Abn logo
Jan 18 2021 @ 06:45AM

కల్తీ మద్యం తాగి ఐదు ఆవులు మృతి!

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి పాతికమందికిపైగా మృతి చెందిన అనంతరం ఇప్పుడు అదే కల్తీ మద్యం తాగి ఐదు ఆవులు మృతి చెందాయి. ఈ ఉదంతం భోపాల్‌కు 405 కిలోమీటర్ల దూరంలోని దాతియా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా అధికారి ఒకరు ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఈ ఉదంతంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారన్నారు. ఈ ఉదంతంపై పశువైద్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ జీ దాస్ మాట్లాడుతూ జిల్లాలోని ఇంద్రగడ్ పరిధిలోని కంజర్ బస్తీలో పోలీసులు, కస్టమ్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. 

ఈ నేపధ్యంలోనే కల్తీ మధ్యం తాగి 20 ఆవులు అనారోగ్యం బారిన పడ్డాయని గుర్తించారు. వాటిలో ఐదు ఆవులు మృతి చెందాయి. 15 ఆవులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారన్నారు. అయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కల్తీ మద్యం తాగి 9 ఆవులు మృతి చెందాయి. దాతియాలోని గో సంవర్థన్ బోర్డు ఉపాధ్యక్షులు శిశుపాల్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ స్థానికంగా 9 ఆవులు మృతి చెందినప్పటికీ, ప్రభుత్వ అధికారులు ఈ వ్యవహారాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆవులు మృతి చెందాయన్నారు. కల్తీ మద్యాన్ని కాలువల్లో పోయడంతో ఆ నీటిని తాగిన ఆవులు ప్రాణాలు కోల్పోయన్నారు. 

Advertisement
Advertisement
Advertisement