Abn logo
Oct 11 2020 @ 05:35AM

కొత్త జిల్లాలకు నాలుగేళ్లు...

Kaakateeya

5వ ఏడులోకి అడుగు పెట్టిన వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలు

సంక్షేమ కార్యక్రమాల అమల్లో ముందంజ

అన్ని శాఖల్లో పీడిస్తున్న సిబ్బంది కొరత 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): కొత్తజిల్లాలు ఆవిర్భవించి నాలుగేళ్లు పూర్తయింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించారు. వికారాబాద్‌, మేడ్చల్‌ కొత్త జిల్లాలుగా ఆవిర్భవించగా, రంగారెడ్డి జిల్లా యథాతథంగా కొనసాగుతోంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరు బాగున్నా.. ఆశించిన స్థాయిలో జిల్లా అభివృద్ధి జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా వికారాబాద్‌ జిల్లా కేంద్రం కావాలన్న ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరినా అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో ఆశించిన ప్రగతి కనిపించకపోవడం ప్రజలను ఆవేదనకు గురిచేస్తోంది. ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న కొత్త జిల్లాను ఇంకా పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిఽధులు విడుదల కాకపోవడంతో మౌలిక సదుపాయాల కల్పనలోనూ సమస్యలు తప్పడం లేదు.


కొత్త జిల్లాకు అనుగుణంగా వివిధ శాఖల్లో అవసరమైన మేరకు సిబ్బందిని నియమించకపోవడం వల్ల పనుల్లో జాప్యం తప్పడం లేదు. నాలుగేళ్లలో జిల్లాకు ముగ్గురు కలెక్టర్లు మారారు. జిల్లా మొదటి కలెక్టర్‌గా దివ్యదేవరాజన్‌ పనిచేయగా, ఆ తరువాత సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌, ఆయేషా మస్రత్‌ ఖానమ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గా పౌసుమిబసు కొనసాగుతున్నారు. మేడ్చల్‌ జిల్లా పరిస్థితి కూడా అంతే ఉంది. జిల్లా ఏర్పడి నాలుగు సంవత్సరాలవుతున్నా కనీసం కలెక్టరేట్‌ నిర్మాణానికి కూడా నోచుకోలేదు.


సమస్యల లొల్లి

పరిపాలన ప్రజల వద్దకు చేర్చాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం సరిపడా సిబ్బందిని నియమించడాని కి చర్యలు తీసుకోకపోవడంతో ఇబ్బం దులు తప్పడం లేదు. పనిచేస్తున్న వారిపైనే పనిభారం పెరుగుతుండగా, పనులు పూర్తికాక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధితో ముడివడి ఉన్న ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే నిధులు ఎంతో అవసరం. ఇటీవల కురిసిన వర్షాలకు వికారాబాద్‌ జిల్లాలోని మన్సాన్‌పల్లి, దోర్నాల్‌, రుద్రారం వద్ద వాగులపై ఉన్న రోడ్డు వంతెనలు కొట్టుకుపోయి ప్రజారవాణా పూర్తిగా స్తంభించాయి. చాలారోజుల పాటు ఈ మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.


పక్కా ప్రణాళికలతో బ్రిడ్జిల నిర్మాణం చేపడితే తప్ప ఈసమస్య పరిష్కారమయ్యే అవకాశం కనిపించడం లేదు. వికారాబాద్‌, పరిగిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటు, అనంతగిరి, కోట్‌పల్లిలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి పరుస్తామన్న హామీ సాకారం కాలేదు. వికారాబాద్‌ చుట్టూ రింగ్‌రోడ్డు ప్రతిపాదనగానే ఉండిపోయింది. మేడ్చల్‌ జిల్లా చాలావరకు హైదరాబాద్‌ నగరంలోనే కలిసి ఉంది. ఇక్కడ జిల్లా ఏర్పడకముందు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏమీ లేదు.


సంక్షేమ కార్యక్రమాల్లో ముందంజ...

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో వికారాబాద్‌ జిల్లా ముందుకు సాగుతోంది. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు చివరి దశకు చేరుకున్నాయి. శిథిలావస్థకు చేరిన చెరువులను పునరుద్ధ్దరించే మిషన్‌కాకతీయతో జిల్లాలో నాలుగువిడతల్లో రూ.234.78 కోట్లతో 733చెరువులకు మరమ్మతులు చేపట్టారు. మార్కె టింగ్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గోదాముల నిర్మాణం చాలా వరకు పూర్తయింది. టీయూఎఫ్‌ఐడీసీ కింద తాండూరు, వికారాబాద్‌ మునిసిపాలిటీల్లో ఒక్కోచోట రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. జిల్లా ఓడీఎఫ్‌ అయ్యేలా అధికారులు కృషి చేశారు. ఉపాధి హామీ పనుల్లో వికారాబాద్‌ జిల్లా వరుసగా మూడేళ్ల పాటు జాతీయ అవార్డులు కైవసం చేసుకుంది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు జిల్లాలో  విశేష స్పందన లభిస్తోంది. సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. 

Advertisement
Advertisement