Abn logo
Apr 16 2021 @ 00:00AM

క్రూరత్వం నుంచి దానశీలత వైపు...

‘అన్నిటికీ అగ్రగామి మనసే!’ అంటుంది బౌద్ధుల ధమ్మపదం. మనస్సులో క్రూరత్వం ఉంటే అది కొండరాయి కన్నా కఠినంగా ఉంటుంది. క్రూరత్వం తొలగి, మానవత్వానికి మళ్ళితే అది వెన్నముద్ద కన్నా మెత్తగా ఉంటుందని ప్రపంచానికి చాటిన వ్యక్తి సమ్రాట్‌ అశోకుడు. చరిత్రలో ధర్మరాజుగా పేరు పొందినవాడు.. పాలితులను ‘ప్రజలు’ (అంటే... కన్నబిడ్డలు) అని ప్రకటించిన తొలి చక్రవర్తి. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ప్రతి అడుగులో తన ప్రతిరూపాలను నిలుపుకోగలిగిన ఏకైక మహారాజు.అశోకుడు వీరుడు. క్రూరుడు కూడా. వారసత్వం ప్రకారం మౌర్య సామ్రాజ్యానికి అతని అన్న సుమనుడు చక్రవర్తి కావాలి. కానీ, అంతఃపుర కుట్రలు జరిగాయి. అన్న సుమనుణ్ణి అశోకుడు చంపాడు. ఈ వార్త తెలిసి, నిండు గర్భిణి అయిన సుమనుడి భార్య ఆరుణి అంతఃపురాన్ని విడిచి పారిపోయింది. అశోకుడు తన సోదరుల్లో తమ్ముడు తిస్సను తప్ప మిగిలిన వారందరినీ చంపేశాడు. పారిపోయిన వదిన కోసం వెతికించాడు. ఆమెను ఒక బౌద్ధ భిక్షువు రక్షించాడు. భిక్షుణీ వేషం వేయించి, వైశాలిలోని బౌద్ధారామానికి చేర్చాడు. కొన్నాళ్ళకు ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డడి పేరు నిగ్రోధుడు. 


పుష్కర కాలం గడిచింది. కళింగ యుద్ధం తరువాత అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించాడు. చండ అశోకుడు ధర్మ అశోకునిగా మారాడు. 


ఒక రోజు అశోకుడు తన భవనం పైనుంచి రాజవీధిలోకి చూస్తున్నాడు. ఆ వీధిలో ఒక యువ భిక్షువు నడచి వస్తున్నాడు. మంచి వర్చస్సు, శాంతి తేజస్సు అతని ముఖంలో తాండవిస్తోంది. అతని నడకలో ధర్మ రాజసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వెంటనే పరివారాన్ని పిలిచి- 


‘‘ఆ యువ భిక్షువును మా మందిరానికి ఆహ్వానించండి’’ అని చెప్పి పంపించాడు అశోకుడు. 


ఈ విషయం మంత్రులకు తెలిసింది. కలవరపడ్డారు. భయపడ్డారు. ఆ భిక్షువు ఎవరో వారికి తెలుసు. అశోకునికి తెలియదు. ఒకవేళ అతను ఎవరో తెలిస్తే... అశోకుడు ఏం చేస్తాడో? అనే భయం... ఎందుకంటే ఆ భిక్షువు అశోకుడి అన్న సుమనుడి కొడుకు నిగ్రోధుడు.అశోకుని పరివారం వెళ్ళి... భిక్షువును లోపలికి తీసుకువచ్చారు. అఖండ జంబూ ద్వీపానికి చక్రవర్తి అయిన అశోకుడు ఆ భిక్షువుకు ఎదురుగా వచ్చాడు. భక్తితో అతని భిక్ష పాత్ర అందుకొని పట్టుకున్నాడు. వినమ్రంగా వంగి వంగి నడచి, తన సింహాసనం పక్కన ఉన్న ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఆ యువ భిక్షువు చేసిన ధర్మోపదేశం విని పరవశించిపోయాడు. వంగి అతని పాదాలకు తన శిరస్సును ఆనించి  ప్రణమిల్లాడు. ఆ యువ భిక్షువు తన అన్న కుమారుడేనని తెలిసి, అతని పాదాల చెంత కూర్చొని విలపించాడు. విక్రోధుడు ఎప్పుడు ధర్మప్రబోధం చేసినా, అశోకుడు అతని పాదాల దగ్గరే కూర్చొనేవాడు. అశోకునికి విక్రోధుడు చేసిన ప్రబోధమే ధమ్మపదంలో ‘అప్రమాదవర్గ’గా ప్రసిద్ధి!


