Abn logo
Oct 24 2020 @ 05:10AM

మత్స్యకారులు క్షేమం

 కాకినాడ సమీపంలో తీరానికి...

 ఆనందంలోకుటుంబ సభ్యులు


పెదవాల్తేరు, అక్టోబరు 23: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. దీంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. నగరంలోని పెదజాలరిపేటకు చెందిన నలుగురు మత్స్యకారులు...నొల్లి అప్పలరాజు, పిల్లా వీర్రాజు, ఒలిశెట్టి అచ్యుతరావు, ఒలిశెట్టి గురునాథ్‌ బుధవారం తెల్లవారుజామున ఫైబర్‌ బోటులో సముద్రంలో చేపల వేటకు వెళ్లి...గురువారం రాత్రి వరకూ తిరిగి రాకపోవడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. అయితే వీరంతా శుక్రవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని భైరవపట్నం వద్ద తీరానికి చేరుకున్నట్టు ఇక్కడకు సమాచారం అందింది. 


గాలి, వర్షంతో దిశ తెలియలేదు...

ఈ సందర్బంగా గల్లంతైన మత్స్యకారులు ఫోన్‌లో ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ తీరం నుంచి 50 మైళ్ల దూరం సముద్రంలోకి వెళ్లిన తరువాత పెద్ద గాలి, వర్షంతో తెరచాప విరిగిపోయిందన్నారు. రాత్రి 11 గంటల వరకు దానికి మరమ్మతులు చేసుకుని ప్రయాణం కొనసాగించామని, కొంతదూరం వచ్చిన తరువాత వర్షం మరింత పెరిగి, దిశ తెలియకుండా పోయిందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ సోనా బోట్లు కనిపించాయని, అందులోని వారు తాము కాకినాడకు 43 కిలోమీటర్ల దూరంలో వున్నట్టు చెప్పారన్నారు. దీంతో సాయంత్రం ఐదు గంటలకు భైరవపట్నం చేరుకున్నామన్నారు.

Advertisement
Advertisement