేస్తున్నారని తెలిశాక, ప్రధాన ప్రత్యర్థి స్థానానికి కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ తమ తమ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రెండో స్థానానికి ఇద్దరూ పోటాపోటీగా ఉంటే, తనకే లాభం అని టిఆర్ఎస్ భ్రమించడానికి వీలులేకుండా, అధికార అభ్యర్థిని ఓడించేవారిని ఎవరో ఒకరిని ఎంచుకునే ధోరణి ఓటర్లలో వ్యక్తమవుతోందని హుజూరాబాద్ ఫలితం ఖరారు చేసింది. కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికో, జారిపోకుండా కాపాడుకోవడానికో బిజెపి మీదో మరో పార్టీ మీదో కారాలూ మిరియాలూ నూరడం ఒక్కటే టిఆర్ఎస్ మనుగడకు సరిపోదు. విశ్వసనీయతను పెంచుకోవడం ఎట్లాగో ఆలోచించాలి, సంస్కారాలను పెంచుకోవాలి. 


తొడలు కొట్టడం, తెలుగును భ్రష్టుపట్టించడంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టిస్తున్నదనుకుంటే, మెడలు వంచడం, ముక్కలు ముక్కలు నరకడం వంటి హింసాత్మక సవాళ్లతో తెలంగాణ కూడా సోదరుల దరిదాపులకు చేరుకుంటున్నది. నిజం పేలుడు మాటలా, లేక తాటాకు చప్పుళ్లా తెలియదు కానీ, పరస్పరం చేసుకుంటున్న నిందల్లో సంస్కారం అన్నది మచ్చుకు కూడా కనబడడం లేదు. సరే, రాజకీయ నాయకులు అనడానికి అయినా, పడడానికి అయినా వారికి అందులో ఎన్నో ప్రయోజనాలుంటాయి. ఉత్తిపుణ్యానికి, పాత్రికేయులు ఎందుకు మాటలు పడాలి? గతంలో అనేక మంది మంత్రులు, నాయకులూ జర్నలిస్టులపై అవమానకరంగా వ్యాఖ్యానించడం, వారు క్షమాపణ చెప్పేదాకా ఉద్యమాలు చేయడం జరిగేవి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం ఒకరిద్దరు అప్పుడప్పుడు పాత్రికేయుల విషయంలో అసహనానికి లోను అయ్యేవారు. కానీ, ఒక విధానంగా ఆనవాయితీగా, స్వభావంగా పాత్రికేయులను కించపరిచే ముఖ్యమంత్రులను ఇప్పుడే చూస్తున్నాము. 


పత్రికాసమావేశాలలో పాల్గొనే విలేఖరులను హేళన చేయడం, అవమానకరంగా సంబోధించడం, కించపరచడం, వీటిల్లో తెలుగు రాష్ట్రాలు రెంటికీ కిరీటాలు తొడగాలి. విలేఖరులను నిషేధించడం, కేసులు పెట్టడం, సమాచార ప్రసార సాధనాలనే అడ్డుకోవడం వంటి ఆరితేరిన చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో అనుభవాన్ని గడించిన సంగతి తెలిసిందే. పత్రికాగోష్ఠికి హాజరయిన విలేఖరులలో గిట్టని వారిని ప్రత్యేకించి వేలెత్తి చూపి, మరొకసారి రావద్దు అని చెప్పిన సంస్కారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో చూశాము. తెలంగాణ సిఎంకి అయితే, అదొక అలవాటు. మీడియా సంస్థలను పాతాళానికి తొక్కేస్తామని బహిరంగంగా మాట్లాడగలిగిన వ్యక్తిత్వం ఆయనది. విధానాలు నచ్చని సమాచార, ప్రసారసాధనాల సంస్థలపై కార్పణ్యం వహించడం ఆయన పద్ధతి. వాటికి ప్రకటనలు ఇవ్వకుండా, కార్యక్రమాలకు ఆహ్వానాలు ఇవ్వకుండా వేధించడం ఆ కక్షకు వ్యక్తీకరణలు. కానీ, నీ ఆహ్వానం మీద, నీ మాటలు విందామని వచ్చిన పాత్రికేయులను హీనపరచడం ఏమిటి? పాత్రికేయ సంఘాలు, పెద్దలు, అక్కడే ఉన్న సాటి విలేఖరులు ఎందుకు ఈ ధోరణిని నిరసించడం లేదు? పైగా, పగలబడి నవ్వడాలు కూడా.


చంద్రశేఖరరావు జనరంజక ప్రసంగ ధోరణిలో విలేఖరులను అవహేళన చేయడం ఒక ముఖ్యమైన భాగం. రిపోర్టర్లపై పంచ్‌లు, రిపోర్టర్‌కు వార్నింగ్.. ఇటువంటి శీర్షికలతో యూట్యూబ్‌లో ఎన్ని విడియోలు ఉన్నాయో చూస్తే, ఇది అరుదుగా జరిగేది కాదని తెలుస్తుంది. పాత్రికేయులతో చనువుగా ఉండవచ్చు, స్నేహం పెంచుకోవచ్చు. ఛలోక్తులు విసురుకోవచ్చు. కానీ, అవమానించకూడదు. విలేఖరే తన ప్రత్యర్థి అన్నట్టుగా ఎదురు ప్రశ్నలు వేయకూడదు. ఏ పత్రికాసంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఆ సంస్థతో తనకు ఎటువంటి సంబంధాలు ఉన్నప్పటికీ, ప్రసంగీకుడు పద్ధతి తప్పి ప్రవర్తించకూడదు. పత్రికాసమావేశానికి వచ్చిన పాత్రికేయులు దూతల వంటివారు. సమావేశంలో చెప్పినదాన్ని నమోదు చేసుకుంటారు. తాము కోరిన సమాచారాన్ని అడిగి పొందుతారు. అందులో విలేఖరుల వ్యక్తిగతమేదీ ఉండదు.


ఇటీవల జరిగిన రెండు పత్రికాసమావేశాలలో తెలంగాణ ముఖ్యమంత్రి విలేఖరులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కొన్ని: ‘‘నిపుణులా, ఎవడా నిపుణుడు, తీస్కరాపో, ఏడ పన్నడో తీస్కరా పో’’, ‘‘ఎవరేం జెబితే అది రాసుడు గాదు’’, ‘‘నీగ్గూడ ఉండాలె గదనయ్యా జ్ఞానం’’. అంతమంది మధ్యలో ఆ మాటలు వినవలసి రావడం విలేఖరికి ఎంత బాధగా ఉంటుంది? ఇట్లా అవమానకరంగా మాట్లాడడంలో, వ్యక్తిగత అహంకారం సరే, ప్రశ్నలు వేయడానికి ఎవరూ సాహసించకుండా నిరోధించే ప్రయత్నం కనిపిస్తుంది. ఏడాది, రెండేళ్ల కిందటి పత్రికా సమావేశాల్లో ముఖ్యమంత్రి వాక్చాపల్యం ఇది: ‘‘ఎక్స్‌ట్రా లెందుకయ్యా’’, ‘‘ఇదెక్కడి ప్రశ్ననయ్యా బాబు, ప్రశ్నలడగడం రాదు, ఏం రాదు’’, ‘‘మీకు గ్యారంటీ కరోనా తాకాలని శాపం పెడుతున్నా’’, ‘‘ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇది, ఇదో ప్రశ్ననా, ఏం ట్రయినింగ్ ఇచ్చిన్రు మీ పత్రికలో’’, ‘‘నువు కెసిఆర్‌తో పెట్టుకోలేవు, జాగ్రత్త’’.


పాలకులకు ఇంత చులకన భావం ఉండడానికి పత్రికారంగం స్వయంకృతం కూడా ఉండవచ్చు. కాదనలేము. కానీ, ఎంత కాదన్నా, జర్నలిజం రాజకీయాలంత చెడిపోలేదు కదా? మరి, పాత్రికేయులు రాజకీయవాదులను, పాలకులను గౌరవిస్తూనే ఉన్నారు కదా? అభిప్రాయ భేదాలతో నిమిత్తం లేకుండా, ఉదాత్తమైన వ్యవహారసరళితో పత్రికారచయితలు, రాజకీయవాదులు మెలగడం ఒక విలువ. నాయకుడిని ఎంతటి తీవ్రమైన ప్రశ్న వేయగలిగే ధైర్యాన్ని ఆ విలువ, వాతావరణం ఇస్తాయి. ప్రశ్నే మెచ్చని వారు, పాత్రికేయులను కేవలం వినిరాసే లేఖకులుగా పరిగణిస్తారు. తమతో అమర్యాదగా వ్యవహరించే రాజకీయనేతలను, పాలకులను పాత్రికేయులు ఎక్కడికక్కడే ప్రశ్నించాలి. తమ గౌరవాన్ని తామే పెంచుకోవాలి. 

కె. శ్రీనివాస్

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...