సమావేశంలో మాట్లడుతున్న జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్
ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టండి : కలెక్టర్
కడప (కలెక్టరేట్), డిసెంబరు 1: అటవీ సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికడుతూ వన్యప్రాణులను కూడా సంరక్షించుకోవాలని కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబరులో ఏర్పాటు చేసిన జిల్లా అటవీ సంరక్షణ, వణ్యప్రాణి పరిరక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి జాయింట్ కలెక్టర్ గౌతమి, కడప, రాజంపేట సబ్ కలెక్టర్లు పృథ్వీతేజ్, కేతన్‌గార్గ్, జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న, డీఎప్వో రవీంద్రదామలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడవుల సంరక్షణ, చెట్లను అధికంగా నాటడం వంటి చర్యలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎర్రచందనంతో పాటు అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అటవీ సంపద సంరక్షణలో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 10 టీమ్‌ల ద్వారా కూంబింగ్ చేస్తోందని తెలిపారు. ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పట్టణ ప్రాంతాల్లో నగరవనాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. అందులో భాగంగా ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వేకోడూరు ప్రాంతాల్లో నగరవనాల అభివృద్ధిని ప్రోత్సహిస్తోందన్నారు. నగరవనాలను అభివృధ్ది చేసేందుకు తగిన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కడప నగరవనం, రైల్వేకోడూరు ప్రాంతంలో ఎర్రచందనం పార్కు ఉందన్నారు. సమావేశంలో ప్రొద్దుటూరు, రాజంపేట డివిజన్ ఫారెస్టు అధికారులు నాగార్జునరెడ్డి, నరసింహారావు, సామాజిక అటవీ శాఖాధికారి నాగరాజు, అటవీ స్క్వాడ్ అధికారి గురుప్రభాకర్, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, జిల్లా మత్స్యశాఖ డీడీ నాగరాజు, తదితర అధికారులు పాల్గొన్నారు.