Abn logo
Apr 21 2021 @ 00:16AM

పర్యావరణ పరిరక్షణపై శ్రద్ధ

‘గ్లోబల్ వార్మింగ్ ’ దుష్ఫలితాలను కళ్ళెదురుగా చూస్తున్నాం. భూ ఉపరితలం వేడెక్కి మానవ మనుగడ దుర్లభంగా మారింది. మానవ ప్రేరిత దుష్కార్యాల వలన నదులు, సముద్రాలు కాలుష్య భరితంగా మారిపోయాయి. జలచరాలు కాలుష్యపు కోరల్లో చిక్కి, అంతరించిపోతున్నాయి. కొన్ని రకాల జీవులు శాశ్వతంగా అంతర్ధానమైపోతున్నాయి. అడవులు నరికివేత వలన విలువైన అటవీ సంపద నశించి పోవడమే కాకుండా, వన్యప్రాణుల మనుగడ కష్టతరంగా మారింది. వాయుకాలుష్యం, జలకాలుష్యం, వాతావరణ కాలుష్యం ఒకటేమిటి మానవ కల్పిత కాలుష్యాల నడుమ సకల జీవరాశుల మనుగడ క్లిష్టతరంగా మారింది. జీవసమతుల్యం దెబ్బతింది. జీవవైవిధ్యం అడుగంటింది. 


భూమిపై నివసిస్తున్న 800 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు పర్యావరణం మీద ఆధారపడి ఉంది. ప్రకృతిని పరిహసించి, పరిహరించడం వినాశనానికి హేతువు. ప్రకృతిలో నెలకొంటున్న పరిణామాలు ధరిత్రికి శాపంలా మారాయి. కొవిడ్–-19 మహమ్మారి ప్రభావం వలన 2021వ సంవత్సరపు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం కేవలం ప్రచార, ప్రసార, సాంకేతిక మాధ్యమాలకే పరిమితం కానున్నది. పర్యావరణం విషయంలో మనం మన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలి. పర్యావరణాన్ని కాలుష్యకారకాల నుంచి, మానవ సంకల్పిత అవాంఛనీయ చర్యల నుంచి కాపాడుకోవాలి. జీవవైవిధ్య పరిరక్షణ మన తక్షణ కర్తవ్యం. ప్రకృతిలోని ఇతర జీవరాశులను మన స్వార్ధం కోసం బలిచేయకుండా వాటిని కూడా సంరక్షించినప్పుడే ఈ ధరిత్రిపై మానవజాతి పదికాలాల పాటు సురక్షితంగా కాపాడబడుతుంది. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో సరైన అవగాహన కల్పించాలి. అన్ని పాఠశాలల్లోను పర్యావరణ పరిరక్షణపై ఉపాధ్యాయులు వారంలో కనీసం రెండు రోజులు విద్యార్థులకు  తప్పనిసరిగా అవగాహనా తరగతులు నిర్వహించాలి. పర్యావరణానికి, జీవరాశులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి మనం ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. పర్యావరణాన్ని సంరక్షించినంత కాలం మానవ మనుగడకు ప్రమాదం లేదు. అయితే పర్యావరణాన్ని విధ్వంసం చేసే ప్రస్తుత మానవ చర్యలు ఇలాగే కొనసాగితే  భూగ్రహమే నిర్జీవంగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణకు ప్రపంచమంతా ఏకతాటిపై నిలబడాలి. జీవవైవిధ్య పరిరక్షణ మీద కూడా పర్యావరణం ఆధారపడి ఉన్నందున ‘బయో డైవర్శిటీ’ కూడా ప్రాధాన్యత గల అంశంగా మారింది. జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తూనే పర్యావరణ పరిరక్షణపై ప్రపంచమంతా దృష్టి సారించాలి. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన జరిగే ‘ప్రపంచ ధరిత్రీ దినోత్సవం’ అమెరికాకు చెందిన పర్యావరణవేత్త ‘గేలార్డ్ నెల్సన్’ మానస పుత్రిక. ఆయన ఆలోచనలకు క్రియా రూపమే వరల్డ్ ఎర్త్ డే. ‘రిస్టోర్ అవర్ ఎర్త్’ అనే థీమ్ ఆధారంగా జరిగే ఈ సంవత్సరపు ధరిత్రీ దినోత్సవం మనం నివసించే భూమి పట్ల, భూమిపై నివసించడానికి అనువైన వాతావరణం పట్ల అవగాహన కలిగించాలి. పచ్చదనమే భూతలంపై జీవరాశులు పదికాలాల పాటు సజీవంగా మనుగడ సాగించడానికి మూలమన్న సత్యాన్ని గ్రహించి, ధరిత్రి పరిరక్షణకు కృషి చేయాలి.

సుంకవల్లి సత్తిరాజు

(ఏప్రిల్ 22 వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా...)

Advertisement
Advertisement
Advertisement