Abn logo
Jul 7 2021 @ 00:42AM

ఎవరికోసం ఈ రాజ్యాంగం?

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడు దశా బ్దాలు గడిచిపోయినప్పటికీ దేశ ప్రజల జీవించే హక్కు గురించి, ప్రాథమిక హక్కుల గురించి ఇంకా చర్చిస్తున్నారంటే మన ప్రజాస్వామ్యం పరిణతి చెందలేదా, మన రాజకీయ నాయకులకు ప్రజాస్వామ్య విలువలు అర్థం కాలేదా, అసలు మన రాజ్యాంగమే విలువను కోల్పోతున్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఏకె గోపాలన్‌ను పి.డి. చట్టం క్రింద అరెస్టు చేయడం గురించి సుప్రీంకోర్టు విచారిస్తూ జీవించే హక్కు గురించి అత్యంత కీలకమైన ప్రశ్నలను లేవనెత్తింది. రాజ్యాంగం అనేది ఒక పుస్తకానికే పరిమితం కాదని, రాజ్యాంగంలోని వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన 19, 20, 21 అధికరణలను కలిసికట్టుగా అధ్యయనం చేస్తే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం అనేది నిలబడదని అప్పుడే దక్షిణాది నుంచి వచ్చిన న్యాయవాది ఎంకె నంబియార్ స్పష్టంగా వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవిస్తూ పి.డి. చట్టంలోని రెండు క్రూరమైన సెక్షన్లను రాజ్యాంగ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ప్రకటించింది. ముఖ్యంగా అరెస్టుకు కారణాలు చెప్పకూడదనే నిబంధనను కొట్టి వేసింది. ఎమర్జెన్సీ తర్వాత మేనకా గాంధీ కేసులో వ్యక్తి స్వేచ్ఛకు మరింత విస్తృతార్థాన్ని కల్పిస్తూ వ్యక్తి స్వేచ్ఛను జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర్యం, చట్టం ముందు అందరూ సమానులే అన్న హక్కును కలిపి చూడాలని స్పష్టం చేసింది. 1950లో వ్యక్తి స్వేచ్ఛ గురించి ఘంటాపథంగా సుప్రీంకోర్టులో చెప్పిన నంబియార్ ఎవరో కాదు ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తండ్రి! 


నాటితో పోలిస్తే నేడు వ్యక్తి స్వేచ్ఛకు అర్థాలు మారిపోయాయి. నాడు కేవలం పి.డి. చట్టం గురించే అంత గందరగోళం జరిగితే ఇప్పుడు అంతకంటే క్రూరమైన చట్టాలు వచ్చాయి. రాజ్యాంగంలోని 21, 22 అధికరణలు విలువ కోల్పోయినవా అన్న అభిప్రాయం తాజాగా వ్యక్తమవుతోంది. స్టాన్ స్వామి అనే ఆదివాసీ హక్కుల ఉద్యమకారుడు పోలీస్ కస్టడీలో మరణించడం, పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించినందుకు అస్సాంలో అఖిల్ గొగోయ్ అనే కార్యకర్తను 18 నెలల పాటు యుఏపిఏ చట్టం క్రింద జైలులో నిర్బంధించడం, ఇటీవల ముగ్గురు విద్యార్థి కార్యకర్తలను విడుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఈ చట్టంలోని బెయిల్ నిబంధలను ప్రశ్నించడం మొదలైన అనేక ఉదంతాలు గత రెండు సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం కొందరు వ్యక్తులు నేరాలు చేస్తున్నారని భావించవచ్చు. అయితే ఆ నేరాలను నిర్ధారించేందుకు చట్టాలను, సెక్షన్లను ఆపాదించడం, దుర్మార్గంగా, అమానుషంగా వ్యవహరించడం, వేగవంతంగా విచారణ జరపకుండా ఏళ్ల తరబడి జైళ్లలో నిర్బంధించడం, భద్రతాధికారులు విశృంఖలంగా వ్యవహరించడాన్ని అనుమతించడం మొదలైన వాటిని బట్టి రాజ్యాంగం అంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదన్న అభిప్రాయానికి ఆస్కారం కలుగుతోంది. ఒక వ్యక్తిని సుదీర్ఘకాలం విచారణలో ఉన్న ఖైదీగా నిర్బంధించడం అనేది చట్టం నిర్దేశించిన విధానానికి విరుద్ధమని, వేగవంతంగా విచారణ జరగడం అనేది ఆ వ్యక్తి హక్కు అని సుప్రీంకోర్టు 1978 లోనే స్పష్టం చేసింది. కాని గత రెండేళ్లలోనే యుఏపిఏ చట్టం క్రింద 3,974 మందిని అరెస్టు చేయడం, సాధారణ బెయిల్‌ను కూడా అనుమతించకపోవడం, విచారణకు ముందే వ్యక్తులను ఉగ్రవాదులుగా తీర్మానించడం జరుగుతున్న తీరు బిజెపి ప్రభుత్వ ఉద్దేశాల గురించి అనేక అనుమానాలకు దారితీస్తున్నది.


ఇటీవల జస్టిస్ పి.డి. దేశాయ్ స్మారకోపన్యాసంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ప్రసంగిస్తూ ‘రాజా నందకుమార్ జుడీషియల్ మర్డర్’ (న్యాయశాస్త్రం ప్రకారం చేసిన హత్య) అనే కేసును ఉటంకించారు. 1775లో ఒక గవర్నర్ జనరల్ లంచం పుచ్చుకున్నాడని ఆరోపించినందుకు రాజా నందకుమార్‌పై బూటకపు కేసులు పెట్టడమే కాక, బ్రిటిష్ కోర్టులో విచారించి మరణ శిక్ష విధించారు. గవర్నర్ జనరల్ హేస్టింగ్స్‌ను విమర్శించినందుకు జరిగిన హత్య ఇది. తమ ప్రయోజనాలను కాపాడుకోవడమే బ్రిటిష్ ప్రభుత్వానికి ముఖ్యం గనుక మానవ హక్కుల గురించి కానీ, వ్యక్తి స్వేచ్ఛ గురించి కానీ దానికి పట్టలేదని జస్టిస్ ఎన్‌వి రమణ అన్నారు. ఈ ఉదంతాన్ని ఆయన ఎందుకు ఉటంకించారు? ఇవాళ కూడా ప్రభుత్వాలు తమ ప్రయోజనాలను కాపాడుకోవడమే ముఖ్యంగా భావించి రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలను పాటించడం విస్మరిస్తున్న విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారా అన్న అభిప్రాయానికి ఆస్కారం లేకపోలేదు. చట్టం ముందు అందరూ సమానులేనని, న్యాయం, చట్టాలు అందరికీ అందుబాటులో ఉండాలని, చట్టాల రూపకల్పన, మార్పులో ప్రజలకు భాగస్వామ్యం ఉండాలని, అన్నిటికన్నా ముఖ్యంగా బలమైన స్వతంత్రమైన న్యాయవ్యవస్థ ఉండాలని ఆయన నాలుగు ప్రధాన సూత్రాలను స్పష్టం చేశారు. నిజానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా ఈ నాలుగు సూత్రాల గురించి ఒక ప్రధాన న్యాయమూర్తి మాట్లాడాల్సి రావడం విషాదకరం. ఆయన అలా మాట్లాడడానికి ఎన్నో కీలక సంఘటనలు ప్రేరేపించి ఉంటాయి. ఒక అన్యాయమైన చట్టానికీ, న్యాయమైన చట్టానికీ తేడా ఉన్నదని, న్యాయం, సమానత్వం అన్న విలువలను పుణికిపుచ్చుకోనిదేదీ చట్టం కాదని జస్టిస్ రమణ స్పష్టం చేశారు. మరి ఇప్పుడు అమలు అవుతున్న అన్యాయమైన చట్టాలు ఏమి కావాలి?


హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ అనేక సంవత్సరాలు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించి, అనేక కీలక కేసుల్లో తీర్పు చెప్పిన జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ తాజాగా న్యాయవ్యవస్థలో వైరుధ్యాల గురించి ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. అనేక సంవత్సరాల అనుభవంతో ఆయన న్యాయవ్యవస్థ గురించి అనేక కీలక ప్రశ్నలు లేవనెత్తారు. సాధారణ లిటిగేషన్లలో ఒక న్యాయమూర్తి తటస్థ ప్రేక్షక పాత్ర వహించవచ్చు. కాని ‘ఒక వైపు ధనికులు, శక్తిమంతులు, మరో వైపు పేదలు, అణగారిన వారు ఉన్నప్పుడు, ఒకవైపు బలమైన రాజ్యం, మరో వైపు సామాన్య మానవుడు ఉన్నప్పుడు, ఒక మహిళ, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు ఎలాంటి వనరులు లేని స్థితిలో కోర్టు తలుపు తట్టినప్పుడు న్యాయమూర్తి ప్రతిస్పందన ఎలా ఉండాలి? ఒకవైపు తన హక్కులు ఏమిటో తెలియని అమాయక, నిరక్షరాస్యుడైన గిరిజనుడు మరో వైపు అన్నిటినీ కబళించాలనే తోడేళ్లు ఉన్నప్పుడు ఏమి చేయాలి? సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వారి జీవితాలు అసమర్థ పాలన వల్ల విధ్వంసమవుతున్నప్పుడు అతడు కేవలం తన సీటులో కూర్చుని తటస్థ పాత్ర వహించాలా? ఎఫ్‌ఐఆర్ రికార్డింగ్ నుంచి ప్రతి దశలోనూ ధనికులు, అత్యంత శక్తిమంతులకు అనుకూలంగా సాక్ష్యాలను వక్రీకరిస్తున్నారని తెలిసినా మిన్నకుండిపోవాలా?’ అని జస్టిస్ రవీంద్రన్ వేసిన ప్రశ్నలు ప్రస్తుత న్యాయవ్యవస్థ తీరుతెన్నులను స్పష్టం చేస్తున్నది.రావిశాస్త్రి ఆరుసారాకథల్లో చెప్పిన వాస్తవాలన్నీ నిజమేనని రవీంద్రన్ నిర్ధారించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.