బుద్ధుని కాలంలో బౌద్ధ సంఘానికి మహాదానం చేసిన అనాథపిండుకునితో సమానంగా... వంద కోట్ల బంగారు నాణేలు దానంగా సమర్పించాలని అశోకుడు అనుకున్నాడు. అతనికి డెబ్భై ఏళ్ళు వచ్చేసరికి తొంభై ఆరు కోట్లు దానం చేశాడు. ఆ తరువాత అశోకుని కుమారుడైన కుణాలుడి కొడుకు సంప్రదిన్‌ సింహాసనాన్ని అధిరోహించాడు. ఇక దానాలు చేయకుండా అశోకుణ్ణి ఒక గదికి పరిమితం చేశాడు.


‘ఇంకా నాలుగు కోట్ల దానం మిగిలి ఉంది. ఏం చేయాలి?’ అని అశోకుడు ఆవేదన పడ్డాడు. ప్రతిరోజూ బంగారు పళ్ళెంలో ఆహారం వచ్చేది. ఆ వచ్చిన పళ్ళేలను దానంగా పంపేవాడు. ఇది తెలిసి అతని మనుమడు వెండి కంచాల్లో ఆహారం పంపించాడు. అశోకుడు వాటినీ దానం చేశాడు. ఆ తరువాత రాగి కంచాలు, చివరకు మట్టి మూకుళ్ళు వస్తే వాటిని కూడా దానంగా సమర్పించాడు. ఆఖరికి ఆకుల్లో ఆహారం వచ్చేది. తాను తినకుండా ఆ ఆహారం మొత్తం దానం చేసేవాడు. ఒక రోజు ఆహార పదార్థాలకు బదులు సగం ఉసిరికాయ భోజనంగా వచ్చింది. 
‘‘ఓ భిక్షువులారా! మహాదాత, మహా వీరుడు, నాలుగు సముద్రాలు ఎల్లలుగా ఉన్న భూమండలానికి అధిపతి అయిన అశోక మౌర్యుడు... చివరకు ఈ సగం ఉసిరికాయనే దానంగా పంపగలుగుతున్నాడు’’ అనే సందేశాన్ని పంపిస్తూ, ఆ ఉసిరికాయ ముక్కను కూడా దానం చేశాడు అశోకుడు. ఆ సగం ఉసిరికాయకు గుర్తుగా పాటలీపుత్రంలో... అదే ఆకారంలో ఒక బౌద్ధ స్థూపాన్ని నిర్మించారు. అది అశోక ‘ఆమ్లకారామం’గా ప్రసిద్ధి చెందింది.


అశోకుని మరణానంతరం తన త్పపును తెలుసుకున్న సంప్రదిన్‌ నాలుగు కోట్ల నాణేల్ని సంఘానికి దానం చేసి, తన తాతగారి కోర్కెను తీర్చాడు. అలా అశోకుడు మహాదాతగా నిలిచాడు. భారతదేశ స్మృతిలో చిరంజీవి అయ్యాడు. 

(20న అశోకుని జయంతి)

 బొర్రా గోవర్ధన్‌


Advertisement
Advertisement
Advertisement