చెన్నై : అసెంబ్లీ ఎన్నికలలోగా కొత్త పార్టీని ప్రారంభిస్తానని దివంగత డీఎంకే మాజీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే అళగరి ప్రకటించారు. కరుణానిధి మృతి తర్వాత అళగిరి మళ్ళీ డీఎంకేలో చేరేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో మూడేళ్లకు పైగా రాజకీయాలకు దూరంగా వుంటూ మదురైలోనే గడుపుతున్నారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చెన్నై విచ్చేసినప్పుడు అళగిరి ఆయనను కలుసుకుంటారని, బీజేపీలో చేరుతారని ఊహాగానాలు చెలరేగాయి. ఆ తర్వాత సూపర్‌స్టార్‌తో చేతులు కలుపుతారని, పార్టీ ప్రారంభించేందుకు సలహాదారుగా వ్యవహరిస్తారని కూడా సామాజిక ప్రసార మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేశాయి. ఈ పుకార్లన్నింటికీ పుల్‌స్టాప్ పెట్టేలా అసెంబ్లీ ఎన్నికల్లో తాను తప్పకుండా క్రియాశీలక పాత్రను పోషిస్తానని అళగిరి ప్రకటించారు.
మంగళవారం ఉదయం మదురై విల్లాపురం ప్రాంతంలో ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందిన డీఎంకే స్థానిక నాయకుడు నల్లమరుదు నివాసానికి అళగిరి వెళ్ళి కుటుంబీకులను పరామర్శించారు. నల్లమరుదు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆ సందర్భంగా అళగిరి మీడియాతో మాట్లాడుతూ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తాను క్రియాశీలక పాత్రను పోషించి తీరుతానని చెప్పారు. ఈ నెలాఖరులోగా జరుగనున్న తన మద్దతుదారుల సమావేశంలో పార్టీని ప్రారంభించే విషయమై చర్చిస్తానని స్పష్టం చేశారు. డీఎంకేలో ఎంపీ దయానిధి మారన్‌కు ప్రాధాన్యతని స్తున్నారని వెలువడుతున్న వార్తలపై మీ అభిప్రాయమేమిటన్న ప్రశ్నకు వదంతులు, ఊహాగానాలకు సమాధానాలు చెప్పలేనని అళగిరి అన్నారు. ఇటీవల తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలుసుకోబోతున్నట్టు కూడా వార్తలు వెలువడ్డాయని, ఆ రీతిలోనే దయానిధికి సంబంధించి వెలువడుతున్న సమాచారం కూడా పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు.