Abn logo
Jul 7 2020 @ 03:26AM

ఫిక్సర్‌ దండివాల్‌ అరెస్టు

నకిలీ ‘శ్రీలంక టీ20 లీగ్‌’ నిర్వహణపై ఫిర్యాదు

చండీగఢ్‌/న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫిక్సర్‌ రవీందర్‌ దండివాల్‌ను పంజాబ్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరచగా.. అతడిని ఐదు రోజులపాటు పోలీసు రిమాండ్‌కు అప్పగించారు. అంతర్జాతీయ టెన్నిస్‌ మ్యాచ్‌ల ఫిక్సింగ్‌లో రవీందర్‌ను కీలకంగా భావిస్తున్నారు. కాగా, దండివాల్‌ కదలికలను బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) గమనిస్తూనే ఉంది. యువ టీ20 లీగ్‌ పేరుతో మొహాలీలో ‘శ్రీలంక  టీ20 లీగ్‌’ను దండివాల్‌ నిర్వహించినట్టు ఫిర్యాదులు అందాయి. ఈ లీగ్‌ను యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా లంకలో కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారు. గ్రౌండ్‌ను బుక్‌ చేసిన వారిని కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ‘లంక ఆటగాళ్లే అనిపించేలా నల్లగా ఉన్న స్థానిక ప్లేయర్లను ఈ లీగ్‌కు ఎంపిక చేశారు. అందరూ చిన్నస్థాయి ఆటగాళ్లే. వాళ్ల ముఖాలు సరిగ్గా కనిపించకుండా మాస్క్‌లు ధరించారు. మొత్తంగా నెంబర్‌ జెర్సీలతో నిజమైన మ్యాచ్‌లు జరుగుతున్నట్టుగా భ్రమింప చేయాలనుకున్నార’ని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇందులో కొందరు రంజీ ఆటగాళ్ల హస్తం కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నామన్నారు. కాగా, ఈ లీగ్‌తో తమకు ఎటువంటి సంబంధం లేదని శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఈపాటికే ప్రకటించింది. 

Advertisement
Advertisement
Advertisement