Abn logo
Sep 19 2020 @ 00:44AM

సింగరేణికి ఉచిత బొగ్గు బ్లాక్‌లు

Kaakateeya

తెలంగాణ సహా 11 రాష్ట్రాల కోల్‌బెల్ట్‌ ప్రాంతాల ఎంపీలు బొగ్గు సంస్థల మనుగడకు వీలుగా వాటికి ఉచితంగా బొగ్గుబ్లాక్‌లను కేటాయించే విషయంపై తక్షణమే పార్లమెంట్‌లో పోరాడాలి.


ప్రైవేటీకరణ నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థలైన సింగరేణికి, కోలిండియాకు, దాని అనుబంధ సంస్థలకు బొగ్గుబ్లాక్‌లను కేటాయించని పక్షంలో ఆ సంస్థల మనుగడ అసాధ్యంగానే కనిపిస్తోంది. కేంద్రప్రభుత్వం బొగ్గుబ్లాక్‌లను వేలం ద్వారా ప్రైవేటీకరించడం వల్ల ఈ సంస్థలు నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే సింగరేణి తవ్వాలనుకుని నిర్ణయం తీసుకున్న ఆరు బొగ్గుబ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం కేటాయించని కారణంగా ఉపసంహరించుకోవలసి వచ్చింది. తీవ్రమైనదైన ఈ విషయంపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడం విషాదకరం. మొత్తం 41 బొగ్గుబ్లాక్‌లను వేలం వేసే ప్రక్రియను జూన్‌ 18న స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ, బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి ప్రారంభించారు. దీంతో నల్లబంగారు నేల రగిలిపోతోంది. ఆ ప్రాంతాల ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన పోరాట కార్యక్రమాలకు మద్దతు పలుకుతున్నారు. జాతీయ కార్మిక సంఘాలతో పాటు ఇతర ప్రాంతీయ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఎంత మొత్తుకున్నా బొగ్గుబ్లాక్‌ల ప్రైవేటీకరణ వేలం ఆగలేదు. మహారాష్ట్రలో 3, ఝార్ఖండ్‌లో 9, చత్తీస్‌గఢ్‌లో 9, మధ్యప్రదేశలో 11, ఒడిస్సాలో 9 బ్లాక్‌లను వేలం వేశారు. ఈ వేలానికి సంబంధించిన బిడ్‌లను సెప్టెంబరు చివరి నాటికి ఓపెన్‌ చేసే అవకాశముంది. 


ఆదివాసీలకు, పర్యావరణానికి తీవ్ర నష్టం చేసే నాలుగు బొగ్గుబ్లాక్‌ల వేలంను రద్దు చేయాలంటూ ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. నోగో ప్రాంతాలలో బొగ్గుబ్లాక్‌లను ఇవ్వకూడదని, తవ్వకూడదని ఆయన చేసిన వాదనను కేంద్రం అంగీకరించి ఆ నాలుగు బ్లాక్‌లను వేలం వేసిన 41 బ్లాక్‌ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా తడోబా టైగర్‌జోనకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బందర్‌ బొగ్గుబ్లాక్‌ను రద్దు చేయాలని ఆదివాసీలు ఆందోళన చేయడంతో కేంద్రం దాన్ని కూడ జాబితా నుంచి తొలగించింది. రెండు దశాబ్దాలుగా కోలిండియా, సింగరేణి భారీ లాభాలతో నడుస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.20 వేల కోట్లకు పైగా డివిడెండ్లు, రాయల్టీలు, ఇతర పన్నులు చెల్లించాయి. సింగరేణి లాంటి సంస్థ డిస్ట్రిక్‌్ట మినరల్‌ ఫండ్‌ పేరిట అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కూడ అందజేస్తోంది. 2019లో కేంద్రానికి రూ.3400 కోట్లు, రాష్ట్రానికి రూ.3,610 కోట్లు చెల్లించింది. వివిధ పన్నులు, రాయల్టీలు, ఐటీలు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వం బొగ్గు సంస్థల నుంచి ఆదాయం పొందుతున్నప్పటికీ గత 20 ఏళ్లుగా బడ్జెట్‌లో వాటి కోసం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అయినా వాటి అభివృద్ధి ఆగలేదు.


ప్రతీ సంవత్సరం 200 మిలియన్‌ టన్నుల మేరకు మన దేశం బొగ్గు దిగుమతి చేసుకుంటోంది. దీని విలువ దాదాపు లక్షా 75 వేల కోట్లు. కోలిండియా, సింగరేణి దేశానికి అవసరమైన వంద కోట్ల టన్నుల బొగ్గుకు బదులు 70 కోట్ల టన్నులు మాత్రం ఉత్పత్తి చేస్తున్నందున బొగ్గుబ్లాకులను ప్రైవేటుపరం చేసి ఈ లోటును పూడ్చుతామంటున్నారు. ముందు 41, ఆ తర్వాత 200- ఇలా దశలవారీగా మొత్తం 500 బొగ్గుబ్లాక్‌లను ప్రైవేటువారికి అప్పజెప్పనున్నారు. ఇందుకోసం ఆత్మనిర్భర్‌లో రూ.50 వేల కోట్లు కేటాయించారు. కోలిండియా అన్వేషించి సిద్ధం చేసి ఉంచిన బొగ్గుబ్లాక్‌లను కూడా వేలం వేస్తున్నారు. బిడ్డింగ్‌ ఆధారంగా ఈ బొగ్గుబ్లాక్‌ల కేటాయింపు ఉంటుంది. వేలంలో వాటిని దక్కించుకున్న సంస్థలు ఇన్‌కం షేరింగ్‌ సిస్టమ్‌ ప్రకారం ఆదాయాన్ని ప్రభుత్వంతో పంచుకుంటాయి. ఆ మొత్తం 4 నుంచి ఆపై ఎంత శాతం ఉంటుందో ఆ సంస్థలు బిడ్డింగ్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఆదాయం పంచుకోవడం ఉంటుంది. గతంలో యూపీఏ ప్రభుత్వం 14.24 మిలియన్‌ టన్నుల నిక్షేపాలున్న 99 బ్లాక్‌లను క్యాప్టివ్‌ మైన్స కింద ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. వాటిని దక్కించుకున్న సంస్థలు బొగ్గు ఉత్పత్తి చేయలేదు. ఈలోపు అవినీతి, అక్రమాల కారణంగా సుప్రీంకోర్టు ఆదేశాల ననుసరించి మోదీ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మోదీ సర్కారు బొగ్గుగనుల సవరణ చట్టం- 2015ను అమలులోకి తెస్తూ 1973 నాటి జాతీయకరణ చట్టానికి సవరణ చేసింది. దీని ప్రకారం ఎవరైనా తాము ఉత్పత్తి చేసిన బొగ్గును బహిరంగ మార్కెట్లో తనకు నచ్చిన రీతిలో అమ్ముకోవచ్చు. ఇది బొగ్గుగనుల జాతీయకరణ లక్ష్యానికి తూట్లు పొడవడమేనని కార్మిక సంఘాలు ఘోషించాయి. ఒకసారి ప్రభుత్వరంగ సంస్థలు మూతపడ్డాక కాంట్రాక్ట్‌ సంస్థలు ధరల పెరుగుదలకు శ్రీకారం చుట్టి దేశ సంపదను కొల్లగొట్టే ప్రమాదముంది. వేతన ఒప్పందాలు జరిగే వేతన కమిటీలు ఉండవు కనుక ప్రైవేటు సంస్థలు వాటికి తోచిన విధంగా వేతనాలు ఇస్తాయి. ఇప్పుడు కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలూ ఉండవు. 

కాంట్రాక్టీకరణ లాంటివి ఇప్పటికే దేశంలోని 50కి పైగా ప్రభుత్వరంగ సంస్థలను దెబ్బతీశాయి. కోలిండియాలో 30 శాతం వాటాను ఇదివరకే అమ్మేశారు. కొవిడ్‌-19 వల్ల దేశమంతా ఆగమవుతున్న నేపథ్యంలో బొగ్గుబ్లాక్‌లను ప్రైవేటు సంస్థలకు, గుత్తేదార్లకు అప్పజెప్పే వేలం కార్యక్రమాన్ని ప్రధాని స్వయంగా ప్రారంభించడంతో ప్రభుత్వరంగంలోని ఉద్యోగులు, కార్మికులంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు బొగ్గుబ్లాక్‌ల ప్రైవేటీకరణ వల్ల ఆదివాసీలకు ప్రయోజనం కలుగుతుందని, చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వరంగంలో లభించని ఉద్యోగాలు  ప్రైవేటు రంగంలో ఎలా లభిస్తాయి? కరోనా మహమ్మారి కారణంగా కొంత, మరోవైపు సోలార్‌, హైడల్‌, విండ్‌ విద్యుత్‌ ఉత్పత్తి వైపు థర్మల్‌ విద్యుత్‌ రాష్ట్రాలు మొగ్గుచూపడం వల్ల కొంత బొగ్గుకు గిరాకీ తగ్గింది. సింగరేణిలో 40 లక్షల టన్నులకు పైగా, కోలిండియాలో 10 కోట్ల టన్నులకు పైగా తవ్వి తీసిన బొగ్గు అలాగే నిల్వ ఉంది. బొగ్గు ఆధారిత పరిశ్రమలు దేశవ్యాప్తంగా 18 లక్షలకు పైగా కొట్టుమిట్టాడుతున్నాయి. రేపు ప్రైవేటు బొగ్గు సంస్థలు వచ్చి ధరలు తగ్గిస్తే సింగరేణి, కోలిండియాల పరిస్థితి ఏమవుతుందోననే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారికి బొగ్గుబ్లాక్‌లు కావాలన్నా పోటీ పడాల్సిందే. టెండర్లు వేయాల్సిందే. బిడ్‌లలో పాల్గొనాల్సిందే. ప్రభుత్వ రంగ సంస్థ అయినా ప్రభుత్వానికి కమిషన్లు ఇవ్వాల్సిందే. పాలకుల వ్యవహారంతో ప్రభుత్వరంగానికి ఇక చరమగీతం పాడినట్లేనా... కార్మిక శ్రేయస్సు స్వస్తివాచకం పలికినట్లేనా... ఇక టేకేదార్ల రాజ్యం వచ్చినట్లేనా అనే భావనతో కార్మికలోకం అల్లాడిపోతోంది. పోరుబాట పట్టిన సంఘాలకు ప్రజాప్రతినిధులు మద్దతు పలకాల్సిన నైతిన బాధ్యత ఉంది. ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున, తెలంగాణ సహా 11 రాష్ట్రాల కోల్‌బెల్ట్‌ ప్రాంతాల ఎంపీలు బొగ్గు సంస్థల మనుగడకు వీలుగా వాటికి ఉచితంగా బొగ్గుబ్లాక్‌లను కేటాయించే విషయంపై పోరాడాలి.


ఎండీ. మునీర్‌

Advertisement
Advertisement
Advertisement