Abn logo
Sep 27 2020 @ 02:52AM

మళ్లీ పోటెత్తుతున్న వరద

Kaakateeya

శ్రీశైలానికి 3.31 లక్షల క్యూసెక్కులు

నాగార్జునసాగర్‌ 20 గేట్లు ఎత్తివేత


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీరు, పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులకు వరద పోటెత్తుతోంది. రెండు రోజులుగా కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు తక్కువగా నమోదైన ఇన్‌ఫ్లో శనివారం పెరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి శనివారం సాయంత్రం 2.42 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 37 గేట్లు ఎత్తి 3,24,315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జల విద్యుత్తు కేంద్రంలో 22,315 క్యూసెక్కులతో కరెంటు ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. జూరాల నుంచి మొత్తం 3,47,440 క్యూసెక్కుల నీరు ఔట్‌ ఫ్లోగా ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలకుగాను 9.255 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,31,718 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,08,589 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు 2,87,322 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 20 గేట్లను ఎత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 589.80అడుగులు(311.44 టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి మొత్తం 2,87,322 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.


జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. కరీంనగర్‌లోని లోయర్‌ మానేరు డ్యాంలోకి భారీగా నీరు చేరుతుండటంతో 16 గేట్లను ఎత్తి 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-1లో ఉన్న బ్యారేజీల నుంచి సైతం నీటిని విడుదల చేస్తుండటంతో కాళేశ్వరం వద్ద గోదావరి 8.4 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలోకి 3.24 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో 46 గేట్లను ఎత్తి అంతే నీటిని వదులుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌ మానేరు ప్రాజెక్టులోకి 13,944 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 9 గేట్ల ద్వారా 18,978 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పార్వతి బ్యారేజీ నుంచి 60 గేట్ల ద్వారా 1,34,465 క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. శ్రీరామసాగర్‌లోకి 96వేల క్యూసెక్కులు చేరుతుండటంతో లక్ష క్యూ సెక్కుల నీటినివిడుదల చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement