Abn logo
Sep 21 2021 @ 23:57PM

‘ఫ్లైఓవర్‌’ వ్యతిరేక దీక్ష భగ్నం

కళా వెంకటరావుకు వినతిపత్రం అందిస్తున్న దృశ్యం




బలవంతంగా ఖాళీ చేయించిన పోలీసులు

జేఆర్‌పురంలో ఉద్రిక్తత

రణస్థలం, సెప్టెంబరు 21: ఫ్లైఓవర్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా జేఆర్‌పురంలో వ్యాపారులు, స్థానికులు చేపడుతున్న దీక్షా శిబిరాన్ని మంగళవారం పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో కూర్చున్న ఫ్లైఓవర్‌ వ్యతిరేక కమిటీ సభ్యులు గోవింద, అప్పలసూరి, రాము, సతీష్‌, త్రినాథ, సన్నిలను పోలీసులు బెదిరించి పంపించేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ దీక్షలను ఎందుకు భగ్నం చేస్తున్నారని వారు ప్రశ్నించినా పోలీసులు వినలేదు. దీంతో కొద్దిపాటి ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీక్షాపరులకు సంఘీభావం తెలపడానికి మంగళవారం వస్తున్నట్టు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో ఉదయానికే జేఆర్‌పురం సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ రాజేష్‌ సిబ్బందితో శిబిరానికి చేరుకున్నారు. విపక్ష నేత వస్తున్న దృష్ట్యా శిబిరం మూసివేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి నిరసనలకు రాజకీయ పక్షాలు మద్దతు తెలపడం సాధారణమని ఫ్లైఓవర్‌ వ్యతిరేక కమిటీ ప్రతినిధులు చెప్పినా పోలీసులు వినలేదు. అక్కడున్న వారిని తరిమేయడంతో పాటు ఆటో డ్రైవర్ల సెల్‌ఫోన్లను లాక్కున్నారు. శిబిరంలో కుర్చీలను బయటపడేశారు. అంతలోనే అక్కడికి వచ్చిన కళా వెంకటరావుకు ఫ్లైఓవర్‌ వ్యతిరేక కమిటీ సభ్యులు, వ్యాపారులు వినతిపత్రం అందించారు. ఘటనపై కళా వెంకటరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. టీడీపీ హయాంలో ప్రజాభీష్టం దృష్ట్యా ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని నిలుపుదల చేశామని గుర్తుచేశారు. దీక్షా శిబిరం కొనసాగింపు, భవిష్యత్‌ కార్యాచరణపై త్వరలో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని ఫ్లైఓవర్‌ వ్యతిరేక కమిటీ సభ్యులు తెలిపారు.