Abn logo
Jul 29 2021 @ 00:27AM

గాల్లో తేలిపోదామా?

  • రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా సారథ్యంలో ఆకాశ ఎయిర్‌
  • నాలుగేళ్లలో 70 విమానాల కొనుగోలు యత్నం
  • 15 రోజుల్లో ఎన్‌ఓసీ లభిస్తుందని ఆశ


న్యూఢిల్లీ : భారత వారెన్‌ బఫెట్‌గా ఖ్యాతి గడించిన స్టాక్‌ మార్కెట్‌ గురు, కుబేరుడు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా తక్కువ ధరలకే సగటు పౌరులతో గగనవిహారం చేయించాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ‘ఆకాశ ఎయిర్‌’ పేరు తో త్వరలో ప్రారంభించనున్న విమానయాన సంస్థ కోసం రాబోయే నాలుగేళ్లలో 70 విమానాలు కొనుగోలు చేయాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఇందుకోసం ఆయన దాదాపు 3.5 కోట్ల డాలర్లు (రూ.260 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా సదరు సంస్థలో ఆయన వాటా 40 శాతంగా ఉండనుంది. మరో 15 రోజుల్లోనే తన విమానయాన సంస్థకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) లభిస్తుందని భావిస్తున్నట్టు ఆయన బ్లూంబర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.


ఆకాశ ఎయిర్‌ టీమ్‌లో డెల్టా ఎయిర్‌లైన్స్‌ మాజీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌తో పాటు మరికొందరు విమానయాన ప్రముఖులు కూడా ఉండనున్నారు. 180 సీట్లతో కూడిన  విమానాల కోసం తాము అన్వేషిస్తున్నట్టు రాకేశ్‌ చెప్పారు. వ్యయా ల భారం, తీవ్రమైన ధరల పోటీ కారణంగా మార్కెట్లో నిలవలేక పలు విమానయాన సంస్థలు దుకాణాలు మూసేసిన తరుణంలో ఝున్‌ఝున్‌వాలా చేస్తున్న ఈ ప్రయత్నం అతి పెద్ద సాహసమేనని పరిశీలకులు భావిస్తున్నారు.  ఎదురీతలోనూ సాహసం


కరోనా మహమ్మారి కన్నా చాలా ముందు నుంచే విమానయాన సంస్థలు అస్తిత్వం కోసం తీవ్ర పోరాటం చేస్తున్నాయి. దేశీయంగా రెండో పెద్ద విమానయాన సంస్థగా ఉన్న కింగ్‌ఫిషర్‌ 2012లో మూతపడగా జెట్‌ ఎయిర్‌వేస్‌ 2019లో దుకాణం మూసేసింది. చివరికి టాటాల జాయిం ట్‌ వెంచర్‌గా గగనవిహారం చేస్తున్న విస్తారా కూడా తాను ఆర్డర్‌ చేసిన విమానాల డెలివరీ ఆలస్యం చేయాలని కోరుతూ బోయింగ్‌, ఎయిర్‌బ్‌సలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెబుతున్నారు.


ఇప్పుడు దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో కూడా ఊహించిన స్థాయి కన్నా భారీ నష్టాలతో నడుస్తోంది.  ఇన్ని ప్రతికూల పరిస్థితులు మధ్య 460 కోట్ల డాలర్ల (రూ.34,500 కోట్లు) నికర ఆస్తులతో ఫోర్బ్స్‌ కుబేరుల జాబితాలో ఒకరుగా ఉన్న ఝున్‌ఝున్‌వాలా మాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో లేరు. ఒకప్పుడు త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ అయిన భారత మార్కెట్లో సరికొత్త అవకాశాలపై ఆయన దృష్టి సారించారని సన్నిహితులు చెబుతున్నారు. 


‘‘భారత విమానయాన మార్కెట్‌పై నేను చాలా బుల్లిష్‌గా ఉన్నాను’’ అన్న ఆయన మాటలే ఇందుకు నిదర్శనం. ప్రపంచంలోనే విమానయాన రంగంలో విజయం సాధించిన కొందరు ప్రముఖులు తన భాగస్వాములుగా ఉన్నారన్న విశ్వాసం ఆయన ప్రకటిస్తున్నారు.