Abn logo
May 4 2021 @ 03:06AM

విలక్షణ నేత సబ్బం

ఉపరాష్ట్రపతి వెంకయ్య, సీఎం జగన్‌, చంద్రబాబు, బండారు దత్తాత్రేయ, వీహెచ్‌ తదితరుల సంతాపం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) 

మాజీ ఎంపీ సబ్బం హరి మృతి చెందడంపై వివిధ పార్టీల నేతలు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సబ్బం హరి తనకు వ్యక్తిగతంగా మంచి మిత్రులని, తనను ఆయన ఎంతగానో అభిమానించేవారని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుకాక ముందే తనకు సుపరిచితులని పేర్కొన్నారు. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా తాను సబ్బం హరి త్వరగా కోలుకుని తిరిగి ఆరోగ్యంతో వస్తారని ఆకాంక్షించానన్నారు. సబ్బం హరి మృతి పట్ల సీఎం జగన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సబ్బం హరి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ‘‘మాజీ ఎంపీ సబ్బం హరి మరణం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆయన మృతి నన్ను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. ఆయన ఇక లేరన్న వార్తను నమ్మలేకపోతున్నాను’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కరోనా నుంచి కోలుకుంటారని ఆశించాను. కానీ, ఇంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. 


హరి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది’’ అన్నారు. ‘‘సబ్బం హరి మృతి బాధాకరం. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రే య పేర్కొన్నారు. సబ్బం హరి తన ప్రియమైన శిష్యుడని వి.హనుమంతరావు అన్నారు. మంచి నాయకుడు, విద్వత్తు ఉన్నవాడని అన్నారు. మాజీ ఎంపీ సబ్బం హరి మృతి చెందారన్న విషయం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు. సబ్బం మృతి విశాఖ ప్రజలకు తీరని లోటన్నారు. కరోనా బారిన పడి ఆయన మరణించడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అచ్చెన్నాయుడు ఆవేదన వెలిబుచ్చారు. సబ్బం హరి సమకాలీన రాజకీయ విశ్లేషణలో ఓ డిక్షనరీ లాంటి వ్యక్తి అని టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు. 


మాలాంటివారికి ఆదర్శంగా నిలిచారు: లోకేశ్‌

‘‘సబ్బం హరి ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. తన నిస్వా ర్థ రాజకీయాలతో మాలాంటి వారికి మార్గదర్శకులుగా నిలిచారు. ఆయన లాంటి నేతను కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. హరి మరణం రాష్ట్రానికి తీరని లోటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సబ్బం హరి తమకు ఆదర్శమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు. హరి విలక్షణమైన రాజకీయ నాయకుడు, మంచి విశ్లేషకుడని, ఆయన మరణం సమాజానికి తీరని లోటని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ కే రఘురామకృష్ణరాజు ఓ ప్రకటనలో హరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘‘కొందరు నీచులు, తుచ్ఛులు హరి ఆస్పత్రిలో ఉంటే.. సామాజిక మాధ్యమాల్లో నీచంగా పోస్టింగ్‌లు పెట్టారు. వారిలో పేర్ల చివర రెడ్డి అనే రెండు అక్షరాలున్నాయి. వీలైతే సంతాపం తెలపండి. లేకుంటే నోరు మూసుకోండి’’ అని రఘు హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఓ ప్రకటనలో తన ప్రగాఢ సంతాపం తెలిపారు. సబ్బం హరి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ సానుభూతి తెలిపింది. 

Advertisement
Advertisement
Advertisement