కేసులు అమ్ముడుపోయే సరుకులు కావు. అవి కేవలం గణాంక వివరాలు కూడా కావు. న్యాయవాదులకు జీవనోపాధి కల్పించేవి కానే కావు. కోర్టు ముందుకు వచ్చేవారిలో చాలా మంది అణగారిన, బలహీన వర్గాలకు చెందిన వారు కావచ్చు. ఒక నాగరిక మానవ పరిష్కారం కోసం, తమ న్యాయపోరాటంలో ఒక సమానమైన న్యాయంకోసం వారు చేస్తున్న ఆక్రందన న్యాయమూర్తి చెవులకు వినిపించాలి. ప్రతి న్యాయమూర్తి, న్యాయం, సత్యం అనే లక్ష్యం దిశగా ఒక క్రియాశీలక పోరాట యోధుడుగా పనిచేయాలి. బలహీనులు, అణగారిన వర్గాలకు, అవకాశాలు లేని వారికి సమాన అవకాశాలు కల్పించేలా చూడాలి. నిజాయితీతో కూడిన విచారణ, నిర్ణయాలు చేయడం అతడి లక్ష్యం కావాలి. అందుకోసం అతడు రాజ్యాంగ లక్ష్యాలు,రాజ్యాంగ విలువలకోసం పనిచేయాలి. సామాజిక బాధ్యత, ప్రాథమిక హక్కులు, ప్రజా ప్రయోజనాలు కాపాడడం అనేది రాజ్యాంగ చట్టాల అమలులో అత్యంత అవసరం అని జస్టిస్ రవీంద్రన్ చెప్పారు.


యుఏపిఏలోని సెక్షన్ 43డి(5) అనేది న్యాయపరమైన హేతుబద్ధతకు విరుద్ధమని, దీనివల్ల అరెస్టయిన వ్యక్తికి బెయిల్ రావడం అనేది అసాధ్యమని స్టాన్ స్వామి బొంబాయి హైకోర్టులో వాదించారు. నిజానికి ఒక వ్యక్తిపై అలాంటి కేసు నిలబడుతుందా లేదా అన్నది న్యాయస్థానాలు తేల్చవలిసి ఉంటుంది. కాని అలా తేల్చడంలో పలు కోర్టులు విఫలమవుతున్నాయి. నిందితుడు నాలుగేళ్ల పాటు జైలులో ఉన్న తర్వాత, ఎప్పుడు విచారణ పూర్తవుతుందో తేలని పరిస్థితుల్లో యుఏపిఏ క్రింద బెయిల్ ఇవ్వడం సరైనదేనని జస్టిస్ ఎన్‌వి రమణ ఈ ఏడాది జనవరిలో ఒక కేసులో తీర్పు చెప్పారు. నిందితుల కథనం వినకుండానే దర్యాప్తును ఎన్‌ఐఏ కోర్టు సుదీర్ఘకాలం పొడిగించడాన్ని కర్ణాటక హైకోర్టు కూడా ప్రశ్నించి బెయిల్ మంజూరు చేసింది. అసలు ప్రతి నేరాన్ని ఉగ్రవాద నేరంగా తీర్మానించడం ఎంతవరకు సరైనదని ప్రశ్నిస్తూ ఢిల్లీ హైకోర్టు ముగ్గురు విద్యార్థి కార్యకర్తల్ని బెయిల్ పై విడుదల చేసింది. ‘బెయిల్ అనేది హక్కు, జైలు అనేది మినహాయింపు కావాలి’ అని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది. దారుణమేమంటే న్యాయస్థానాలు ఎన్ని మేలుకొలుపు గీతాలు పాడుతున్నా, ప్రభుత్వాలు తమ అధికారాల్ని దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగాన్ని కాల రాస్తున్నాయి. స్టాన్ స్వామి మరణమైనా ప్రభుత్వాల్లో మానవత్వాన్ని పురికొల్పితే బాగుంటుంది.

ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి