Jun 13 2021 @ 01:01AM

అరవైయేళ్ల వాళ్లకూ అన్నయ్యనే!

ఓంకార్‌... బుల్లితెరపై విజయవంతమైన రియాలిటీ షో క్రియేటర్లలో ఒకరు. వెండితెరపై దర్శకుడిగానూ సత్తా చాటారు. ‘సిక్త్స్‌ సెన్స్‌’ నాలుగో సీజన్‌తో ‘స్టార్‌మా’ ఛానల్‌లో శనివారం నుంచి మళ్లీ సందడి షురూ చేశారు. అసలు, బుల్లితెరపై ఓంకార్‌ ప్రయాణం ప్రారంభమై పదిహేనేళ్లు పైమాటే! ఈ ప్రయాణం, కరోనా నేపథ్యంలో ప్రస్తుత చిత్రీకరణ పరిస్థితుల గురించి ‘చిత్రజ్యోతి’తో ఓంకార్‌ ప్రత్యేకంగా ముచ్చటించారు.


‘‘సినిమా దర్శకుడు కావాలనేది నా లక్ష్యం. బుల్లితెరకు రావడానికి ముందే... వెండితెరపై పేరు చూసుకోవాలనుకున్నా. అయితే, నాకెవరి మద్దతూ లేదు. ‘నేను నేరుగా వెళితే... దర్శకుడిగా అవకాశం ఇస్తారా? లేదా?’ వంటి ప్రశ్నలు మదిలో మెదిలేవి. అప్పుడు అనుకోకుండా ఓ ఇంగ్లిష్‌ పేపర్‌లో యాడ్‌ చూశా... ‘వాంటెడ్‌ యాంకర్స్‌’ అని! ప్రయత్నిద్దామని వెళ్లా. ఎందుకంటే... టీవీలో సక్సెస్‌ అయితే, సినిమాల్లో అవకాశం వస్తుందని! ఇంటర్వ్యూ పూర్తయిన వెంటనే ఉద్యోగం ఇచ్చారు. అలా... ‘ఇన్‌ కేబుల్‌’ ఛానల్‌లో యాంకర్‌గా నా ప్రయాణం ప్రారంభమైంది. అందులో రెండేళ్లు పని చేశాక... శాటిలైట్‌ ఛానళ్లలో అవకాశం సాధించడమే టార్గెట్‌గా పెట్టుకున్నా. సుమ, ఉదయభాను, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి - అప్పుడు టీవీ సామ్రాజ్యంలో ఈ నలుగురిదే హవా. మగవాళ్లకు అవకాశమే లేదు. ఒక్క షో లేదనుకుంట! ఆ నలుగుర్నీ చూసి నేనూ పెద్ద ఛానల్‌కు వెళ్లి, మంచి స్థాయికి చేరుకోవాలనుకున్నా. కానీ, వాళ్లను కాదని అవకాశం ఇస్తారా? లేదా? అనే అనుమానం ఒకటి. అప్పుడు ఆదిత్య అనే కొత్త ఛానల్‌ వస్తుందని తెలుసుకుని, ప్రయత్నించా. ‘ఇన్‌ కేబుల్‌’లో నన్ను ఎవరైనా సరిగా చూశారో? లేదో? గానీ... ఆ అనుభవం ఎంతో ఉపయోగపడింది. ‘ఆదిత్య’లో సాయంత్రం ఎనిమిదింటికి వచ్చే ‘అంకితం’ అనే షో నాకు ఇచ్చారు. అక్కణ్ణుంచి నా అసలైన ప్రయాణం ప్రారంభమైంది.


ఏడాదిలో విపరీతమైన పాపులారిటీ వచ్చింది!

‘ఆదిత్య’లో ఏడాది పని చేశా. ‘అంకితం’ షోతో విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అదొక క్రేజ్‌. ఎందుకొచ్చిందో తెలియదు! నంబర్‌ వన్‌ యాంకర్‌ కావాలని టార్గెట్‌ పెట్టుకున్నప్పుడు... ప్రత్యేకంగా ఏదొకటి చేయాలనుకున్నా. కాలర్స్‌ను కలుపుకోవాలని, మళ్లీ మళ్లీ నా షోకి కాల్‌ చేయాలని... కాల్‌ చేసిన ప్రతి ఒక్కరి పేరు, వాళ్లకు ఇష్టమైనవి, వాళ్లను నేను ఏమని పిలిచాను? వంటి వివరాలన్నీ ఓ డైరీలో నోట్‌ చేసుకునేవాణ్ణి. మళ్లీ కాల్‌ చేస్తే ఆ వివరాలతో పలకరించేవాణ్ణి. దాంతో అందరూ నన్ను తమలో ఒకడిగా చూసుకున్నారు. ఏడాది షో చేసేసరికి... జీ తెలుగులో ప్రసారమయ్యే ‘మాయాబజార్‌’ నుంచి ఆఫర్‌ వచ్చింది. అది చేశా. ‘జీ తెలుగు’లో అప్పటి ప్రోగ్రామింగ్‌ హెడ్‌, ఇప్పటి బిజినెస్‌ హెడ్‌ అనూరాధ మేడమ్‌ను నా దగ్గర ఒక కొత్త కాన్సెప్ట్‌ ఉందని కలిశా. అదే ‘మాయాద్వీపం’. అదొక సెన్సేషన్‌.


‘మాయాద్వీపం’తో అన్నయ్య ఇమేజ్‌!

నాకు ‘అన్నయ్య’ అనే బ్రాండ్‌ ఇమేజ్‌ క్రియేట్‌ అయ్యిందంటే... ‘మాయాద్వీపం’ వల్లే! షోకు వచ్చే పిల్లలు ‘అన్నయ్యా... అన్నయ్యా’ అని పిలవడంతో అందరూ అన్నయ్య అనడం మొదలుపెట్టారు. ఇప్పుడు, 60ప్లస్‌ వాళ్లూ అన్నయ్య అని పిలుస్తున్నారు. నన్ను అంత సొంతం చేసుకున్నారు. మధ్య తగరతి కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ షో చేయగలిగానంటే... కారణం స్నేహితులు, బంధువులే. అప్పు తీసుకుని షో చేశా. చేసేముందు అన్నవరం వెళ్లి సత్యనారాయణస్వామి ఆశీర్వాదం తీసుకున్నా. అక్కణ్ణుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘మాయాద్వీపం’ చేస్తానని అనూరాధ మేడమ్‌ను నేను అడిగితే... తర్వాత షోలు చేయమని మేడమ్‌ నన్ను అడిగారు. జీ తెలుగు తర్వాత మాటీవీలోకి ప్రవేశించా. ‘ఆట’, ‘ఛాలెంజ్‌’, ‘అదృష్టం’, ‘50-50 ఇట్స్‌ మై గేమ్‌ షో’, ‘100 పర్సెంట్‌ లక్‌’, ‘సిక్త్స్‌ సెన్స్‌’, ‘ఇస్మార్ట్‌ జోడీ’, ‘డ్యాన్స్‌ ప్లస్‌’... రెండు ఛానళ్లలో షోలు చేశా. ‘జీ తెలుగు’, మాటీవీ... రెండూ నాకు రెండు కళ్లు. నేను ఎక్కువగా ఎవరికీ వర్క్‌ చేయను. ఈ రెండు ఛానళ్లకు తప్ప! టీవీలో ఎదగడానికి అవకాశం ఇచ్చిన ‘జీ తెలుగు’ అమ్మ అయితే... సినిమాల్లో ప్రయోజకుణ్ణి చేసిన ‘మాటీవీ’ నాకు నాన్న. మా మద్దతుతో ‘రాజుగారి గది’ చేశా. 


‘రాజుగారి గది-4’ స్ర్కిప్ట్‌ రెడీ!

దర్శకుడిగా నా తొలి చిత్రం ‘జీనియస్‌’. తర్వాత ‘రాజుగారి గది’ ఫ్రాంఛైజీలో మూడు చిత్రాలు చేశా. కరోనా వల్ల ఏడాదిన్నర నుంచి సినిమాలు చేయలేదు. ఇప్పుడు షూటింగ్‌ చేసినా... ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియదు. మునుపటిలా థియేటర్లలో సినిమాలు విడుదలయ్యే రోజులు వచ్చినప్పుడు సినిమా ప్రారంభించాలని వేచి చూస్తున్నా. ‘రాజుగారి గది 4’ కాకుండా ఓ థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌, క్రీడా నేపథ్యంలో ఓ కథ... మొత్తం మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. గ్రామీణ నేపథ్యంలో ఓ కథ సిద్ధం చేయాలని ఆలోచన ఉంది. ‘రాజుగారి గది 4’ కంటే ముందు మరో సినిమా చేద్దామనుకున్నా. కానీ, కరోనా వల్ల రెండేళ్లు విరామం రావడంతో దాన్ని చేయాలనుకుంటున్నా. మరో రియాలిటీ షో రెడీ చేస్తున్నా. అది ఓటీటీకి చేస్తానా? టీవీకి చేస్తానా? అనేది త్వరలో చెబుతా. ఓటీటీల నుంచీ అవకాశాలు వస్తున్నాయి. మంచి ఉద్దేశంతో చేస్తున్న షో అది.’’


కరోనాతో నిర్మాతలకు ఖర్చు ఎక్కువే

‘‘కరోనా, లాక్‌డౌన్‌ ప్రతి ఒక్కరికి కొత్త పాఠాలు నేర్పుతున్నాయి. గతంలో ఆఫీసులకు ఉద్యోగులు రాకపోతే సమస్య అయ్యేది. ఇప్పుడు ఆఫీసులకు వెళ్లకుండా అన్ని పనులు జరుగుతున్నాయి. ప్రతి రంగంలోనూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉంది. వినోద పరిశ్రమలో షూటింగులకు ఆ అవకాశం లేదు. అందరూ సెట్‌కు రావాల్సిందే! అందుకని, లొకేషన్‌లో కచ్చితంగా ఓ డాక్టర్‌ ఉండేలా ఏర్పాట్లు చేశాం. టెంపరేచర్‌ పరీక్షించిన తర్వాతే సెట్‌లోకి ప్రతి ఒక్కర్నీ అనుమతిస్తున్నాం. ఉదాహరణకు... గతంలో 100మందితో పని చేస్తే, ఇప్పుడు 60మందితోనే చేస్తున్నాం. సెలబ్రిటీలతో పాటు ఐదు, ఆరుగురు రాకుండా చూస్తున్నాం. ఇంతకు ముందు ‘సిక్త్స్‌ సెన్స్‌’లో 200మంది ప్రేక్షకులు, విద్యార్థులు ఉండేవారు. తొలిసారి లేకుండా చూస్తున్నాం. స్వచ్ఛందంగా జనాల్ని తగ్గిస్తున్నాం. ఎవరిలోనైనా స్వల్ప లక్షణాలు కనిపిస్తే... వెంటనే క్వారంటైన్‌ పంపించి పరీక్షలు చేయిస్తున్నాం. ఏం లేదని తేలితేనే చిత్రీకరణకు రానిస్తున్నాం. ఒకవేళ పాజిటివ్‌ వస్తే, తగ్గిన 14 రోజుల తర్వాత మళ్లీ పిలుస్తున్నాం. సెట్‌లో భౌతిక దూరం పాటిస్తున్నాం. మాస్క్‌లు, పీపీఈ కిట్లు, శానిటైజేషన్‌, ఇతర జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. దీనివల్ల నిర్మాతలకు ఖర్చు ఎక్కువే. దీన్ని పక్కనపెడితే... భయాల్ని పక్కనపెట్టి, షూటింగులకు వస్తున్న సెలబ్రిటీలకు, టెక్నీషియన్లకు థ్యాంక్స్‌ చెబుతున్నా. కరోనా తర్వాత ‘ఇస్మార్ట్‌ జోడీ’, ‘డ్యాన్స్‌ ప్లస్‌’, ‘సిక్త్స్‌ సెన్స్‌ 4’ చేశా. మా ప్రొడక్షన్‌ ద్వారా మమ్మల్ని నమ్ముకున్న రెండొందల కుటుంబాలకు ఉపాధి కల్పించడం ఆనందంగా ఉంది.’’


తెలుగు టీవీ షోస్‌ స్థాయిని 

మరో మెట్టు ఎక్కించేలా...!

‘‘రియాలిటీ షోస్‌ కొన్నిటిలో ఎక్కువ మార్పులు చేయకూడదు. అటువంటిదే ‘సిక్త్స్‌ సెన్స్‌’. గతంలో షోలో ఆడినవాళ్లు మళ్లీ వచ్చినా... కొత్త టెన్షనే. మళ్లీ విజయం సాధించాలనే తపన ఉంటుంది. సుమారు 60-70 శాతం ఒకే పంథాలోనే షో నడుస్తుంది. ప్రతిసారీ రెండు రౌండ్లు మారుస్తాం. అలాగే, ఈసారి మార్పులు చేశాం... అటు ఆటగాళ్లకు, ఇటు వీక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడానికి! ఒంటిగంట వరకూ లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేసిన సమయంలో రెండు ఎపిసోడ్లు చిత్రీకరణ చేశాం. అప్పుడు కొత్తగా చేయలేకపోయాం. సాయంత్రం ఐదు వరకూ లాక్‌డౌస్‌ సడలించిన నేపథ్యంలో కొత్తవి అమలు చేస్తున్నాం. తెలుగు టీవీ షోస్‌ స్థాయిని మరో మెట్టు ఎక్కించేలా, సరికొత్తగా ఉంటుందీ ‘సిక్త్స్‌ సెన్స్‌’. ‘లాకర్‌లో పది లక్షలు ఉంటుంది. తీయవద్దు’ అని నేను అంటే... షోలో ఆటగాళ్లతో పాటు ఇంట్లో టీవీ ముందున్నవాళ్లు ఊహిస్తూ, ఆడుతూ ఉంటారు. అదే ఈ షో విజయ రహస్యం. అందుకని, పాత రౌండ్లు ఉంచుతూ... ‘గెస్‌ ద వెయిట్‌’, ‘గెస్‌ ద స్విచ్‌’ - రెండు కొత్త రౌండ్లు తీసుకొస్తున్నాం. సెలబ్రిటీల మధ్య టైబ్రేక్‌ వస్తే... గతంలో కంటే టెన్షన్‌ పెంచేలా కొత్త గేమ్‌ స్టార్ట్‌ చేశాం. ఫ్యామిలీ ఎమోషన్స్‌ యాడ్‌ చేయబోతున్నాం. మొత్తం మీద కొత్తగా ఉంటుంది. కచ్చితంగా నాలుగు నెలలు వీక్షకులకు వినోదం అందించడానికి ప్రయత్నిస్తాం. ఏ షో చేసినా... నాలుగు నెలలు ఉండేలా చూస్తా.’’