Abn logo
Sep 12 2020 @ 15:48PM

అమ్మబాబోయ్‌.. ఈగలు!

Kaakateeya

కోయంబత్తూరు: ఈగ పగబడుతుందా..? పగబట్టి ఎవరినైనా చంపడానికి ప్రయత్నిస్తుందా..? ఈ డైలాగ్‌ ఎక్కడో విన్నట్లు లేదు..? రాజమౌళి ఈగ సినిమాలో విలన్‌ చెప్పే డైలాగ్‌ లేండి. అయితే ఈగలు నిజంగా పగబట్టి మనుషులను చంపక పోవచ్చు కానీ.. జీవితాన్ని నరకప్రాయం మాత్రం చేసేస్తాయి.. అవునండి.. నమ్మడం లేదా.. అయితే ఈ వార్త మీకోసమే. చదవండి. అది తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా, పోతిపళాయం గ్రామం. ఆ గ్రామంలో ఎటు చూసినా ఈగలే. రోడ్డుమీద, ఇళ్ల లోపల, మనుషుల మీద.. ఇలా ఒకటేమిటి.. గ్రామం మొత్తం ఈగలతో నిండిపోయి ఉంటుంది. అక్కడి ప్రజలు ఈ ఈగల గోల తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. కంటి నిండా నిద్ర కూడా పోలేకపోతున్నామని వాపోతున్నారు. భోజనం చేద్దామంటే పళ్లెంలో అన్నం మెతుకుల కన్నా ఈగలే ఎక్కువ కనబడతాయి. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా అధికారులు ఆ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో అవస్థలు తప్పడంలేదని బాధపడుతున్నారు.

దాదాపు నాలుగు రోజులుగా తమిళనాడులోని పోతిపళాయం గ్రామస్తులకు ఈ ఈగలు నరకం చూపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదుగానీ కుప్పలుతెప్పలుగా ఇక్కడ చేరిన ఈగలు ప్రజలకు జనజీవనాన్ని నరకప్రాయం చేసేశాయి. ఈగల బెడద నుంచి కాపాడాలని అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం కూడా ఉండడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మూడు, నాలుగుసార్లు ఫిర్యాదులు చేశామని, చూస్తాం.. చేస్తాం.. అని చెప్పడం తప్ప చర్యలు మాత్రం తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆహార పదార్థాలపై ఈగలు విపరీతంగా వాలుతున్నాయని, అవి తింటే కచ్చితంగా రోగాలు వస్తాయని, అయినా తమ గోడు వినేవారే లేరని ఆవేదన చెందుతున్నారు.

అసలే వర్షాకాలం, దానికితోడు దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ.. ఇలాంటి సమయంలో ఈ ఈగల బెడద తమను తీవ్రంగా భయపెడుతోందని గ్రామస్తుల ఆవేదన. ఎవరికైనా వ్యాధులు వస్తే అది కరోనా అని భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. కోయంబత్తూరులో ఇలా జరగడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా ఇలానే పలుగ్రామాల్లో పురుగులు, ఈగలు విజృంభించాయి. అయితే అప్పట్లో వెంటనే స్పందించిన అధికారులు పొగమందుతో ఈ కీటకాల భరతం పట్టారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో అధికారుల దృష్టంతా దానిపైనే కేంద్రీకృతమైంది. దాంతో ఈ ఈగలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కష్టం తీర్చాలని పోతిపళాయం వాసులు రెండు చేతులూ జోడించి ప్రార్థిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement