Abn logo
Mar 6 2021 @ 10:22AM

`ఆర్ఆర్ఆర్`: క్లైమాక్స్ కోసం భారీ సంఖ్యలో విదేశీ ఫైటర్లు!

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్` సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్‌నైనా ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. క్లైమాక్స్ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. `గ్లాడియేటర్`, `బోర్న్ ఐడెంటిటీ`, `ఎక్స్ మెన్` వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ పర్యవేక్షణలో ఈ క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. 

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సన్నివేశం షూటింగ్ కోసం అమెరికా నుంచి దాదాపు 40 మంది ఫైటర్లు తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. నిక్ పావెల్ పర్యవేక్షణలో ఎన్టీయార్, రామ్‌చరణ్‌తో వీరు తలపడబోతున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ అత్యంత భారీగా, ఇంతకుముందెన్నడూ లేని రీతిలో అద్భుతంగా ఉండబోతోందట. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీయార్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఓలియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో అక్టోబర్ 13న విడుదల కాబోతోంది. 

Advertisement
Advertisement
Advertisement