బెంగళూరు: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతు డిమాండ్లకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ బుధవారంనాడు రాజ్‌భవన్ వరకూ చేపట్టిన ప్రదర్శనను సిటీ పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తదితరులను అరెస్టు చేశారు. ఫ్రీడం పార్క్ వద్ద మధ్యాహ్నం భారీ రైతు ర్యాలీని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అనంతరం ప్రదర్శనగా రాజ్‌భవన్‌కు వెళ్తుండగా కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పెద్ద ఎత్తున ప్రీడం పార్క్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని రాజ్‌భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీలతో అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి కేఎస్ఆర్టీసీ బస్సులోకి ఎక్కించి అక్కడ్నించి తరలించారు.
పోరాటం తీవ్రం చేస్తాం...
వివాదాస్పద చట్టాలను ఉపసంహరించుకునేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందని, మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు. రాష్ట్రంలోని యడియూరప్ప ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని, రాజ్యాంగం కల్పించిన విధంగా రైతులు శాంతియుత ప్రదర్శనలు చేస్తుంటే వారిపై పోలీసులను ప్రభుత్వం ఉసిగొలుపుతోందని విమర్శించారు.